Maoist Landmine: మందుపాతర పేలి అడవిలో మహిళకు గాయాలు, 30 కిలోమీటర్లు చేతులపై మోసుకొచ్చిన భక్తులు

3 months ago 63
ARTICLE AD

Maoist Landmine: పోలీసులు లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన ల్యాండ్‌మైన్‌‌‌తో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. తెలంగాణ - ఛత్తీస్ గడ్ సరిహద్దులో ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరగగా, ఆమెతో పాటు ఉన్న మిగిలిన యాత్రికులకు జెట్టి కట్టి ఆమెను 30 కిలోమీటర్ల పాటు మోసుకుంటూ వెంకటాపూర్ కు తీసుకొచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్ లో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం చొక్కాల, వీఆర్కే పురం గ్రామాలకు చెందిన దాదాపు 130 మంది యాత్రికులు గురువారం తెలంగాణ- ఛత్తీస్ గడ్ సరిహద్దులో దట్టమైన అటవీప్రాంతంలో కొలువై ఉన్న బెడం మల్లన్న స్వామి యాత్రకు బయలుదేరారు. మొత్తం అటవీ ప్రాంతమే కావడంతో కాలి నడకన యాత్ర మొదలుపెట్టారు.

ఒక్కసారిగా పేలిన మందుపాతర

ఉదయం బయలు దేరిన జనాలు పామునూరు, జెల్ల గ్రామాలు దాటుకుంటూ మధ్యాహ్నం రెండు గంటల సుమారులో ఒక్కడుగుట్ట వద్దకు చేరుకున్నారు. అందరూ నడుచుకుంటూ గుట్ట ఎక్కుతుండగా చొక్కాల గ్రామానికి చెందిన డర్రా సునీత, మావోయిస్టులు అమర్చిన మందుపాతరపై కాలు వేసింది. దీంతో ఒక్కసారిగా బ్లాస్టింగ్ జరగగా సునీత ఎడమ కాలికి తీవ్ర గాయం అయింది. దీంతో నొప్పితో విలవిలలాడుతూ సునీత అక్కడే కుప్పకూలింది.

30 కిలోమీటర్లు మోసుకొచ్చిన జనాలు

దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరగగా అక్కడి నుంచి ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. సునీతకు అత్యవసర వైద్యం అవసరం కాగా.. అటవీ ప్రాంతంలో వాహన సౌకర్యం లేకపోవడంతో వాళ్లంతా భయపడి పోయారు. సునీతను ఎలాగైనా ఆసుపత్రికి తరలించాలనే ఉద్దేశ్యంతో ఆమె బంధువులు, గ్రామస్తులు జెట్టి కట్టారు. అందులో ఆమె ను కూర్చోపెట్టి దాదాపు ఒక్కడుగుట్ట నుంచి దాదాపు 30 కిలోమీటర్లు మోసుకొచ్చారు.

మధ్యాహ్నం 3 గంటల సుమారులో ఒక్కడుగుట్ట నుంచి బయలిదేరి రాత్రి 9 గంటల సుమారులో వెంకటాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు సునీతకు మెరుగైన అవసరం అని, వెంటనే సమీపంలోని వేరే పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో అప్పటికప్పుడు ప్రైవేటు వాహనంలో వెంకటాపూర్ నుంచి ఆమెను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మందు పాతర పేలి సునీత గాయాల పాలవడంతో మల్లన్న యాత్రకు బయలు దేరిన జనాలు భయపడిపోయారు. యాత్ర పూర్తి చేసుకోకుండానే అందరూ సునీతతో పాటే తిరుగు ప్రయాణమయ్యారు.

వరుస ఘటనలతో బెంబేలు

ములుగు జిల్లాలో వరుసగా పేలుతున్న మందుపాతరలు జనాలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. కొద్దిరోజుల కిందట ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురానికి చెందిన ఇల్లందుల ఏసు, రమేష్, ఫకీరు అనే ముగ్గురు వ్యక్తులు సమీపంలోని కొంగలగుట్టపైకి కట్టెల కోసం వెళ్లగా.. ఇదివరకే మావోయిస్టులు ఆ ప్రాంతంలో పోలీసులను హతమార్చేందుకు అమర్చిన మందుపాతర పై ఏసు కాలు వేశాడు. ఒక్కసారిగా ఆ మందుపాతర భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్ర రక్త స్రావంతో స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆయన వెంట వచ్చిన రమేష్, ఫకీరు కూడా స్వల్పంగా గాయపడ్డారు.

ఆ తరువాత మరోచోట మందుపాతర పేలి పశువులు కూడా మృతి చెందాయి. ఇప్పుడు సునీత గాయాల పాలవగా.. వరుస పేలుళ్లు జనాలను కలవరానికి ఉరి చేస్తున్నాయి. జీవనోపాధి కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లడానికే జనాలు జంకుతుండగా, పోలీసుల నుంచి ఆత్మ రక్షణ కోసమే మందుపాతరలు పెట్టామని, జనాలు ఎవరూ అడవిలోకి రావొద్దని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.

దీంతో మావోయిస్టుల చర్యలపై పోలీసులు సీరియస్ గా ఉన్నారు. జనాల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరుగుతున్న వార్ లో అమాయక జనాలు ప్రాణాలు కోల్పోతుండగా, మున్ముందు ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని తెలంగాణ ఛత్తీస్ గడ్ సరిహద్దు జనాల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Read Entire Article