Singareni Collieries : ప్రైవేటుపరమవుతున్న బొగ్గు గనులు..! సింగరేణి భవితవ్యం ప్రశ్నార్థకమేనా..?

2 months ago 45
ARTICLE AD

తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Singareni Collieries : ప్రైవేటుపరమవుతున్న బొగ్గు గనులు..! సింగరేణి భవితవ్యం ప్రశ్నార్థకమేనా..?

బొగ్గు గనుల వేలంతో సింగేరణి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఓవైపు పరిరక్షిస్తామంటూనే మరోవైపు ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థలకు గనులను అప్పగించే పనిలో పడిపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో సింగరేణి ఉనికే ఉండదని కార్మికులు వాపోతున్నారు.

సింగరేణి భవితవ్యం ఇక ప్రశ్నార్థకమేనా..?

సింగరేణి భవితవ్యం ఇక ప్రశ్నార్థకమేనా..?

Singareni Collieries : సింగరేణి భవితవ్యం ప్రశ్నార్థకంలో పడుతోందా..? బొగ్గుట్టగా పేరున్న నల్ల బంగారు గనులు ఇక పరులపాలు కానున్నాయా..? ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరును గమనిస్తే ఈ ప్రశ్నలకు సమాధానాలు అవుననిపిస్తోంది.

బొగ్గు గనులపై ప్రైవేటు పడగ పడడంతో 1.20లక్షల మంది ఉద్యోగులు, కార్మికులు కోట్లాది రూపాయల ఆర్థిక లావాదేవీలతో అలరారుతున్న సింగరేణి చరిత్ర ఇప్పుడు మసకబారుతోంది. నల్ల బంగారు గనుల మనుగడే ప్రమాదంలో పడుతోంది. సింగరేణి శోధించిన బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం వేలంవేసి ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్న నేపథ్యంలో సింగరేణి భవితవ్యం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 

ప్రపంచ స్థాయి పేరెన్నిక గన్న సింగరేణిది 137 సంవత్సరాల చరిత్ర. ఖమ్మం జిల్లా కొత్తగూడెం, ఇల్లందు పట్టణాల మధ్య దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రయాణికులు వంట చేసుకునేందుకు పెట్టిన పొయ్యి రాళ్లు మండడంతో బొగ్గు అన్వేషణ ప్రారంభమైంది. 1871లో బ్రిటిష్ భూగర్భ పరిశోధన అధికారి విలియం కింగ్ బొగ్గు అన్వేషణ ప్రారం భించాడు. 16 ఏళ్ల ఆయన డాక్టర్ జి.చిన్నారెడ్డి కృషి ఫలితంగా ఇప్పుటి ఇల్లందులో 1887లో తొలి సారి బొగ్గు తవ్వకం ప్రారంభమైంది. 

దక్కన్ కంపెనీ పేరుతో తొలి నాళ్లలో బొగ్గు తవ్వకాలు జరిపారు. 1921లో దక్కన్ కంపెనీని ఇంగ్లాండ్ నుంచి మద్రాసు తరలించి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గా పేరు మార్చారు. విలియం కింగ్ అన్వేషణ బొగ్గును వెలికితీయాలన్న బ్రిటిష్ అధికారుల నిర్ణయం మేరకు సింగరేణి విస్తరణ ప్రారంభమై ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించింది. భూగర్భ గనుల ద్వారా బొగ్గు వెలికితీయడంతో ప్రారంభమై ఉపరితల గనుల ద్వారా బొగ్గు తీస్తు న్నారు. 

గతంలో 39 కేంద్రాల బొగ్గును ఉత్పత్తి చేసే సింగరేణిలో ఇప్పటికే భూ గర్భ గనులు మూతపడగా ఉపరితల బొగ్గు గనుల్లో సైతం బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయింది. కొత్త బొగ్గు బ్లాకులను సింగరేణి అన్వేషించింది. కాని సింగరేణి అన్వేషించిన బొగ్గు గనులను కేంద్రం వేలం వేయడానికి సిద్దమైంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కోయగూడెం, సత్తుపల్లి బొగ్గు గనులను వేలం వేసింది.

కేంద్రం సింగరేణి పరిధిలోని బొగ్గు నిక్షేపాలను వేలం వేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ నాడు మౌనం వహించింది. కనీసం సింగరేణిని వేలం పాటలో కూడా పాల్గొననివ్వలేదు. ఇప్పుడు సింగరేణి పట్ల పెద్ద అరుపులు అరుస్తున్న ఆ పార్టీ నాయకత్వం.. నాలుగు బొగ్గు గనులను వేలం వేసి ప్రైవేటుకు అప్పగిస్తుంటే మాత్రం చోద్యం చూసిందనే అపవాదను మూటగట్టుకుంది. 

కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుంది. దీనిని అడ్డుకోకపోతే మరింత ప్రమాదం పొంచి ఉంది. ప్రైవేటు సంస్థలు బొగ్గు గనులను వేలం పాటలో దక్కించుకుని కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దోచుకుంటున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణలో భాగంగానే బొగ్గు బ్లాకుల వేలానికి పూనుకుంది.

అధిక ధరలకు కొనుగోళ్లు…..

సింగరేణి సంస్థతో పాటు దేశంలోని బొగ్గు ఉత్పత్తి సంస్థలు ప్రభుత్వానికి టన్ను రూ.3,500 నుంచి రూ. 4,500 లోపు సరఫరా చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ సంస్థల నుంచి రూ.18వేలు టన్ను చొప్పున కొనుగోలు చేసింది. దీన్ని బట్టి కేంద్ర సర్కారు ప్రజా సంపదను ఎంతగా కార్పొరేట్ సంస్థలకు దోచి పెడుతుందో అవగతమవుతుంది. 

ఇప్పటికే బొగ్గు నిల్వలు లేక సింగరేణి ఆధీనంలోని గనులు మూత పడుతుండగా కొత్త గనులు లేకపోతే 15 ఏళ్లలో సింగరేణి సంస్థ మూతపడే అవకాశం ఉంది. గతంలో 1.20 లక్షల మంది కార్మికులు ఉన్న సింగరేణి సంస్థ కుచించుకుపోయి ఇప్పుడు 42 వేల మంది కార్మికులకు పరిమితమైంది.

పరిరక్షణ అందరి లక్ష్యం కావాలి….

సింగరేణి తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద ఉత్పాదక సంస్థగా, ఆర్థిక శక్తిగా, ఉపాధి కేంద్రంగా ఉంది. సింగరేణి మూతపడితే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ప్రభావం చూపడంతో పాటు ఉపాధి, ఉత్పత్తి, ఆర్థిక రంగాలపై ప్రభావం పడనుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్…. సింగరేణి సంస్థ మనుగడే లక్ష్యంగా ముందుకు సాగాల్సి ఉంది. 

కమ్యూనిస్టు కార్మిక సంఘాలు సైతం సింగరేణి పరిరక్షణకు ఉద్యమించాల్సిన అవసరం ఉంది. కమ్యూనిస్టులు, కార్మిక సంఘాలు సింగరేణి మనుగడ కోసం బొగ్గు వేలం పాటను అడ్డుకునేందుకు మరో విప్లవాత్మక ఆందోళనలకు సిద్దం కావాల్సి ఉంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఆధారపడిన సింగరేణి పరిరక్షణ అందరి బాధ్యత కావాలి. ఇక్కడ రాజకీయ డ్రామాలకు, తెరచాటు వ్యవహారాలకు తావిస్తే దేశంలో అతిపెద్ద సంస్థ అయిన సింగరేణి కాలగర్భంలో కలిసిపోక తప్పదు.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.

Read Entire Article