TG Schools Holiday : హైదరాబాద్ లోని విద్యాసంస్థలకు సోమవారం సెలవు, కలెక్టర్ ప్రకటన

4 months ago 95
ARTICLE AD

TG Schools Holiday : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లుండి(సెప్టెంబర్2) హైదరాబాద్ లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్ కలెక్టర్ ప్రకటన జారీ చేశారు.

హైదరాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిరంతరం విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏమైనా సమస్యలుంటే ప్రజలు 040-23202813, 9063423979 నెంబరుతో పాటు ఆర్డీవో హైదరాబాద్ 7416818610, 9985117660, సికింద్రాబాద్ ఆర్డీవో ఫోన్ నెంబర్ 8019747481లకు సంప్రదించాలని సూచించారు.

స్కూళ్ల సెలవులపై కలెక్టర్లదే నిర్ణయం-సీఎస్

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో రాగల 48 గంటల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీచేసింది. భారీ వర్షాలపై సీఎస్ శాంతికుమారి కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి గంటకూ వర్షాలపై రిపోర్టులు తీసుకుని పరిస్థితులపై చర్చించాలని ఆదేశించారు. అలాగే భారీగా వర్షాలు కురిసే జిల్లాల్లో అవసరమైతే ముందస్తుగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలన్నారు. స్కూళ్లకు సెలవుపై పూర్తిగా నిర్ణయాధికారం కలెక్టర్లదే అన్నారు.

రేపు ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు

హైదరాబాద్, రంగారెడ్డి, భువనగిరి, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. రేపు(ఆదివారం) ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, నిర్మల్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, మహబూబ్‌నగర్‌,నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించింది.

అనుమతి లేకుండా ఇంజినీర్లు హెడ్ క్వార్టర్ ను వదిలి వెళ్లొద్దు- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తున్నందున నీటిపారుదల శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ రెడ్ ఏలెర్ట్ ప్రకటించింది. అనుమతి లేకుండా ఇంజినీర్లు హెడ్ క్వార్టర్ ను విడిచిపోవద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ప్రతి ఒక్కరూ హెడ్ క్వార్టర్ లోనే ఉండాలని సూచించారు. రెడ్ ఎలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఎవ్వరూ సెలవులు పెట్టొద్దని ఆదేశించారు. ఎప్పటికప్పుడు రిజర్వాయర్లు, చెరువులను మానిటరింగ్ చేస్తుండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

అదేవిధంగా ఎప్పటికప్పుడు నీటి స్థాయిలను పర్యవేక్షించాలన్నారు. మరీ ముఖ్యంగా ఓవర్ ఫ్లో ను నిరోధించడానికి గేట్లు, స్పిల్ వేల పనితీరును క్షుణ్ణంగా పరిశీలంచాలన్నారు. ఎప్పటికప్పుడు డ్యామ్ లు కట్టలు, కెనాల్ లను తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రమాదం పొంచి ఉందన్న ప్రాంతంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అంతకు మించి రైల్వే ఎఫెక్టెడ్ చెరువుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితిలో నీటిపారుదల శాఖ ఇంజినీర్లు వేగవంతంగా స్పందించాలన్నారు. విపత్తులు సంభవిస్తే స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలను అప్రమత్తం చెయ్యాలని అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

Read Entire Article