TG Gruha Jyothi Scheme : అర్హత ఉన్నా అందని 'జీరో బిల్' - తప్పుల సవరణ కోసం ఎదురుచూపులు..!

2 months ago 49
ARTICLE AD

Telangana Gruha Jyothi Scheme : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గృహజ్యోతి స్కీమ్ (జీరో బిల్) కొంత మంది అర్హులకు అందడం లేదు. ప్రజాపాలన దరఖాస్తులను ఆన్ లైన్ చేసేటప్పుడు జరిగిన పొరపాట్లతో కొందరు ఈ స్కీమ్ కు దూరమవగా.. మరికొందరు ఇతర కారణాలతో లబ్ధి పొందలేకపోతున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్లలోపు విద్యుత్తు వాడే వారికి ఉచిత కరెంటు పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ను అమలు చేసే క్రమంలో విద్యుత్ వినియోగదారుల వివరాలను సేకరించారు. పథకానికి కావాల్సిన ధ్రువపత్రాలను కూడా స్వీకరించారు. వీటిని ఆన్ లైన్ లో ఎంట్రీ చేశారు.

ఈ స్కీమ్ కోసం అనేక మంది అర్హులు దరఖాస్తు చేసుకున్నారు. చాలామందికి జీరో కరెంటు బిల్లు వర్తించినా… వివిధ కారణాలతో కొందరు ఈ పథకానికి దూరమై ఆందోళనకు గురవుతున్నారు. కొన్ని తప్పిదాల సవరణకు ఏర్పాట్లు చేసినప్పటికీ… చాలా మందికి సవరణలు జరుగడం లేదు.

వీరి పరిస్థితి ఆగమాగం….!

ముఖ్యంగా అద్దె ఇండ్లలో ఉండే పేదలకు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి మారినప్పుడు ఈ స్కీమ్ ను పొందడం సమస్యగా మారింది. ప్రజాపాలన దరఖాస్తులో ఏ మీటర్ నంబర్ అయితే రాశారో… అదే నంబర్ కు జీరో బిల్ వర్తిస్తుంది. మీటర్ నంబర్ను మార్చుకునే ఆప్షన్ లేదని అధికారులు చెబుతున్నారు.

దీంతో అద్దె ఇల్లు మారిన లబ్ధిదారుకు స్కీమ్ అందడం లేదు. పాత ఇంటి మీటర్ కే గృహజ్యోతి వర్తిస్తుండడంతో ఇంటి ఓనర్ లబ్ధి పొందుతున్నారు. ఇక ప్రజాపాలన దరఖాస్తు చేసే సమయంలో జరిగిన పొరపాట్ల వల్ల మరికొంత మంది పథకానికి దూరమయ్యారు. ఆన్ లైన్ లో వివరాలను నమోదు చేసే సమయంలో మీటర్ నంబర్లను తప్పుగా వేయడం లేదా స్కీమ్ కు అసలు దరఖాస్తు చేసుకోలేదన్నట్టుగా(నాట్ అప్లైడ్) నమోదు చేయడంతో కొందరికి స్కీమ్ అందడం లేదు.

ఫలితం శూన్యం…!

లబ్దిదారులు ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకుపోయినా… తమ చేతుల్లో ఏం లేదని చెబుతున్నారు. ప్రజాపాలన పోర్టల్లో తమకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదంటున్నారు. కొత్తగా మీటర్ తీసుకున్న పేదలకు కూడా స్కీమ్ అందడం లేదు.

ప్రజాపాలన దరఖాస్తు సమయంలో మీటర్ నంబర్ రాయనందున ఇప్పుడేమీ చేయలేమని చెబుతున్నారు. దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిరంతరం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. ప్రజాపాలన పోర్టల్ లో ఎడిట్ ఆప్షన్ ఇస్తే.. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చునని అధికారులు చెబుతున్నారు.

నిర్మల్ జిల్లాలోని చింతలచ్చంద గ్రామానికి చెందిన ఉమ అనే మహిళకు రేషన్ కార్డు ఉంది. ప్రజాపాలన దరఖాస్తులో గృహజ్యోతి పథకంకోసం దరఖాస్తు చేశారు. కానీ పథకం వర్తించలేదు. మండల పరిషత్ కార్యాలయంలో సవరణ కోసం వెళితే ప్రజాపాలన దరఖాస్తులో నమోదు కాలేదు (నాట్ అప్లయిడ్) అని చూపిస్తోందని వాపోయారు. ఇటువంటి వారు జిల్లాలో అనేక మంది ఉన్నారు. కేవలం ఇతర సవరణలు జరుగుతుండగా.. నాట్ అప్లయిడ్ అని చూపించే వారి పరిస్థితిపై ఆదేశాలు రాలేదని మండల పరిషత్, విద్యుత్తు సంస్థ అధికారులు పేర్కొంటున్నారు.

ఆదిలాబాద్ జిల్లా లెక్కలివే….

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 196460 విద్యుత్ వినియోగదారులు ఉండగా ఇందులో 84,108 మంది అర్హులు అయ్యారు. అలాగే నిర్మల్ జిల్లా లో 2,24,000 ఉండగా 99129 మందికి అర్హత లభించింది. ఆసిఫాబాద్ జిల్లాలో 1,29,731మంది వినియోగదారులలో 66528మందికి, మంచిర్యాల జిల్లాల్లో 264600 మంది వినియోగదారులు ఉండగా 1,05,000 మందికి జీరో బిల్లు వస్తుందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి.

కొత్తవాటిపై ఆదేశాలు రాలేదు: శ్రీనివాస్, ఎస్ఈ, నిర్మల్

“జీరో బిల్లు రాని వారు కరెంటు బిల్లు కచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్నా అర్హత వర్తించని వారి తప్పుల సవరణకు ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లు నిర్వహిస్తోంది. వాటిని వినియోగించుకోవాలి. గతంలో దరఖాస్తు చేసుకోని వారి విషయంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు” అని ఎస్ఈ శ్రీనివాస్ తెలిపారు.

రిపోర్టింగ్ : వేణుగోపాల్ కామోజి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి, HT Telugu.

Read Entire Article