TS Cabinet Meeting : తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి, రేపు మధ్యాహ్నం సమావేశం

3 months ago 154
ARTICLE AD

TS Cabinet Meeting : తెలంగాణ కేబినెట్ సమావేశానికి ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కేబినెట్ భేటీపై కొన్ని షరతులు విధించింది. కేబినెట్ సమావేశంలో అత్యవసరమైన విషయాలపైనే చర్చించాలని తెలిపింది. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు కేబినెట్ సమావేశానికి హాజరు కాకూడదని ఆదేశించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం మంత్రి వర్గ సమావేశం జరగాల్సి ఉంది కానీ ఈ సమావేశానికి ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో వాయిదా పడింది. తాజాగా కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇచ్చింది.

రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై చర్చ

రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతాంగానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై చర్చించాలని మంత్రి వర్గం నిర్ణయించింది. అయితే శనివారం కేబినెట్ భేటీకి ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాకపోవడంతో వాయిదా పడింది. కేబినెట్ భేటీకి ప్రభుత్వం ముందుగానే అనుమతి కోరినా ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ విభాగాల అధికారులు శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వేచి చూశారు. రాత్రి 7 గంటల వరకు ఈసీ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో భేటీ వాయిదా పడింది.

రైతాంగానికి సంబంధించిన అత్యవసరమైన అంశాలతో పాటు జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ వేడుకల నిర్వహణ, రాష్ట్ర పునర్విభజనకు పదేండ్లు పూర్తి కానున్న నేపథ్యంలో ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న అనేక అంశాలపై కేబినెట్ లో చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. తాజాగా ఈసీ కేబినెట్ భేటీకి అనుమతి ఇవ్వడంతో...సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంతో సమావేశం నిర్వహించనున్నారు.

రేపు కేబినెట్ భేటీ

తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారైంది. ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది.

రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్

తెలంగాణలో మంత్రి వర్గం విస్తరణపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత కేబినెట్ లో సీఎంతో కలిపి మొత్తం 12 మంది మంత్రులు ఉన్నారు. సాధారణంగా ముఖ్యమంత్రితో కలిపి కేబినెట్ లో మొత్తం 18 మంది మంత్రులు ఉండొచ్చు. అంటే ఇంకా రేవంత్ కేబినెట్ లో ఆరుగురి వరకు అవకాశం ఉంది. అయితే కేబినెట్ లో చోటు దక్కించుకోవడం కోసం ఆశావహులు ప్రయత్నాలు ఇప్పటికే మొదలు పెట్టారు. మొదట్లో లోక్ సభ ఎన్నికలు అనంతరమే కేబినెట్ విస్తరణ ఉంటుందని పీసీసీ వర్గాలు వెల్లడించినా.....ఇప్పటివరకు దాని ఊసే లేదు. మిగిలిన ఆరుగురు మంత్రులను జిల్లాలు, సామాజిక వర్గం ఆధారంగా ఎంపిక చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే అనేక సార్లు తెలిపారు. ప్రస్తుతం కేబినెట్ లో హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజమాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. వరంగల్, నల్గొండ, కరీంనగర్ నుంచి ఇద్దరు చొప్పున మంత్రులు ఉండగా......మహబూబ్ నగర్ లో ముఖ్యమంత్రితో కలిపి ఇద్దరు మంత్రులు, మెదక్ లో ఒకరు.....ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని జిల్లాలకు అవకాశం కల్పిస్తూ......సామాజిక వర్గాల వారీగా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

Read Entire Article