Protest: పురుగుల మందు డబ్బాతో వృద్ధుడి ఆందోళన, భూమి డబ్బులు ఇవ్వకుండా పోలీస్ అధికారి వేధిస్తున్నాడని ఆవేదన

3 months ago 132
ARTICLE AD

Protest: తన భూమిని కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక, ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించకుండా ఓ పోలీస్ అధికారి వేధింపులకు గురి చేస్తున్నారని దాదాపు 70 ఏళ్ల వృద్ధుడు పోరాటానికి దిగాడు. తనకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పురుగుల మందు డబ్బాతో ఆందోళన చేపట్టాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది.

బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. టేకుమట్ల మండలం ఆరేపల్లికి గ్రామానికి చెందిన ఇటుకాల రాజమల్లుకు అదే గ్రామ శివారులో దాదాపు 39 గుంటల భూమి ఉంది. దీంతో తనకు ఆరోగ్యం బాగుండకపోవడంతో ఆ భూమిని అమ్మేసి, ఆ డబ్బుతో వైద్యం పొందాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు భూమిని అమ్మకానికి పెట్టాడు.

అదే గ్రామానికి చెందిన గజ్జి కృష్ణ ప్రస్తుతం రామగుండం కమిషనరేట్ పరిధిలో ఏసీపీగా పని చేస్తుండగా, ఆయన తన భార్య రాధికా రాణి పేరున ఆ భూమిని కొనేందుకు నిశ్ఛయించుకున్నాడు. ఇద్దరి మధ్య ఒప్పందం ప్రకారం ఎకరాకు రూ.14 లక్షల చొప్పున బేరం కూడా కుదుర్చుకున్నారు. ఈ మేరకు 39 గుంటలకు రూ.13.65 లక్షలు చెల్లించేందుకు అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు.

సగం డబ్బులు ఇవ్వడం లేదని ఆందోళన

భూమి విక్రయ సమయంలో ముందుగా రూ.7 లక్షలు కట్టి, రిజిస్ట్రేషన్ సమయంలో మిగతా రూ.6.65లక్షలు కట్టాలన్నది ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందం కాగా.. రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో వృద్ధుడు రాజమల్లు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ద్వారా మిగతా డబ్బులు అడిగించాడు. దీంతో బ్యాగులో ఉన్న డబ్బులు చూపించిన సదరు అధికారి రిజిస్ట్రేషన్ అయ్యాక చేతులెత్తేశాడని రాజమల్లు ఆరోపించారు.

అప్పటికే భూమి రిజిస్ట్రేషన్ పూర్తయ్యిందని, అప్పటి నుంచి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వాపోయాడు. ఇదే విషయమై పలుమార్లు ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించినట్లు వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశాడు. సదరు పోలీస్ ఆఫీసర్ తీరుపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి, చిట్యాల సీఐ, భూపాలపల్లి డీఎస్పీ, అలాగే ఇటీవల భూపాలపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన గండ్ర సత్యనారాయణ రావును కలిసినా తనకు న్యాయం మాత్రం జరగలేదని వృద్ధుడు రాజమల్లు బోరున విలపించాడు. ఎవరికి చెప్పుకున్నా న్యాయం జరుగుతుందనే నమ్మకం లేకపోవడంతో చావే శరణ్యమని పురుగుల మందు డబ్బాతో రోడ్డెక్కాల్సి వచ్చిందని వృద్ధుడు వాపోయాడు.

టేకుమట్లలో ఉద్రిక్తత

ఓ వైపు వృద్ధుడు, అతని బంధువులంతా కలిసి రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడగా, విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో తమకు న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వృద్ధుడు, ఆయన కుటుంబ సభ్యులు పోలీసుల కాళ్లా వేళ్లా పడ్డారు.

దీంతో ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి తగిన చొరవ తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో వృద్ధుడు రాజమల్లు, అతడి కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి, వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

‘మొత్తం డబ్బులు చెల్లించాం’..

వృద్ధుడి ఆందోళన నేపథ్యంలో ఏసీపీ భార్య రాధికా రాణి మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. తాము రాజమల్లు వద్ద నుంచి 39 గుంటల భూమిని కొనుగోలు చేసిన మాట వాస్తవమేనన్నారు. ముందస్తు ఒప్పందం ప్రకారం రూ.13.65 లక్షలను వాయిదాల ప్రకారం రాజమల్లుకు చెల్లించామని, ఆ తరువాతనే రాజమల్లు భూమి రిజిస్ట్రేషన్ చేశాడని పేర్కొన్నారు. కొంతమంది తమ కులస్తులు, పాలివాళ్లు తమ ఎదుగుదలను ఓర్వలేక తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అవేవీ వాస్తవం కాదని తెలిపారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Read Entire Article