Warangal Nala Works : వరంగల్ కు వరద కష్టాలు తప్పేనా..? పెండింగ్ పనులతో పొంచి ఉన్న ముప్పు..!

2 months ago 58
ARTICLE AD

Warangal-Nala Works: రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న వరంగల్ నగరానికి వరద ముప్పు పొంచి ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం వరద నివారణ పనుల కోసం రూ.250 కోట్లు మంజూరు చేసినా చాలా పనులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి.

ముఖ్యంగా హనుమకొండలోని నయీంనగర్ నాలా పనులు నెమ్మదించగా, వరంగల్ లో బొందివాగు పనులు ఇంకా ప్రారంభమే కాలేదు. దీంతో ఇప్పుడిప్పుడే వర్షాలు మొదలవుతుండగా, చిన్నవానకు కూడా కాలనీలు నీట మునగాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇక భారీ వర్షాలు కురిస్తే మాత్రం ముంపు ముప్పు తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

2020 వరదలతో అతలాకుతలం….

2020 ఆగస్టులో కురిసిన వర్షాలకు వరంగల్ నగరం అతలాకుతలమైంది. వరంగల్ ట్రై సిటీలో దాదాపు 1,800 కాలనీల వరకు ఉండగా, అందులో సగానికిపైగా నీట మునిగాయి. వరద తాకిడికి నాలాలు, డ్రైన్లు, రోడ్లు దెబ్బతిని, రూ.వందల కోట్ల నష్టం వాటిల్లింది.

దీంతో అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వరంగల్ నగరంలో ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించి, చెరువుల గొలుసు కట్టు తెగడం, నాలాల ఆక్రమణలు, ఇరుకు డ్రైన్ల వల్లే సిటీ నీట మునిగినట్లు తేల్చారు. ఆ తరువాత ఆక్రమణలు తొలగించి, నాలాలను విస్తరించాల్సిందిగా ఆదేశించారు. దీంతో గ్రేటర్ వరంగల్, ఇరిగేషన్ అధికారులు సిటీలోని నాలాలపై దాదాపు 415 ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆక్రమణల తొలగింపు, నాలాల డెవలప్ మెంట్, వరద నివారణ పనులకు దాదాపు రూ.250 కోట్ల వరకు అవసరం అవుతాయని అంచనా వేశారు.

250 కోట్లు మంజూరు….

గత ప్రభుత్వం హయాంలో 250 కోట్లతో ప్రపోజల్స్ పంపించినప్పటికీ అందులో చాలా పనులకు ఆమోదం లభించక, ఫైళ్లన్నీ సర్కారు వద్ద పెండింగ్ లో పడిపోయాయి. దీంతో కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తరువాత రూ.250 కోట్లతో వరద నివారణ పనులకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు కలిసి వరద నివారణ పనులకు శంకుస్థాపనలు చేశారు.

నెమ్మదించిన నయీంనగర్ పనులు…

నగరంలో వరద ప్రవాహానికి నయీంనగర్, బొందివాగు, భద్రకాళి నాలాలు ప్రధానమైనవి కాగా.. భద్రకాళి నాలా పనులు రెండేండ్ల కిందటే ప్రారంభమయ్యాయి. కానీ ఆ తరువాత బడ్జెట్ సమస్యల వల్ల పనులు నిలిచిపోయాయి. ఇదిలాఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రూ.90 కోట్లతో నయీంనగర్ నాలా డెవలప్ మెంట్ పనులను గత ఫిబ్రవరిలో ప్రారంభించారు.

వర్షాలు ప్రారంభమయ్యే లోగా జూన్ 15వ తేదీనాటికల్లా పనులు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ఆ పనులు ఇంకా పూర్తి కాకముందే వర్షాలు స్టార్ట్ అయ్యాయి. దీంతో ఆ పనులు కాస్త ఇప్పుడు నెమ్మదించాయి. ఫలితంగా వరద ప్రవాహానికి కొంతమేర లైన్ క్లియర్ చేసినప్పటికీ.. పనులు మొత్తం పూర్తి కావడానికి సమయం వచ్చే అవకాశం ఉంది.

ప్రారంభానికి నోచుకోని బొందివాగు పనులు

నగరంలోని వరంగల్ ప్రాంతం మునగడానికి బొందివాగు నాలా వరద ప్రవాహమే కారణం కాగా, ఈ నాలా డెవలప్ మెంట్ కు ఇంతవరకు అడుగులు పడలేదు. గతంలోనే రూ.158 కోట్ల నిధులతో ఈ నాలా అభివృద్ధికి ప్రతిపాదనలు పంపగా, వాటిని ఆమోదించిన కాంగ్రెస్ సర్కారు గత మార్చిలో శంకుస్థాపన కూడా చేసింది. కానీ ఆ తరువాత ఎలక్షన్ కోడ్ అడ్డువచ్చినప్పటికీ.. ఇక్కడి ఇరిగేషన్ అధికారులు అత్యవసర పనులుగా భావించి, ఎలక్షన్ కమిషన్ నుంచి క్లియరెన్స్ కూడా తీసుకొచ్చారు. కానీ పనులు ప్రారంభించడంలో మాత్రం ఇక్కడి ప్రజాప్రతినిధులు మాత్రం పెద్దగా శ్రద్ధ చూపలేదు.

ఇటీవల స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ వరద నివారణ పనులపై రివ్యూ చేసి పనులను వెంటనే ప్రారంభించాల్సిందిగా ఆఫీసర్లను ఆదేశించారు. కానీ టెండర్ అగ్రిమెంట్లు జరగకపోవడంతో ఆ పనులు ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో బొందివాగు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోగా, ఈ ఏడాది కూడా వర్షాలతో ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గ్రేటర్ వరంగల్ లోని అసంపూర్తి పనుల వల్ల లోతట్టు ప్రాంతాల కాలనీలకు వరద ముప్పు పొంచి ఉంది. చాలా కాలనీల్లో డ్రైన్లు సరిగా లేకపోవడం, ఉన్నచోట్లా ఇరుకుగా మారడంతో వరద ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో వరద నీళ్లు బయటకు వెళ్లే మార్గం లేక కాలనీలను ముంచెత్తుతున్నాయి.

గత నాలుగేళ్ల నుంచి ఇదే పరిస్థితి ఎదురవుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలున్నాయి. నగరంలో వరద ఔట్ ఫ్లోకు అవంతరాలు ఏర్పడుతుండగా, తాత్కాలిక పనులు చేపట్టి అయినా ఈ వర్షాకాలంలో ముంపు నుంచి గట్టెంకించాలని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి).

Read Entire Article