Siricilla Murder: సిరిసిల్ల లో దారుణం, భార్యను చంపి, భర్త ఆత్మహత్య.. అనాథలైన పిల్లలు

1 month ago 52
ARTICLE AD

Siricilla Murder: రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది.‌ భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశంలో దంపతులిద్దరు ప్రాణాలు కోల్పోవడంతో వారి ముగ్గురు పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ లో నివాసం ఉండే దూస రాజేశం (54) భార్య లక్ష్మి (50) ని బెడ్ రూం లో బలమైన ఆయుధంతో మొహం పై కొట్టి హత్య చేశాడు. భార్యను చంపి అనంతరం భర్త రాజేశం ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే దారుణ ఘటనకు కారణమని స్థానికులు తెలిపారు.

రెండు కిడ్నీలు చెడిపోవడంతో డయాలసిస్ చేయించుకుంటున్నారు రాజేశం. భార్య భర్తల మధ్య మాటమాట పెరిగి క్షణికావేశంతో భార్యపై దాడి చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. భార్య రక్తం మడుగులో పడి ప్రాణాలు కోల్పోవడంతో ఆవేశంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

లక్ష్మీ రాజేశం దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ ఉన్నారు. పెద్ద కొడుకు వేణు, బిడ్డ మౌనిక కు వివాహం కాగా చిన్న కొడుకు వెంకటేష్ బిటెక్ చదువుకున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరు క్షణికావేశంతో ప్రాణాలు కోల్పోవడంతో కన్నీరుగా పిలిపించారు. అమ్మను చంపి నాన్న ఉరివేసుకొని చనిపోయాడని ఇద్దురు కొడుకులు బిడ్డ బోరున విలపించారు.

ఉపాధి లేమి..గొడవకు కారణం

సిరిసిల్లలో వస్త్ర సంక్షోభంతో గత ఏడు మాసాలుగా పవర్ లూమ్ పరిశ్రమ పని చేయడం లేదు. దీంతో దానిపై ఆధారపడ్డ ప్రత్యక్షంగా 20వేలు, పరోక్షంగా 10 వేల మంది ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులో భాగంగానే రాజేశం కుటుంబంలో ఉపాధి లేమి సమస్య భార్యాభర్తల మధ్య గొడవకు దారి తీసిందని స్థానికులు తెలిపారు. గత ఏడు మాసాలుగా ఉపాధి లేకపోవడంతో ఇంట్లో తరచు గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. పోలీసులు హత్య , ఆత్మహత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కొనసాగుతున్న నేతన్నల దీక్షలు..

వస్త్ర పరిశ్రమ బంద్ తో గత వారం రోజులుగా సిరిసిల్లలో నేతన్నలు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పని చేసేలా ప్రభుత్వం ఆర్డర్ లు ఇచ్చి ఉపాధి కల్పించాలని, విద్యుత్ సబ్సిడీ కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. సిరిసిల్ల బందుతోపాటు చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించారు. ఉపాధి కల్పన చర్యలు కానరాక విద్యుత్ సబ్సిడీపై ప్రభుత్వ సానుకూలంగా స్పందించకపోవడంతో నేతన్నల నిరసన కొనసాగుతుంది.

(రిపోర్టింగ్ కె.వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

WhatsApp channel

Read Entire Article