జగిత్యాల ఎమ్మెల్యేపై భగ్గుమన్న గులాబీ శ్రేణులు.. రాజీనామా చేయాలని డిమాండ్

2 months ago 50
ARTICLE AD

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అనూహ్యంగా బిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరడం అటు కాంగ్రెస్ శ్రేణులను ఇటు బిఆర్ఎస్ కార్యకర్తలను ఆందోళనకు గురి చేసింది. బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఆయనను గుర్తించి రెండుసార్లు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే డబ్బులకు అమ్ముడు పోయాడని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన ఆందోళనతో దిష్టిబొమ్మల దహనంతో ఎమ్మెల్యే తీరుపై మండి పడ్డారు. ఎమ్మెల్యే కు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజా క్షేత్రంలో మళ్ళీ గెలువాలని సవాల్ విసిరారు.

ఎమ్మెల్యే సంజయ్ ఇల్లు ముట్టడి

జగిత్యాలలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఇంటిని ముట్టడించారు. బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ఆద్వర్యంలో కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటికి చేరుకు ఆందోళనకు దిగారు. ఇంటిపై దాడికి యత్నించారు. కొందరు ఇంట్లోకి దూసుకెళ్ళి ఎమ్మెల్యే నేమ్ బోర్డు ద్వంసం చేశారు. హంగామా సృష్టించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని కార్యకర్తల హంగామా ను అడ్డుకున్నారు. జడ్పీ చైర్ పర్సన్ వసంత్ తోపాటు పలువురు ఎమ్మెల్యే ఇంటిముందు బైఠాయించి ఎమ్మెల్యే సంజయ్ రాజీనామా చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు.

అడ్డుకున్న పోలీసులు

బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జి.వి.రామకృష్ణారావు ఆద్వర్యంలో తెలంగాణ చౌక్ లో ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బిఆర్ఎస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో దిష్టిబొమ్మ తునతునకలై చినిగిపోయింది. బిఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరాలనుకునే వారు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కి దుమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి గెలువాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుంటే ఎమ్మెల్యే ను ఎక్కడ తిరగనివ్వమని చెప్పులతో సత్కరించక తప్పదని హెచ్చరించారు.

అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరా... ఎమ్మెల్యే సంజయ్.

కారు దిగి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గులాబీ శ్రేణుల నిరసన ఆందోళనలతో స్పందించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికార పార్టీ కాంగ్రెస్ లో చేరానని స్పష్టం చేశారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధిని కాంక్షిస్తూ కాంగ్రెస్ లో చేరాల్సి వచ్చిందన్నారు. పార్టీ మారడం వెనుక ఎవరి ప్రమేయం, వ్యక్తిగత ప్రయోజనాలు ఏమాత్రం లేవని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆటంకం కలుగకూడదనే ఉద్దేశ్యంతో బిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరడం జరిగిందని వాయిస్ మెసెజ్ పంపించారు. నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని తెలిపారు.

- HT Telugu ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ కె.వి.రెడ్డి

Read Entire Article