Hyderabad Vijayawada Highway : హైదరాబాద్-విజయవాడ మార్గంలో కిలోమేటర్ల మేర ట్రాఫిక్ జామ్, వాహనాలు దారి మళ్లింపు

2 weeks ago 29
ARTICLE AD

Hyderabad Vijayawada Highway : హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నందిగామ వద్ద వాగు పొంగడంతో హైవే పైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను ఖమ్మం వైపు, నార్కట్‌పల్లి- అద్దంకి రహదారి మీదుగా మళ్లిస్తున్నారు. కోదాడ-జగ్గయ్యపేట మధ్య భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్ ఎప్పుడు క్లియర్ అవుతుందోనని ప్రయాణికులు ఆందోళనకు చెందుతున్నారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్లేందుకు నార్కట్‌పల్లి మీదుగా వయా మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడకు వాహనాలను మళ్లిస్తున్నారు.

సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు

హైవేపై ట్రాఫిక్‌ నేపథ్యంలో వాహనదారులు నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా వెళ్లాలని పోలీసులు సూచించారు. శనివారం సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో చెరువులు పొంగుతున్నాయి. జిల్లాలోని లక్కవరం రోడ్‌లో అత్యధికంగా 27.3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. చిలుకూర్‌లో 26.7, మట్టంపల్లిలో 24, కోదాడలో 17, రఘునాథపాలెంలో 15, బాలారంతండా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

వరంగల్ హైవే మార్గంలో ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ నగరంలో శనివారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. పలు కాలనీల్లోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వాహనాల రాకపోకలకు తీవ్రఅంతరాయం ఏర్పడింది. శనివారం సాయంత్రం ఉప్పల్ ప్రాంతంలో మేడిపల్లి నుంచి ఉప్పల్ రింగ్ రోడ్డు వరకు వరంగల్ హైవే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ల మేర రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. హైవేపై ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీస్ సిబ్బంది శ్రమిస్తున్నారు. ఉప్పల్ నుంచి వరంగల్ హైవే మార్గంలో ఫ్లై ఓవర్ నిర్మాణపనులు జరుగుతుండటం, వర్షంతో రోడ్లన్నీ జలమయం కావడంంతో ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

హైదరాబాద్ లో అధికారులు బీఅలర్ట్ - మంత్రి పొన్నం

తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ , వాటర్ వర్క్స్ , డీఆర్ఎఫ్ , ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, విద్యుత్ ఇతర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని అధికారులకు తెలిపారు. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసినప్పుడు నీళ్లు నిల్వ ఉండే 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది నీళ్లు వెంటనే వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎక్కడైతే వర్షం కురిసి ఇబ్బందులు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో అధికారులకు ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు.. సమస్య తీవ్రమైతే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అధిక వర్షపాతం ఉన్న ప్రదేశాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఇక్కడ జీహెచ్ఎంసీ బృందాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

"వర్షం కురిసిన సమయంలో లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలి. పాత భవనాల వద్ద ఉన్నవారిని ఖాళీ చేయించాలి. గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. వర్షాలు కురిసినపుడు విద్యుత్ స్తంభాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, విద్యుత్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. పోలీసులు, జీహెచ్ఎంసీ , హెచ్ఎండీఏ వివిధ విభాగాల అధికారులు ప్రజలు ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో పని చేయాలి" అని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

Read Entire Article