HCU Protest: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆందోళన, విద్యార్ధుల సస్పెన్షన్, జరిమానాలతో కలకలం

2 months ago 59
ARTICLE AD

తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hcu Protest: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆందోళన, విద్యార్ధుల సస్పెన్షన్, జరిమానాలతో కలకలం

HCU Protest: హెచ్‌సీయూలో విద్యార్థి సంఘ అధ్య‌క్షుడితో స‌హా ఐదుగురు విద్యార్థులు స‌స్పెండ్‌ చేయడం, మ‌రో ఐదుగురు విద్యార్థుల‌కు రూ.10వేల చొప్పున జ‌రిమానా విధించడంతో వర్శిటీలో విద్యార్ధులు ఆందోళనకు దిగారు.

సెంట్రల్ యూనివర్శిటీలో సస్పెన్షన్లపై విద్యార్ధుల ఆందోళన

సెంట్రల్ యూనివర్శిటీలో సస్పెన్షన్లపై విద్యార్ధుల ఆందోళన

HCU Protest: తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌తిష్టాత్మ‌క యూనివ‌ర్శిటీ, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన జాతీయ విద్యా సంస్థ‌ హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీలో విద్యార్థి సంఘ అధ్య‌క్షుడితో స‌హా ఐదుగురు విద్యార్థులను యూనివ‌ర్శిటీ అడ్మినిస్ట్రేష‌న్ స‌స్పెండ్ చేసింది.

ఐదుగురు విద్యార్థుల‌పై కేసులు నమోదు చేయడం, మ‌రో ఐదుగురు విద్యార్థుల‌కు ఒక్కొక్క‌రికి రూ.10 వేలు చొప్పున జ‌రిమానా విధించడంపై విద్యార్ధులు భగ్గుమన్నారు. విద్యార్థులపై సస్పెన్ష‌న్ అమ‌లైతే విద్యార్థుల‌కు వ‌చ్చిన ఫెలోషిప్స్ ర‌ద్దు అవుతాయి.

స‌స్పెన్షన్‌కు గురైన విద్యార్థులు

హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీ స్టూడెంట్స్‌ యూనియ‌న్ ప్రెసిడెంట్ అతీక్ అహ్మ‌ద్ (పీహెచ్‌డీ) (యూనివ‌ర్శిటీ అధికారిక విద్యార్థి సంఘ ఎన్నిక‌ల్లో గెలిచిన అధ్యక్షుడు), ఎస్ఎఫ్ఐ యూనివ‌ర్శిటీ క‌మిటీ కార్యద‌ర్శి, హెచ్‌సీయూఎస్‌యూ మాజీ కార్య‌ద‌ర్శి కృపా మ‌రియా జార్జ్ (పీహెచ్‌డీ), ఎస్ఎఫ్ఐ యూనివ‌ర్శిటీ నాయ‌కులు ఆసికా వి.ఎం (పీహెచ్‌డీ), సోహెల్ అహ్మ‌ద్ (ఇంటీగ్రేటెడ్ ఎంఎస్‌సీ), జి.మోహిత్ (పీహెచ్‌డీ)ల‌ను ఆరు నెల‌ల పాటు యూనివ‌ర్శిటీ అడ్మినిస్ట్రేష‌న్ సస్పెండ్ చేసింది. వీరిని ఒక సెమిస్ట‌ర్ (జూలై-డిసెంబ‌ర్‌) సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. స‌స్పెన్ష‌న్ స‌మ‌యంలో వారు హాస్ట‌ల్‌ను కూడా ఖాళీ చేయాల‌ని ఆదేశాల్లో పేర్కొంది. ఐదుగురు విద్యార్థుల‌పై (అక్ర‌మ చొర‌బాటు, హౌస్ దిగ్భందం) వంటి కేసుల‌ను నమోదు చేశారు.

రూ.10 వేల జ‌రిమానా ఎదుర్కొంటున్న విద్యార్థులు

యూనివ‌ర్శిటీలో మ‌రో ఐదుగురు విద్యార్థులపై ఒక్కొక్క‌రికి రూ.10 వేల చొప్పున జ‌రిమానా విధించారు. ఎస్ఎఫ్ఐ యూనివ‌ర్శిటీ నాయ‌కులు య‌ర్రం అజ‌య్ కుమార్ (పీహెచ్‌డీ), సుభాషినీ ఎస్ఎస్ (పీహెచ్‌డీ), రిషికేష్ పీ.కృష్ణ‌న్ (ఇంటిగ్రేటెడ్ ఎంఎ), పంక‌జ్ కుమార్ (పీహెచ్‌డీ), గోడ లిఖిత్ కుమార్ (ఇంటిగ్రేటెడ్ ఎంఎ)ల‌కు జ‌రిమానా విధించింది. ఒక్కొక్క‌రు రూ.10 వేలు చొప్పున చెల్లించాల‌ని ఆదేశించింది.

ఏం జరిగింది…

యూనివ‌ర్శిటీలో ప్ర‌తి ఏడాది నిర్వహించే క‌ల్చ‌ర‌ల్ ఫెస్టో (సుకూన్-2024)ను ఈ ఏడాది నిర్వ‌హించాల‌ని కోర‌డ‌ంతో వివాదం మొదలైంది. "సుకూన్-2024ను నిర్వ‌హించ‌కుండా ఆపేయాల‌ని ప్ర‌య‌త్నించిన యూనివ‌ర్శిటీ అడ్మినిస్ట్రేష‌న్ చ‌ర్య‌ల‌ను వ్య‌తిరేకిస్తూ ఆందోళ‌న చేసినందుకు విద్యార్థుల‌పై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది.

సుకూన్-2024ను మే 23 నుంచి 25 వ‌ర‌కు నిర్వ‌హించాల‌ని మే 3న హెచ్‌సీయూ స్టూడెంట్ యూనియన్ ప్ర‌తినిధి బృందం యూనివ‌ర్శిటీ వైస్ చాన్స‌ల‌ర్‌, రిజిస్ట్ర‌ర్‌కి లేఖలను ఇచ్చారు. ఎన్నిక‌ల నేప‌థ్యంలో పోలీస్ అనుమ‌తి క‌ష్టమ‌ని, మే 13న కూడా రాష్ట్రంలో ఎన్నిక‌లు ఉన్నాయ‌ని, ఆ త‌రువాత మాట్లాడుదామ‌ని వైస్ చాన్స‌ల‌ర్‌, రిజిస్ట్ర‌ర్ అన్నారు. మే 16న రిజిస్ట్ర‌ర్, సుకూన్ క‌మిటీ హెచ్‌సీయూఎస్‌యూ ప్ర‌తినిధి బృందాన్నిస‌మావేశానికి పిలిచారు.

సుకూన్‌ను రాత్రి ప‌ది గంట‌ల‌కే ముగించాలని, సౌండ్స్ సిస్ట‌మ్ వాల్యూమ్ వంటి ప‌ది నుంచి 12 ష‌ర‌తులు విధించా‌ర‌ని రిజిస్ట్ర‌ర్, సుకూన్ క‌మిటీ విద్యార్థి బృందానికి తెలిపారు. ఆ ష‌ర‌తులతో సుకూన్‌ను నిర్వ‌హించ‌డం చాలా క‌ష్ట‌మ‌ని హెచ్‌సీయూఎస్‌యూ ప్ర‌తినిధులు అధికారులకు తెలిపారు. మ‌రుస‌టి రోజు మే 17న‌ వైస్ చాన్స‌ల‌ర్ స్టూడెంట్ యూనియ‌న్ ప్ర‌తినిధుల‌ను స‌మావేశానికి పిలిచారు. వైస్ చాన్స‌ల‌ర్‌కు విద్యార్థి ప్ర‌తినిధులు ప‌రిస్థితులను వివ‌రించారు. ఇప్ప‌టికే అన్నింటికి అడ్వాన్సులు చెల్లించామని, విద్యార్థులు కూడా తమ ప్రయాణాలను రద్దు చేసుకొని ఉన్నార‌ని వివరించారు. అయితే ఫెస్ట్‌కు పోలీసు అనుమ‌తి ఇవ్వాల్సిందేన‌ని వైస్ చాన్సల‌ర్ తేల్చి చెప్పి, వెళ్లిపోయారు.

దీంతో విద్యార్థి ప్ర‌తినిధులు అదే రోజు మ‌ధ్యాహ్నం నుంచి సాయంత్రం వ‌ర‌కు చ‌ర్చించి, గ‌చ్చిబౌలి డీసీపీ వినిత్‌ను సాయంత్రం క‌లిశారు. విద్యార్థి బృందం డీసీపీకి మొత్తం వివ‌రించారు. అందుకు డీసీపీ స్పందించి సుకూన్ నిర్వ‌హించుకునేందుకు అనుమ‌తి ఇచ్చారు. ష‌ర‌తులు లేకుండా చేస్తామ‌ని, అయ‌తే ఎటువంటి గొడ‌వులు లేకుండా శాంతియుతంగా నిర్వ‌హించాల‌ని సూచించారు. అందుకు విద్యార్థి బృందం కూడా స‌మ్మ‌తించింది.

డీసీపీ అనుమ‌తి ఇచ్చిన విష‌యాన్ని రాత్రి 8 గంట‌ల‌కు యూనివ‌ర్శిటీ అడ్మినిస్ట్రేష‌న్‌కు విద్యార్థి బృందం తెలిపింది. రాత్రి 9.30 స‌మ‌యంలో రిజిస్ట్ర‌ర్‌, సీఈఈ, డీఎస్‌డ‌బ్ల్యూ విద్యార్థి సంఘ ప్ర‌తినిదులు పిలిపించారు. పోలీసులు అనుమ‌తి ఇచ్చినా సుకూన్ నిర్వ‌హించ‌డానికి కుద‌ర‌ద‌ని అన్నారు. ఎందుకు కుద‌ర‌దో కార‌ణాలు చెప్పాల‌ని విద్యార్థి ప్ర‌తినిధులు అడిగారు. అందుకు యూనివ‌ర్శిటీ అధికారులు మా కార‌ణాలు మాకుంటాయని అవ‌న్నీ బ‌య‌ట‌కు చెప్పలేమని స‌మావేశం మ‌ధ్య‌లోనే రాత్రి 10.30 స‌మ‌యంలో లేచి వెళ్లిపోయారని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.

సుకూన్‌ 2024 ర‌ద్దు చేయాల్సి వ‌స్తుంద‌ని, అలా జ‌ర‌గ‌కూడ‌ద‌ని భావించిన విద్యార్థులు వీసీ అపాయింట్‌మెంట్ కోసం ప్ర‌య‌త్నించిన ఆయన ఇవ్వ‌లేదని, ఫోన్‌లో కూడా అందుబాటులోకి రాలేదని చెబుతున్నారు. రాత్రి 12.30 గంట‌ల‌కు వీసీ గెస్ట్ హౌస్ వ‌ద్ద‌కు వెళ్లి వీసీని క‌లుస్తామ‌ని కోరిన‌ా ఆయ‌న అంగీక‌రించ‌లేదు. దీంతో విద్యార్థులు అక్క‌డే ఆందోళ‌న‌కు దిగారు.ఆ తర్వాత గ‌చ్చిబౌలి పోలీస‌ులతో కలిసి వచ్చిన యూనివ‌ర‌ర్శిటీ అధికారులు విద్యార్ధులను వెళ్లిపోవాల‌ని కోరారని, అధికారుల‌తో మాట్లాడించే వరకు అక్కడే ఉంటామని రాత్రంతా అక్క‌డే రోడ్డుపైనే ప‌డుకున్నారు.

సస్పెన్షన్లు, జరిమానాలపై  సెంట్రల్ యూనివర్శిటీ  విద్యార్ధుల నిరసనలు

సస్పెన్షన్లు, జరిమానాలపై సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్ధుల నిరసనలు

ఈ పరిణామాలపై మే 18న రిజిస్ట్ర‌ర్ దేవేష్ నిగ‌మ్ పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఆదివారం సెల‌వు అయిన‌ప్పటీ అత్య‌వ‌స‌రంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) మీటింగ్‌ను వైస్ చాన్స‌ల‌ర్‌ నిర్వ‌హించారు. ఆ సమావేశంలో 35 మంది విద్యార్థుల‌ను స‌స్పెండ్ చేయాల‌ని వీసీ ప్ర‌తిపాదించారు. అందుకు చాలా మంది ఈసీ స‌భ్యులు అంగీక‌రించ‌లేదు. అందుకు ఒక ప్ర‌క్రియ ఉంటుంద‌ని, ఆ ప్ర‌క్రియ ప్ర‌కారం వెళ్లాల‌ని, అంతేత‌ప్ప ఎవ‌రికి తోచిన‌ప్పుడు వారు విద్యార్థుల‌ను స‌స్పెండ్ చేయ‌కూడ‌ద‌ని ఈసీ స‌భ్యుల్లో కొందరు అభ్యంతరం తెలిపారు.

దీంతో వీసీ ప్రొక్టోరియ‌ల్ బోర్డ్ ఫిర్యాదు చేశారు. ప్రొక్టోరియ‌ల్ బోర్డు సోమ‌వారం (మే 20) నోటీస్ ఇచ్చింది. అయితే మే 24 మీటింగ్ ఏర్పాటు చేసి విచార‌ణ చేశారు. విద్యార్థులు జ‌రిగింది వివ‌రించారు. అయిన‌ప్ప‌టికీ ముందే నిర్ణ‌యించుకొని వ‌చ్చిన ప్రొక్టోరియ‌ల్ బోర్డు స‌భ్యులు, త‌ప్పు ఒప్పుకోవాలని ఆదేశించారు. అందుకు విద్యార్థులు స‌సేమీరా అనడంతో వారం రోజుల త‌రువాత మే 31 స‌స్పెన్ష‌న్ ఆర్డ‌ర్ జారీ చేశారని చెబుతున్నారు. ఇందులో ఐదుగురిని స్ప‌స్పెండ్ చేశారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వీసీ గెస్ట్‌హౌస్‌లో (అక్ర‌మ చొర‌బాటు, గృహ నిర్బంధం అభియోగాలను మోపారు. ఐదుగురికి ఒక్కొక్క‌రికి రూ.10 వేలు జ‌రిమానా విధించారు.

అప్ప‌టి నుంచి వైస్ చాన్స‌ల‌ర్‌ను క‌ల‌వ‌డానికి విద్యార్థులు ప్ర‌య‌త్నించిన వారికి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని, 20 రోజుల త‌రువాత జూన్ 20న అపాయింట్ మెంట్ ఇచ్చారని వైస్ చాన్స‌ల‌ర్‌ను క‌లిసిన విద్యార్థులు ఈ అంశాన్ని వ్య‌క్తిగ‌తంగా తీసుకోవ‌ద్ద‌ని, తాము నిర్వ‌హించుకునే సుకూన్ గురించే త‌ప్ప‌, త‌మ‌కు ఎటువంటి దురుద్దేశం లేద‌ని విద్యార్థులు వివరణ ఇచ్చినా వీసీ వినలేదని ఆరోపిస్తున్నారు.

దీంతో ఈ నె 24వ తేదీ నుంచి రోహిత్ వేముల ఎక్క‌డైతే ఆందోళ‌న చేశారో అక్క‌డ ఈ ఐదుగురు విద్యార్థులు ఆందోళ‌న చేప‌ట్టారు. ప్రస్తుతం వారి ఆందోళ‌న కొన‌సాగుతోంది. యూనివ‌ర్శిటీలో ఎబీవీపీ మిన‌హా మిగిలిన అన్ని సంఘాలు విద్యార్థుల ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచాయి. విద్యార్థుల‌పై స‌స్పెన్ష‌న్ ఎత్తివేయాల‌ని, అక్ర‌మ ఎఫ్ఐఆర్‌ల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని, జ‌రిమానాను ర‌ద్దు చేయాల‌ని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.శుక్ర‌వారం జరిగే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ స‌మావేశంలో జరిగే చర్చలు నిర్ణ‌యాలు బ‌ట్టి త‌మ భ‌విష్య‌త్తు పోరాటం ఉంటుంద‌ని హెచ్‌సీయూఎస్‌యూ ప్రెసిడెంట్ అతీక్ అహ్మ‌ద్ తెలిపారు.

(రిపోర్టింగ్, జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Read Entire Article