Minors Driving : రోడ్లపై రయ్ రయ్, ఖమ్మం పోలీసుల అదుపులో 50 మంది మైనర్లు

3 months ago 65
ARTICLE AD

Minors Driving : నిండా రెండు పదుల వయసు నిండని మైనర్లు రోడ్లపైకెక్కి రయ్ మంటూ చక్కర్లు కొడుతున్నారు. బైకులు జాగ్రత్తగా నడుపుతూ క్షేమంగా ఇల్లు చేరితే ఫర్వాలేదు. తోటి వాహనదారులను భయబ్రాంతులకు గురి చేస్తూ వారి ప్రాణాల మీదికి తెస్తున్నారు. కొందరైతే వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బైక్ రైడింగ్ లు చేస్తున్నారు. ఇలాంటి కొందరు మైనర్ల తల్లిదండ్రులకు కడుపు కోతను సైతం మిగిలిస్తున్నారు. దీంతో ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు మైనర్ డ్రైవింగ్ లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మైనర్ డ్రైవింగ్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టారని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు సిబ్బందిని ఆదేశించారు. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ట్రాఫిక్‌ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

తల్లిదండ్రులు కూడా కోర్టుకు

రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణం చాలా మంది మద్యం తాగి వాహనాలు నడపడం కాగా.. మరొకటి మైనర్ల డ్రైవింగ్ అని పేర్కొన్నారు. కొద్ది రోజులుగా విద్యార్థులు, మైనర్లు బైకులు, కార్లు నడుపుతూ వరుసగా ప్రమాదాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించడంతో ట్రాఫిక్‌ పోలీసులకు వాహనాల తనిఖీల్లో 50 మంది మైనర్ డ్రైవర్లు పట్టుబడ్డారు. దీంతో వారి తల్లిదండ్రులను స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. గతంలో కూడా మైనర్ డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడితే జరిమానా వేసి, తల్లిదండ్రులకి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేవారు. ఇక నుంచి డ్రైవింగ్ చేస్తున్న మైనర్ల వాహనాలు సీజ్ చేసి, వారితో పాటు వారి తల్లిదండ్రులను న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నారు. తద్వారా న్యాయస్థానం శిక్ష / జరిమానా విధించే అవకాశం ఉంటుందని అన్నారు. కాబట్టే ఇకనైనా తల్లిదండ్రులు మైనర్లకు వాహనం ఇవ్వకూడదని ట్రాఫిక్ ఏసీపీ విజ్ఞప్తి చేశారు.

పాఠశాలల్లో రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ క్లాసెస్

వాహనాలు ఇచ్చి ప్రోత్సహించడం వల్ల తెలిసీ తెలియని డ్రైవింగ్‌ చేస్తున్నారన్నారని, దీంతో ప్రమాదాలకు గురువుతున్నారని వివరించారు. తరచూ మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుపడితే కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలు తెలియని మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులు, వాహనాల యజమానులకు సూచించారు. ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ఆ కుటుంబం జీవితాంతం బాధపడాల్సి వస్తుందని, పిల్లలను రోడ్డు ప్రమాదం ద్వారా దూరం చేసుకోవడం తల్లిదండ్రులకు తీరని లోటన్నారు. మైనర్ డ్రైవింగ్, రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలు గురించి అన్ని పాఠశాలల్లో విద్యార్థిని, విద్యార్థులకు రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ క్లాసెస్ లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. తద్వారా విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ మోహన్ రావు, ఎస్సై, ఆర్ఎస్సై సాగర్ పాల్గొన్నారు.

రిపోర్టింగ్- కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.

Read Entire Article