ARTICLE AD
ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... ముఖ్యమంత్రి వెంట ఉన్న లోక్ సభ ఎంపీలు మల్లు రవి, రఘురామిరెడ్డి,బలరాం నాయక్, సురేష్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్
ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కలిశారు. రావిరాల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 2,462 ఎకరాల భూములను ఇమారత్ పరిశోధన కేంద్రం (ఆర్‌సీఐ) ఉపయోగించుకుంటున్న విషయాన్ని ముఖ్యమంత్రి రక్షణ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
హైదరాబాద్ నగరంతో పాటు నగరం చుట్టు పక్కల ప్రాంతాల్లో రహదారుల విస్తరణ, ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రక్షణ శాఖ భూములు తమకు అవసరమని, ఆర్‌సీఐ రాష్ట్ర ప్రభుత్వ భూములు వినియోగించుకుంటున్నందున రక్షణ శాఖ భూములు 2,450 ఎకరాలు తమకు అప్పగించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం, రక్షణ శాఖ భూముల పరస్పర బదిలీకి అంగీకరించాలని రక్షణ శాఖ మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఙప్తి చేశారు.
సైనిక్ స్కూల్‌పై
వరంగల్ నగరానికి గతంలోనే సైనిక్ స్కూల్ మంజూరు చేసినా గత రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణపరంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు.
వరంగల్ సైనిక్ స్కూల్ అనుమతుల గడువు ముగిసినందున అనుమతులు పునరుద్ధరించాలని లేదా తాజాగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు.
2.70 లక్షల ఇళ్లను మంజూరు చేయండి
2024-25 ఆర్థిక సంవత్సరంలో బీఎల్‌సీ మోడల్‌లో తెలంగాణకు 2.70 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
నిరుపేదలకు వారి సొంత స్థలాల్లో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. కేంద్ర మంత్రి ఖట్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఆయన నివాసంలో కలిశారు.
రాష్ట్రంలో తాము నిర్మించదల్చిన 25 లక్షల ఇళ్లలో 15 లక్షలు ఇళ్లు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి వస్తాయని, వాటిని లబ్ధిదారు ఆధ్వర్యంలోని వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం (బీఎల్‌సీ) పద్థతిలో నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి వివరించారు.
ప్రధానమంత్రి ఆవాస యోజనను (పట్టణ)-పీఎంఏవై (యూ) కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం తీసుకున్నందున, 2024-25 సంవత్సరానికి పీఎంఏవై (యూ) కింద మంజూరు చేసే ఇంటి నిర్మాణ వ్యయం నిధులు పెంచాలని, రాష్ట్రంలో తాము నిర్మించే ఇళ్లను పీఎంఏవై (యు) మార్గదర్శకాల ప్రకారం నిర్మిస్తామని కేంద్ర మంత్రి ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.
పీఎంఏవై (యూ) కింద ఇప్పటి వరకు తెలంగాణకు 1,59,372 ఇళ్లు మంజూరు చేసి రూ.2,390.58 కోట్లు గ్రాంటు కింద ప్రకటించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అయితే ఇందులో ఇప్పటి వరకు కేవలం రూ.1,605.70 కోట్లు మాత్రమే విడుదల చేశారని, మిగతా నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రి ఖట్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
స్మార్ట్ సిటీ మిషన్ పనులపై
స్మార్ట్ సిటీ మిషన్ కింద చేపట్టే పనులు పూర్తి కానుందున మిషన్ కాల పరిమితిని 2025, జూన్ వరకు పొడిగించాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
స్మార్ట్ సిటీ మిషన్ కింద తెలంగాణలో వరంగల్, కరీంనగర్ నగరాల్లో పనులు చేపట్టినట్లు ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మిషన్ కింద వరంగల్‌లో 45 పనులు పూర్తయ్యాయని, రూ.518 కోట్ల వ్యయంతో చేపట్టిన మరో 66 పనులు కొనసాగుతున్నాయని, కరీంనగర్‌లో 25 పనులు పూర్తయ్యాయని, రూ.287 కోట్ల వ్యయంతో చేపట్టిన 22 పనులు కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి వివరించారు.
స్మార్ట్ సిటీ మిషన్ కాల పరిమితి ఈ ఏడాది జూన్ 30తో ముగుస్తోందని, ప్రజా ప్రయోజనార్ధం పనులు ముగిసే వరకు మిషన్ కాలపరిమితిని మరో ఏడాది పొడిగించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.