Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు షాక్, బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన కోర్టు

2 months ago 48
ARTICLE AD

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. వీరి బెయిల్ పిటిషన్లపై బుధవారం వాదనలు ముగియగా తీర్పు రిజర్వ్ చేసింది కోర్టు. తాజాగా తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదని తెలిపారు. సుప్రీంకోర్టు గత తీర్పుల ప్రకారం 90 రోజుల్లో కేసు ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోతే బెయిల్ ఇవ్వొచ్చని కోర్టుకు తెలిపారు. అయితే పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తాము 90 రోజుల్లోనే ఛార్జ్ షీట్ దాఖలు చేశామని, వివరాలు సరిగా లేవని తిప్పి పంపడంతో మళ్లీ ఛార్జ్ షీట్ దాఖలు చేశామన్నారు. ఛార్జ్ షీట్ తిప్పిపంపినంత మాత్రాన ఛార్జ్ షీట్ దాఖలు చేయనట్లు కాదన్నారు. పోలీసుల వాదనలతో ఏకీభవించిన కోర్టు నిందితుల బెయిల్ పిటిషన్లు కొట్టివేసింది.

కీలక దశలో విచారణ

ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఛార్జ్‌షీట్‌లో మూడు కీలకమైన డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరో కీలక నిందితుడు ప్రభాకర్‌ రావు విదేశాల్లో ఉన్నారని, ఆయనను అరెస్ట్‌ చేయాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఫోన్‌ ట్యాంపింగ్‌పై విచారణ కీలక దశలో ఉందని, మరి కొంతమందిని విచారించాల్సి ఉందన్నారు. ఈ సమయంలో నిందితులకు బెయిల్‌ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టుకు తెలియజేశారు. నిందితులు పోలీస్‌ శాఖలో కీలక పదవుల్లో విధులు నిర్వహించారని, దీంతో కేసులో మిగిలిన నిందితులు అరెస్ట్‌ చేసే వరకు వీరికి బెయిల్‌ ఇవ్వకూడదని కోర్టుకు కోరారు. పోలీసుల వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు నిందితుల బెయిల్‌ పిటిషన్లను కొట్టివేసింది.

ప్రభాకర్ రావు ఇండియాకు తిరిగి వస్తారా?

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇండియాకు తిరిగి వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ప్రస్తుతం అమెరికా ఉన్నారు. ప్రభాకర్ రావు ఇండియాకు తిరిగి వస్తే ఈ కేసులో కీలక ఆధారాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. ప్రభాకర్ రావు స్వదేశానికి తిరిగి రాగానే సిట్ ఆయనను అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు నోరు విప్పితే ఈ కేసులో సంచలనల వెలుగులోకి రానున్నాయి.

ఈ కేసులో ఇప్పటికే నిందితులు తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావులను సిట్ విచారించింది. వారి నుంచి కీలక వివరాలు సేకరించింది. అయితే కీలక సూత్రధారి అయిన ప్రభాకర్ రావును విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావును అరెస్ట్ చేయగానే....ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్లిపోయారు. అయితే క్యాన్సర్ చికిత్స కోసం తాను అమెరికా వెళ్లినట్లు కోర్టుకు తెలిపారు ప్రభాకర్ రావు. ప్రభాకర్ రావును ఇండియాకు తీసుకొచ్చేందుకు సిట్ ప్రయత్నాలు చేస్తుంది. ప్రభాకర్ రావు వీసా గడువు ఈ నెలాఖరున ముగియనుండడంతో ఆయన ఇండియాకు వచ్చే అవకాశం ఉందని సిట్ అధికారులు తెలిపారు. అయితే అనారోగ్య కారణాలు చూపుతూ ప్రభాకర్ రావు వీసా గడువును పెంచుకునేందుకు ప్రయత్నించే అవకాశం లేకపోలేదని సమాచారం.

Read Entire Article