Number Plates trend: కొత్త ట్రెండ్ గురూ! నెంబర్ ప్లేట్లపై రాజకీయ నేతల తాలూకా.. స్టిక్కర్లు

3 months ago 62
ARTICLE AD

Number Plates trend: "తాలూకా".! ఈ పేరును మనం గతంలో పోస్టల్ శాఖలో విన్నాం. పోస్ట్ మేన్ ఇంటికి తెచ్చే లెటర్లపై చూసాం. ఏదైనా అడ్రెస్ కి లెటర్ చేరాలంటే అక్కడికి దగ్గర్లో ఉన్న ప్రముఖ ప్రదేశాన్ని అందులో "తాలూకా" అంటూ పేర్కొనేవారు. అయితే కాల క్రమంలో ఈ పదం కనుమరుగై పోయింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కడంతో సెల్ ఫోన్ లో ప్రపంచాన్ని వీక్షిస్తున్న పుణ్యమాని ఉత్తరాలు అటకెక్కాయి.

దీంతో "తాలూకా" అనే పదం కూడా వాడుక తగ్గింది. కాగా అదే పదం కొత్త ట్రెండ్ తో ఇప్పుడు మనకు వినిపిస్తోంది. కాదు.. కాదు.! కనిపిస్తోంది. వాహనాల నెంబర్ ప్లేట్లపై, కార్ల వెనుక భాగంలో, ఆటోలపై సైతం తమకు ఇష్టమైన రాజకీయ నేతల ఫోటోలు స్టిక్కరింగ్ చేయించి తాము ఆ నేతల తాలూకా అంటూ చూపరులందరికీ చెప్పకనే చెబుతున్నారు.

రాజకీయ అభిమానం కొత్త పుంతలు..

వేసవి ఎండల్లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల వేడి అంతా ఇంతా కాదు. అటు ఆంద్రప్రదేశ్ లో, ఇటు తెలంగాణలో రాజకీయ వేడి ఎండల వేడిని తలదన్నింది. నువ్వా - నేనా అన్నట్లుగా తలపడిన ఈ పోరులో గెలిచిన పార్టీలు కొలువుదీరాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగా, ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కారు కొలువైంది.

అయితే గెలిచిన నేతలకు చెందిన కార్యకర్తలు, అభిమానులు, అనుంగులు తమ అభిమానాన్ని చాటుకునేందుకు కొత్త పంథాను అనుసరించడం మొదలెట్టారు. ఇంతకు ముందు పార్టీల జెండాలు, ఫ్లెక్సీల ద్వారా తమ అభిమాన నాయకుల ఫోటోలు తమ ఫోటోలతో కలిపి ప్రింట్ వేయించుకొని రాజకీయ ఆనందం పొందేవారు. ఇలా ఏర్పాటు చేసిన ఫ్లెక్సి లను కొద్ది రోజుల తర్వాత తొలగించడమో, అవి పాడై పోవడమో జరిగేది. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది.

తమ అభిమానాన్ని అందరి ముందు శాశ్వతంగా చాటుకునేందుకు సరికొత్త అవకాశం దొరికింది. తమ అభిమానాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ బైకులు, ఆటోలు, కార్ల డిజిటల్ బోర్డులపైనే కాకుండా వాహనాల వెనుక భాగంలో కూడా పెద్దగా కనబడేటట్లు నాయకుల ఫోటోలతో స్టిక్కరింగ్ చేయిస్తున్నారు.

ఫలానా సీఎం తాలూకా, ఫలానా మంత్రి తాలూకా, ఫలానా ఎమ్మెల్యే తాలూకా అంటూ వారికి నచ్చిన రాజకీయ నాయకుల ఫోటోలను నెంబర్ ప్లేట్లపై అందంగా అచ్చు వేయిస్తున్నారు. ఇది ఇప్పుడు నయా ట్రెండ్ గా మారింది. ఒకరిని చూసి మరొకరు ఈ కొత్త ట్రెండ్ ని అవలంభిస్తున్నారు.

నిబంధనను విరుద్ధమే..

వాహనాలపై ఇష్టం వచ్చినట్లు స్టిక్కరింగ్ చేయించుకునే స్వేచ్ఛ అందరికీ ఉంది. కానీ నెంబర్ ప్లేట్లపై నెంబర్ కనిపించకుండా స్టిక్కరింగ్ చేయడం మాత్రం కచ్చితంగా నిబంధనలకు విరుద్ధమే అవుతుంది. రవాణా శాఖ ముద్రించి ఇచ్చిన ప్లేట్ ను మార్చడం, నెంబర్ కనిపించకుండా చేయడం వంటి చర్యలు మాత్రం మోటారు వాహనాల చట్టానికి విరుద్ధం.

ఈ రాజకీయ పైత్యం రాబోయే రోజుల్లో మరింతగా విస్తరించే అవకాశం ఉన్నందున రవాణా శాఖ, పోలీస్ శాఖ అధికారులు వాహన తనిఖీల సమయంలో జరిమానాలు విధించి కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేకుంటే నిబంధన ఉల్లంఘనతో పాటు రాజకీయ ఘర్షణలకు కూడా ఈ పరిస్థితి తావిచ్చే అవకాశం లేకపోలేదు.

(రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి)

Read Entire Article