బస్టాండ్‌లో వలస కూలీ డెలివరీ, స్థానిక కార్మికుల సాయంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి

3 months ago 60
ARTICLE AD

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులోని ఇటుక బట్టీలో పనిచేసే ఒడిస్సా కు చెందిన నిండు గర్భిణి డెలివరీ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లాలని ప్రాథేయపడినా యజమాని స్పందించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేసేది లేక కుటుంబసభ్యులతో కలిసి కరీంనగర్‌లోని ఆస్పత్రికి బయలు దేరిన ఆ అభాగ్యురాలు.. పురుటి నొప్పులు అధికం కావడంతో కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో పడిపోయింది. నేలపై పడుకుని అవస్థపడడంతో బస్టాండ్‌లో పనిచేసే కార్మికులు గమనించి పురిటి నొప్పులతో బాధపడుతున్నట్లు గ్రహించారు. 108 కు సమాచారం అందించారు. అంబులెన్స్ వచ్చేలోగా ప్రసూతి నొప్పులు ఎక్కువవడంతో బస్టాండ్ వర్కర్స్ ప్రసూతి సాయం అందించారు. పండంటి పాపకు జన్మనిచ్చిన తల్లి బిడ్డను 108 లో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు క్షేమంగా ఉన్నారు.

ఇటుక బట్టి యజమానుల నిర్లక్ష్యం

రెండు రోజులుగా ఆసుపత్రికి పోతాం అన్నా ఇటుక బట్టీ యాజమాని పట్టించుకోలేదని వలస కూలీలు ఆరోపించారు. తోటి వాళ్ళు స్వస్థలాలకు వెళ్ళిపోయారని, తాము వెళ్తామంటే పోనివ్వలేదని ఆరోపించారు. యాజమాని నిర్లక్ష్యం వల్లే బస్టాండ్‌లో డెలివరీ కావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇటుక బట్టి యాజమాని మాత్రం తమ నిర్లక్ష్యం లేదని స్పష్టం చేశారు. పనికోసం వచ్చినప్పటి నుంచి ప్రెగ్నెన్సీ అని సదరు మహిళ పని చేయలేదని, ప్రస్తుతం పని లేకపోవడంతో తోటి కూలీలు వెళ్ళిపోవడంతో తాము వెళ్తామంటే నిండు గర్భిణీ ప్రయాణంలో ఇబ్బంది అవుతుందని ఆపామని చెప్పారు. అయితే వారి ఆరోగ్యం పట్ల అంత శ్రద్ధ యాజమానికి ఉంటే నిండు గర్భిణీని కరీంనగర్ ఆసుపత్రికి సొంత వాహనంలోనో లేదంటే అంబులెన్స్ లోనో ఎందుకు పంపించలేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

వలస కూలీలకు అందని వైద్యసేవలు

పొట్ట చేత పట్టుకుని పొరుగు రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కూలీల బతుకులు అత్యంత దుర్భరంగా మారుతున్నాయి. ఒకటీ రెండు మినహా అన్ని ఇటుక బట్టీల్లో కనీస వసతులు కరవయ్యాయి. ఇక పని చేసే సమయాల్లో ప్రమాదాలకు గురైనా.. అనారోగ్యం పాలైనా వారికి అందుబాటులో ఉండే ఆర్ఎంపీలతోనే నామ్ కే వాస్తేగా వైద్య సేవలు అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

140 బట్టీలు.. 4 వేల మంది కార్మికులు

ఉమ్మడి జిల్లాలో పెద్దపల్లి, సుల్తానాబాద్, రామగిరి, కమాన్ పూర్, మంథని తదితర మండలాల్లో సుమారు 140 వరకు ఇటుకబట్టీ పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమల్లో పనిచేసేందుకు ఒడిశా రాష్ట్రం లోని బాలంగీర్, నౌపడ్ తదితర ప్రాంతాల నుంచి సుమారు 4 వేల మంది వలస కార్మికులు వచ్చి యజమానుల వద్ద పనికి కుదిరారు. కార్మికులు అనారోగ్యానికి గురైతే బట్టీ ఉన్న ప్రాంతాలకు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కొందరు ఇటుక బట్టీల యజమానులు తమ గుమాస్తాలతో పంపిస్తున్నారు.

మరికొందరు తమకు అందుబాటులో ఉన్న ఆర్ఎంపీలతోనే వైద్యం చేయిస్తున్నారని సమాచారం. పిల్లాపాపలతో కలిసి వచ్చిన వలస కూలీలు వారానికోసారి ఇచ్చే డబ్బులతో పొట్టపోసుకునే పరిస్థితి ఉంది. ఈ సొమ్ము కూడా సరిపోక అర్థాకలితో కాలం వెల్లదీస్తున్నారని ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో పెద్దపల్లి పట్టణ శివారులో గల ఇటుకబట్టీలో ఓ గర్భిణి వైద్యం అందక మరణించగా ప్రజాసంఘాల చొరవతో బాధిత కుటంబానికి సాయం అందించారు. ఆ తర్వాత స్వస్థలం పంపించి చేతులు దులుపుకున్నారు.

ఇటుకబట్టీ.. వెట్టిచాకిరీ

పెద్దపల్లి, సుల్తానాబాద్ లోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కూలీలు చాలామంది వెట్టిచాకిరీ చేయలేమంటూ రోడ్డెక్కి కాలినడకన కరీంనగర్ కలెక్టరేటు బయల్దేరడం అప్పట్లో సంచలనంగా మారింది. కార్మికులు, ప్రజాసంఘాల నాయకులు స్పందించిన సమయాల్లోనే పలు శాఖల అధికారులు స్పందిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

కానీ మామూలు సమయాల్లో సంబంధిత శాఖల అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడక పోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఇటుక బట్టీల్లో పనిచేసే వలస కూలీలకు పనిచేసే ప్రాంతాల్లో వసతులు కల్పించడంతోపాటు వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

- HT తెలుగు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ కె.వి.రెడ్డి

Read Entire Article