Khammam Sitarama Project : సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్

2 months ago 56
ARTICLE AD

Sitarama Project Trail Run : ఖమ్మం సీతారామ ప్రాజెక్ట్‌ మోటర్ల ట్రయల్‌ రన్‌ సక్సెస్‌ అయింది. ఈ ప్రాజెక్టుతో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఈ ఏడాదే వైరా ప్రాజెక్టు వరకు నీళ్లు అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రాజెక్ట్‌ నిర్మాణంపై జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరావు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.

ఖమ్మం జిల్లా కలల ప్రాజెక్ట్….!

సీతారామ ప్రాజెక్ట్ ఖమ్మం జిల్లా ప్రజల కలల ప్రాజెక్ట్ గా చెబుతారు. నాడు టీడీపీ ఈ తరహా ప్రాజెక్ట్ కోసం తుమ్మల ప్రయత్నాలు చేసినప్పటికీ నిధుల సమస్యతో ఉమ్మడి రాష్ట్రంలో ఆ కల సాకారం కాలేదు. అనంతరం కేసీఆర్ కేబినెట్ లో తుమ్మలకు అవకాశం దక్కడంతో సీతారామకు పునాది పడింది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం జరిగి 2104 ఎన్నికల్లో తుమ్మల ఓటమి చెందినప్పటికీ… ఆయనకు మంత్రి పదవి దక్కింది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా భూముల్లో పచ్చని పంటలు పండాలంటే సాగు నీటి ప్రాజెక్ట్ ఎంతో అవసరమని భావించిన తుమ్మల గోదావరి జలాలను లిఫ్ట్ చేసేలా తనకున్న అనుభవంతో ఈ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో గోదావరి జలాలను పారించాలన్న తలంపుతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సాగు నీటి ప్రాజెక్ట్ లతో తెలంగాణ కోటి ఎకరాల మాగాణం చేయాలనే సంకల్పంతో ఉన్న కేసీఆర్… తుమ్మల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి ప్రాజెక్ట్ పేరును శ్రీ రాముడు కొలువైన ప్రాంతం భద్రాచలం కావడంతో "సీతారామ" ప్రాజెక్ట్ గా నాడు కేసీఆర్ నామకరణం చేశారు.

శంకుస్థాపన చేసింది కేసీఆరే..

సీతారామ ప్రాజెక్ట్ కు 2016 ఫిబ్రవరి 16న నాటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. గోదావరి నదిపై కాటన్ నిర్మాణం చేసిన దుమ్ముగూడెం ఆనకట్టకు దిగువన సీతమ్మ సాగర్ బ్యారేజ్ నిర్మాణం చేసి 70 టీఎంసీల సామర్ధ్యంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో 7 లక్షల ఎకరాలకు సాగు నీరు అందేలా ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేశారు.

సీతమ్మ సాగర్ బ్యారేజ్ 36 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మాణం జరుగుతుండగా గోదావరి జలాలను లిఫ్ట్ చేసి స్టోర్ చేసేందుకు రిజర్వాయర్లు నిర్మాణం చేశారు. ప్రాజెక్ట్ కు శంకుస్థాపన జరిగి ఏడు సంవత్సరాలు అవుతున్నా ప్రాజెక్ట్ ఇంకా పూర్తవలేదు.

పనుల వేగవంతం..

రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రి గా తుమ్మలకు అవకాశం దక్కడంతో సీతారామ ప్రాజెక్ట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. గత ఐదేళ్లుగా నత్తనడకన సాగిన సీతారామ ప్రాజెక్ట్ పనులపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారు. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలనే పట్టుదలతో మంత్రి తుమ్మల ఉన్నారు.

యుద్దప్రాతిపదికన ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయడం కోసం అధికారులతో ఇటీవలే రివ్యూ చేశారు. దమ్మపేట మండలం గండుగులపల్లి వద్ద పంప్ హౌస్ నిర్మాణ పనులను పరిశీలించి రివ్యూ మీటింగ్ లో నిధుల సమస్యతో పాటు భూ సేకరణ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, లింక్ కెనాల్స్, రైల్వే రోడ్ క్రాసింగ్ అంశాలపై సమీక్ష చేసి అధికారులకు తుమ్మల దిశా నిర్దేశం చేశారు.

సత్తుపల్లి ప్రాంతానికి గోదావరి జలాలు పారేలా పాలేరు లింక్ కెనాల్ ను పూర్తి చేస్తే జిల్లా అంతటా సాగు నీటి కష్టాలు తీరి దశాబ్ధాల సాగు నీటి కలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని తుమ్మల భావిస్తున్నారు.

ఏన్కూరు రెగ్యులేటర్ వరకు కాల్వలు పూర్తి చేస్తే నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ద్వారా సత్తుపల్లి ప్రాంతానికి, బోనకల్ బ్రాంచ్ కెనాల్ ద్వారా వైరా, మధిర నియోజకవర్గాలకు గోదావరి జలాలు పారేలా తుమ్మల అధికారులకు సూచనలు చేశారు.

సహజంగా గోదావరికి జూన్, జులై నెలలో వరదలు వచ్చిన సందర్బంలో గోదావరి జలాలను లిఫ్ట్ చేసి పాలేరు వైరా రిజర్వాయర్ లను నింపొచ్చు. అప్పుడు వానాకాలం పంటలకు ఏ ఇబ్బంది ఉండదు. నాగార్జున సాగర్ ఆగస్ట్ తరువాతే నిండుతుంది. దాంతో వానాకాలం గోదావరి నీళ్లతో రబీ పంటలు పండించే అవకాశం ఉంది.

గోదావరి, కృష్ణా రెండు నదులు, రెండు బేసిన్ల మధ్య రెండు పంటలు పండితే ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలంగా మారనుంది. తుమ్మల పట్టుదల ఫలించి ఈ ఐదేళ్లలో సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా సశ్యశ్యామలం అవుతుందని జిల్లా ప్రజలు భావిస్తున్నారు.

Read Entire Article