Wardhannapet Govt Hospital : వర్ధన్నపేటలో దారుణం-ఫోన్లో డాక్టర్ డైరెక్షన్ గర్భిణీకి నర్సులు డెలివరీ, శిశువు మృతి

3 months ago 155
ARTICLE AD

Wardhannapet Govt Hospital : వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. పురిటి నొప్పులతో కాన్పు కోసం వచ్చిన గర్భిణీని పట్టించుకోవాల్సిన డాక్టర్ అదేమీ పట్టనట్టుగా అక్కడి నుంచి వెళ్లిపోగా.. ఆ తరువాత నొప్పులు ఎక్కువ కావడంతో డాక్టర్ ఫోన్ లో డైరెక్షన్స్ ఇస్తుంటే నర్సులే ఆపరేషన్ చేశారు. పుట్టిన బిడ్డ అస్వస్థతకు గురి కావడంతో వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మగ శిశువు ప్రాణాలు కోల్పోయింది. మూడు రోజుల కిందటే ఈ ఘటన జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అసలేం జరిగింది?

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గుండెపుడి గ్రామానికి చెందిన కసిరెడ్డి నరేశ్, శ్రీజ భార్యాభర్తలు. శ్రీజ తొమ్మిది నెలల గర్భవతి కాగా ఈ నెల 16న పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను వెంటనే వర్ధన్నపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ వివిధ టెస్టులు చేసిన డాక్టర్లు ఆమెను ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. కాగా ఆ మరునాడు 17వ తేదీన పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో శ్రీజ కుటుంబ సభ్యులు ఆపరేషన్ చేయాల్సిందిగా ఆ సమయంలో డ్యూటీలో ఉన్న గైనకాలజిస్ట్ డాక్టర్ మానసా రెడ్డిని కోరారు. కానీ డాక్టర్ మానసా రెడ్డి మాత్రం ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. పైగా వారితో నిర్లక్ష్యంగా మాట్లాడి డ్యూటీ నుంచి మధ్యాహ్నమే ఆమె వెళ్లిపోయారు.

ఆపరేషన్ చేసిన నర్సులు-శిశువు మృతి

మే 17వ తేదీన డ్యూటీలో ఉన్న డాక్టర్ మానసా రెడ్డి ఆసుపత్రి నుంచి వెళ్లిపోయిన అనంతరం శ్రీజకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కంగారు పడి నర్సుల వద్దకు పరుగులు తీశారు. విషయాన్ని వారికి చెప్పడంతో స్టాఫ్ నర్స్ సునీత, మరో ఏఎన్ఎం సుభద్ర ఇద్దరు వెంటనే డాక్టర్ మానసా రెడ్డికి ఫోన్ చేశారు. ఆమె సూచన మేరకు స్టాఫ్ నర్సు, ఏఎన్ఎం శ్రీజను ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లారు. అనంతరం డాక్టర్ ఫోన్ లో సూచనలు ఇస్తుంటే వింటూ ఆపరేషన్ పూర్తి చేశారు. డెలివరీలో శ్రీజకు మగ శిశువు పుట్టి కొంత అస్వస్థతకు గురి కావడంతో వెంటనే వరంగల్ లోకి ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ పిడియాట్రిక్ వార్డులోని నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో అడ్మిట్ చేయగా.. డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్న క్రమంలోనే శిశువు మృతి చెందాడు. దీంతో శ్రీజ భర్త నరేశ్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తమ బిడ్డ ప్రాణాలు కోల్పోవడానికి డ్యూటీ డాక్టర్ మానసా రెడ్డి. స్టాఫ్ నర్సు సునీత, ఏఎన్ఎం సుభద్ర నిర్లక్ష్యమే కారణమని ఆరోపించాడు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లు, సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నరేశ్ వర్ధన్నపేట పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. నరేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వర్ధన్నపేట పోలీసులు వివరించారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Read Entire Article