Hyderabad Real Estate Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ స్కామ్, రూ.60 కోట్లు వసూలు చేసిన భారతి బిల్డర్స్

3 months ago 67
ARTICLE AD

Hyderabad Real Estate Cheating : హైదరాబాద్ లో మరో రియల్ ఎస్టేట్ కుంభకోణం వెలుగు చూసింది. భారతి లేక్ వ్యూ ప్రీ-లాంచ్ ఆఫర్ పేరిట కోట్లు దండుకున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలోని భారతి లేక్ వ్యూ వద్ద అపార్ట్‌మెంట్ల కోసం ప్రీ లాంచ్ ఆఫర్లతో మోసానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను సైబరాబాద్‌లోని ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో భారతి బిల్డర్స్ ఛైర్మన్ దూపాటి నాగరాజు, భారతి బిల్డర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ముల్పూరి శివరామ కృష్ణ, భారతి బిల్డర్స్ సీఈవో తొడ్డకుల నర్సింహారావు ఉన్నారు. వీరిపై చీటింగ్ తో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

అసలేం జరిగింది?

2021లో దూపాటి నాగరాజు, ముల్పూరి శివరామ కృష్ణ హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో భారతి బిల్డర్స్ ను స్థాపించారు. కొంపల్లిలో 6.23 ఎకరాల భూమిలో భారతి లేక్ వ్యూ పేరుతో రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్లు నిర్మించాలని భావించారు. ఈ నిర్మాణాలకు ప్రీ-లాంచ్ ఆఫర్ స్కీమ్ ను ప్రారంభించారు నిందితులు. చదరపు అడుగుకు రూ. 3,200 తక్కువ ధరతో ఫ్లాట్లను విక్రయించేందుకు ప్రచారం చేశారు. తక్కువ ధర, నగరానికి సమీపంలో ఉండడం... కొనుగోలుదారులను ఆకర్షించడానికి పలు రకాల బ్రోచర్‌లను పంపిణీ చేశారు. అయితే కస్టమర్లను ఆకర్షించే ఫ్లాట్లను అమ్మేందుకు కొంపల్లిలోని వెంచర్ సైట్, మాదాపూర్‌లోని భారతి బిల్డర్స్ ఆఫీసులో సమావేశాలు నిర్వహించేవారు. ప్లాట్ల అమ్మకాలను పెంచడానికి తొడ్డాకుల నర్సింహారావు అలియాస్ పొన్నారిని భారతి బిల్డర్స్ సీఈవోగా నియమించారు. ఫ్లాట్ల అమ్మకాలపై నర్సింహారావుకు భారీగా కమీషన్ ఆఫర్ చేశారు.

మరో పార్టీకి రూ.100 కోట్లకు అమ్మకం

దీంతో నర్సింహారావు ప్రీ లాంచ్ ఆఫర్ అంటూ కస్టమర్లను ఆకర్షించాడు. దీంతో సుమారు 350 మందిపైగా ప్రీ లాండ్ ఆఫర్ లో మొత్తం రూ.50-60 కోట్లు పెట్టుబడి పెట్టారు. అయితే కొనుగోలుదారులకు చెప్పినట్లు అపార్టమెంట్ నిర్మించడంలో బిల్డర్స్ విఫలమయ్యారు. అపార్ట్మెంట్ కట్టకుండా నిందితులు 6.23 ఎకరాల భూమిని మరో పార్టీకి రూ.100 కోట్లకు అమ్మేశారు. దీంతో మోసపోయామని తెలుసుకున్న కస్టమర్లు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు భారతి బిల్డర్స్ ఛైర్మన్, సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రీ లాంచ్ ఆఫర్లలో పెట్టుబడి పెట్టవద్దని పోలీసులు సూచించారు. ఇలాంటి అనుమానాస్పద ఆఫర్లు లేదా రియల్ ఎస్టేట్ కార్యకలాపాలను అధికారులకు తెలియజేయాలని సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు ప్రజలను కోరారు. బాధ్యులపై విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా చేస్తామని పోలీసులు తెలిపారు.

Read Entire Article