మత్స్యకారుడిపై మొసలి దాడి.. వరంగల్ జిల్లా పాకాల సరస్సులో ఘటన

2 months ago 56
ARTICLE AD

వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని పాకాల సరస్సులో సోమవారం విషాదం చోటుచేసుకుంది. బుధరావు పేట గ్రామానికి చెందిన చాట్ల చంద్రమౌళి చేపల వేటనే జీవనాధారంగా చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ చేపల వేటకు వెళ్లం, వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో కుటుంబ అవసరాలు తీరుస్తున్నాడు. ఇదిలాఉంటే ఎప్పటి లాగే సోమవారం ఉదయం సమయంలో చంద్రమౌళి కొత్తగూడ మండల పరిధిలోకి వచ్చే గుండం సమీపం నుంచి పాకాల సరస్సులో చేపలు పట్టేందుకు తెప్పపై బయలు దేరాడు.

అలా కొంత దూరం వెళ్లగా సరస్సు మధ్యలో తెప్పపై ఉన్న చంద్ర మౌళిపై అకస్మాత్తుగా మొసలి దాడి చేసింది. చంద్రమౌళి కాలు, తొడ పై భాగంలో కరవడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన గట్టిగా కేకలు వేస్తూ పెనుగులాడుతూ మొసలి నోటి నుంచి తప్పించుకున్నాడు.

అప్పటికే కాలు, తొడపై భాగంలో గాయాలతో తీవ్ర రక్త స్రావం కావడంతో ఆర్తనాదాలు చేస్తున్న ఆయనను అదే సమయంలో అక్కడికి వచ్చిన మరికొందరు మత్స్య కారులు గమనించారు. వెంటనే అతడి వద్దకు వెళ్లి ఒడ్డుకు తీసుకొచ్చారు. తీవ్ర రక్త స్రావం అవుతుండటంతో కట్టుకట్టి వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు.

అంబులెన్స్ నర్సంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యుల సూచన మేరకు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అప్పటికే తీవ్ర రక్త స్రావం జరిగి పరిస్థితి విషమంగా మారడంతో ఆయన కుటుంబ సభ్యులు ఎంజీఎం నుంచి హైదరాబాద్ కు తీసుకుని వెళ్లారు. కాగా మొసలి దాడిలో గాయపడిన చంద్రమౌళి పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్థులు తెలిపారు.

భయాందోళనలో జనాలు

మొసలి దాడి నేపథ్యంలో మత్స్య కారులంతా భయాందోళనకు గురయ్యారు. పాకాల సరస్సులో మొసళ్ల సంఖ్య ఎక్కువగానే ఉండగా, అవి దాడి చేస్తున్న ఘటనలు తరచూ కలకలం రేపుతున్నాయి. గతేడాది కొత్తగూడ మండలంలోని పొగుళ్లపల్లి చెరువులో మొసలి కలకలం రేపింది. వర్షాలు కురిసిన సమయంలో వరద ప్రవాహంలో మైలారం, కొత్తపల్లి, పొగుళ్లపల్లి చెరువుల్లోకి మొసలి ఎంటర్ అయి ఉంటుందని అక్కడి జనాలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

గతేడాది మార్చిలో కొత్తగూడ మండలంలోని మొండ్రాయిగూడెంలోని వ్యవసాయ బావుల్లో ఓ మొసలి కనిపించడం అప్పట్లో కలకలం రేపింది. ఆ తరువాత ఆగస్టులో కూడా పాకాల వాగు నీటిలో కూడా మొసళ్లు దర్శనం ఇచ్చాయి. గూడూరు సమీపంలోని నీటి గుంతలలో మొసలి సంచరిస్తుండగా, స్థానికులు కొందరు గమనించి అధికారులకు సమాచారం అందించారు.

అదే సమయంలో వ్యవసాయ బావుల నుంచి వచ్చిన పశువులు ఆ గుంతల్లో నీటిని తాగేందుకు వెళ్లగా, మొసలి దాడి చేసే ప్రయత్నం చేయడంతో మూగ జీవులు బెదిరి బయటకు పరుగులు తీశాయి. కాగా తరచూ తరచూ పాకాల చెరువు నుంచి మొసళ్లు బయటకు వచ్చి జనాలను భయాందోళన చేస్తుండగా, వర్షాలు కురిసిన సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. చేపల వేటకు వెళ్లే మత్స్య కారులు అలర్ట్ లేకపోతే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Read Entire Article