రైతు నుండి రూ. 70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్స్‌పెక్టర్

2 months ago 60
ARTICLE AD

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గణేష్ పూర్ గ్రామానికి చెందిన రైతు మల్లన్న పాటిల్ జహీరాబాద్ నిమ్జ్ (జాతీయ ఉత్పాదక పెట్టుబడుల మండలి ) భూ సేకరణలో భాగంగా 2 ఎకరాల 36 గుంటల భూమిని కోల్పోయాడు. ఆ భూమికి సంబంధించిన పరిహారం ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో తన భూమికి సంబంధించిన పరిహారం చెల్లింపు విషయమై ఆర్ఐ రిపోర్ట్ పంపిస్తేనే డబ్బులు వస్తాయని రైతు ఆర్ఐ దుర్గయ్యను సంప్రదించారు.

కాగా భూ పరిహారం చెక్కుల కోసం అవసరమైన యాజమాన్య ధ్రువపత్రం జారీ చేసేందుకు రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ రైతును రూ. 1 లక్ష డిమాండ్ చేశారు. దీంతో ఆ రైతు అంత డబ్బు ఇవ్వలేనని చెప్పాడు. ప్రభుత్వం రూ. 43 లక్షలు పరిహారం ఇస్తుంటే తనకు రూ. లక్ష ఇవ్వలేరా.. అని ఆర్ఐ ప్రశ్నించారు.

లక్షకు ఒప్పందం 

ఈ మేరకు ఇద్దరి మధ్య రూ. లక్షకు ఒప్పందం కుదిరింది. మల్లన్న పాటిల్ ఈ నెల 14 న ముందుగా రూ. 30 వేలు ఆర్ఐ కి చెల్లించారు. మిగిలిన డబ్బు చెల్లించే విషయమై బాధితుడు మల్లప్ప మెదక్ రీజనల్ ఏసీబీ డీఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఇదే సమయంలో మిగిలిన డబ్బును ఇవ్వడానికి ఆర్ఐ‌కి ఫోన్ చేశాడు. దీంతో ఆర్ఐ గంగ్వార్ చౌరస్తాలోని కిరాణా షాప్ వద్దకు రమ్మన్నాడు. అక్కడ ఆర్ఐ దుర్గయ్యకు రైతు మల్లప్ప పాటిల్ రూ. 70 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతని కుడి చేతి వేళ్ళు, ప్యాంటు వెనక వైపు కుడి జేబు రసాయన పరీక్షలో పాజిటివ్ అని తేలింది. దీంతో నిందితుడు సంగం దుర్గయ్యను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని ఎస్పీఈ, ఏసీబీ కోర్టుల ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరు పరచనున్నారు.

లంచం డిమాండ్ చేస్తే

ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ -1064 ను సంప్రదించాలని ఏసీబీ డిఎస్పీ సుదర్శన్ సూచించారు. 

Read Entire Article