Jagan House Issue : మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద అక్రమనిర్మాణాలు కూల్చివేత, జీహెచ్ఎంసీ అధికారిపై బదిలీవేటు

3 months ago 63
ARTICLE AD

తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jagan House Issue : మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద అక్రమనిర్మాణాలు కూల్చివేత, జీహెచ్ఎంసీ అధికారిపై బదిలీవేటు

Jagan House Issue : హైదరాబాద్ లో మాజీ సీఎం జగన్ నివాసం వద్ద అక్రమ కట్టడాలు కూల్చివేత ఘటనలో అధికారిపై వేటుపడింది. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడేపై జీహెచ్ఎంసీ కమిషనర్ బదిలీ వేటు వేశారు.

 జగన్ ఇంటి వద్ద అక్రమనిర్మాణాలు కూల్చివేత, జీహెచ్ఎంసీ అధికారిపై బదిలీవేటు

జగన్ ఇంటి వద్ద అక్రమనిర్మాణాలు కూల్చివేత, జీహెచ్ఎంసీ అధికారిపై బదిలీవేటు

Jagan House Issue : హైదరాబాద్ లో ఏపీ మాజీ సీఎం జగన్ నివాసం లోటస్ పాండ్ ముందు అక్రమ కట్టడాలు కూల్చివేతకు ఆదేశాలిచ్చిన అధికారిపై వేటుపడింది. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్, ఐఏఎస్ అధికారి హేమంత్ బోర్కడేపై జీహెచ్ఎంసీ కమిషనర్ బదిలీ వేటు వేశారు. జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేతపై బల్దియా కమిషనర్ సీరియస్ అయ్యారు. ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా కూల్చేవేత చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మంత్రి ఆదేశాలతో జీహెచ్ఎంసీ అధికారులు జగన్ ఇంటి వద్ద నిర్మాణాలు కూల్చివేసినట్లు ప్రచారం జరిగింది. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ ను జీఐడీకి రిపోర్ట్ చేయాలని బల్దియా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బాధ్యతల నుంచి తొలగిస్తూ కమిషనర్ ఆమ్రపాలి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే లోటస్ పాండ్ లో ప్రస్తుతం వైఎస్ షర్మిల, విజయమ్మ ఉంటున్నట్లు తెలుస్తోంది. షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు కావడంతో...కూల్చివేతలపై ప్రభుత్వం సీరియస్ అయినట్లు సమాచారం.

అసలేం జరిగింది?

మాజీ సీఎం జగన్ కు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్ లోని జగన్ నివాసం లోటస్ పాండ్ ముందు అక్రమ కట్టడాలను శనివారం కూల్చివేశారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ వైఎస్‌ జగన్ ఇంటి వద్ద అక్రమ కట్టడాలను శనివారం కూల్చివేసింది. జగన్ భద్రత కోసం రోడ్డును ఆక్రమించి సెక్యూరిటీ రూమ్ లు నిర్మించారు. ఈ ఆక్రమణలతో అసౌకర్యానికి గురవుతున్నామని ప్రజలు జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించడానికి ఆక్రమణలు కూల్చివేశామని అధికారులు తెలిపారు. అయితే జగన్ సెక్యురిటీ కోసం గదులు అవసరమని ఆయన మద్దతుదారులు వారించారు. జగన్ భద్రత కోసం రోడ్డును ఆక్రమించి గతంలో గదులను నిర్మించారని జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు, ప్రజల అసౌకర్యాల కారణంగా అక్రమ కట్టడాలు తొలగించినట్లు పేర్కొన్నారు. కూల్చివేతలపై ముందుగానే నోటీసులు ఇచ్చినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. పోలీసుల బందోబస్తుతో జగన్ ఇంటి ముందు అక్రమ కట్టడాలు తొలగించారు. హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టిన జీహెచ్ఎంసీ అధికారులు... నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట కట్టడాలను కూల్చివేస్తున్నారు.

లోటస్ పాండ్

మాజీ సీఎం జగన్ హైదరాబాద్ నివాసం లోటస్ పాండ్ లో గతంలో కీలక పరిణామాలు జరిగాయి. జగన్ సీఎం కాకముందు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో నివాసం ఉండేవారు. అక్కడి నుంచి వైసీపీ వ్యవహారాలు చూసుకునేవారు. అయితే 2019 ఎన్నికలకు ముందు విజయవాడ సమీపంలోని తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తాడేపల్లిలోని తన నివాసాన్ని క్యాంపు కార్యాలయం చేసుకుని పాలన చేశారు. అయితే హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో షర్మిల, విజయమ్మ, వైఎస్ కుటుంబ సభ్యులు ఉండేవారు. మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించేందుక వెళ్లినప్పుడు జగన్ చివరి సారిగా లోటస్ పాండ్ కు వెళ్లారు. అక్కడ తన తల్లి విజయమ్మను కలిశారు. తాజాగా లోటస్ పాండ్ ముందు అక్రమ నిర్మాణాలను ఉన్నాయని జీహెచ్‍ఎంసీ సిబ్బంది కూల్చివేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫుట్‍పాత్ ఆక్రమించి సెక్యూరిటీ కోసం గదులు నిర్మాణం చేసినట్లు అధికారులు గుర్తించారు. వీటిని తొలిగించాలని గతంలోనే నోటీసులు ఇచ్చారు. అయితే తాజాగా కూల్చివేతలకు ఆదేశించిన అధికారిపై బదిలీవేటు పడింది.

Read Entire Article