ARTICLE AD
CM Revanth Reddy : నవంబర్ 30, 2023కు దేశ రాజకీయాల్లోనే ఒక గొప్ప ప్రాధాన్యత ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ రైతు పండుగల సభలో మాట్లాడిన ఆయన...పోలింగ్ బూత్ లలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అండగా నిలబడి ఇవాళ్టికి సరిగ్గా ఏడాది పూర్తయిందన్నారు. రైతు బిడ్డగా కొండారెడ్డి నుంచి బయలుదేరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చానన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి ఆశామాషీగా వచ్చింది కాదు.. ఇది ఒక బాధ్యత అని గుర్తుచేసుకున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఎలాంటి విమర్శలు చేస్తున్నారో ప్రజలు గమనించాలని కోరారు. పదేళ్లలో వాళ్లు ఏం చేశారో నాకంటే మీకే ఎక్కువ తెలుసన్నారు. వాళ్ల పదేళ్ల పాలనలో రైతు రుణమాఫీ జరిగిందా? రైతుకు గిట్టుబాటు ధర లభించిందా? వరి వేస్తే ఉరే అని చెప్పిన ఆనాటి పెద్దమనిషి కేసీఆర్ అని విమర్శించారు.
"ఈనాడు వరి ధాన్యానికి బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ అవుతుంటే, బీఆర్ఎస్ గుండెల్లో పిడుగులు పడుతున్నట్లుంది. కాళేశ్వరం లేకపోయినా, చుక్క నీరు రాకపోయినా కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల ద్వారా నీళ్లిచ్చి 66 లక్షల ఎకరాల్లో 1 కోటి 50లక్షల వరి ధాన్యం తెలంగాణ రైతులు పండించారు. వరికి బోనస్ అందించి గర్వంగా పాలమూరు గడ్డపై రైతు పండుగ చేసుకుంటున్నాం. ఆనాడు ఔటర్ రింగ్ రోడ్ ను రూ.7500 కోట్లకు తెగనమ్మి ఐదేళ్లలో వాళ్లు రుణమాఫీకి ఖర్చు చేసింది రూ.11వేల కోట్లే. ఈ రూ.11 వేల కోట్లలో రూ. 8596 కోట్లు మిత్తికే పోయినయ్. రైతులకు బీఆర్ఎస్ చెల్లించింది కేవలం రూ.2500 కోట్లే" -సీఎం రేవంత్ రెడ్డి
25 రోజుల్లో రూ.17,869 కోట్ల రుణమాఫీ
'మిస్టర్ హరీష్ రావు ఇది విను.. లెక్కలు కావాలంటే మళ్లీ చెబుతాం. కేసీఆర్ కు ఈ వేదికగా సవాల్ విసురుతున్నా.. 25 రోజుల్లో రూ.17,869 కోట్లు రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలో ఎక్కడైనా ఉందా నిరూపించండి. మోదీ వస్తారో.. కేసీఆర్ వస్తారో రండి.. చర్చిద్దాం' అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మొదటి ఏడాదిలోనే 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఒక్కొక్కరుగా వస్తారో, అందరూ కలిసి వస్తారో రండి.. అసెంబ్లీలో చర్చిద్దామన్నారు. రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మాది.. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన చరిత్ర మాది.. రైతు బీమా తెచ్చింది కాంగ్రెస్.. వరి పంటకు రూ.500 బోనస్ ఇచ్చింది కాంగ్రెస్.. రైతు సంక్షేమం కాంగ్రెస్ పేటెంట్ అన్నారు.
కేసీఆర్ ను పాలమూరు బిడ్డలు పల్లకిలో మోస్తే వారి గుండెలపై తన్ని వలసలు పెరిగేలా చేసింది మీరు కాదా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆనాడు పాలమూరును దత్తత తీసుకుంటా అని కేసీఆర్ అన్నారని, కానీ పదేళ్ల ఆయన పాలనలో జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఇవాళ తాము నారాయణ్ పేట్ -కొడంగల్ ప్రాజెక్టు పూర్తి చేస్తామంటే మాత్రం కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారని మండిపడ్డారు. పాలమూరుకు నీళ్లు తెస్తామంటే కేసీఆర్, ఆయన కొడుకు, అల్లుడు అడ్డు పడుతున్నారన్నారు. ఎవరో వచ్చి పాలమూరును దత్తత తీసుకోవడంకాదు.. మీ పాలమూరు బిడ్డనే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారన్నారు.
కేసీఆర్ ఫామ్ హౌస్ 1000 ఎకరాలు
"పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మనం పూర్తి చేసుకోవద్దా? ఒకే సంతకంతో మన జిల్లాకు కావాల్సిన అన్ని తెచ్చుకుందాం. ఏడాదికొక రూ.20 వేల కోట్లు మా జిల్లాకు ఇవ్వాలని మీ తరపున మా మంత్రి వర్గాన్ని నేను అడుగుతా. ఐదేళ్లలో లక్ష కోట్లు ఈ జిల్లాకు తెచ్చకుంటే బంజరు భూములు బంగారు భూములుగా మారవా?
కేసీఆర్ కమీషన్ల కక్కుర్తి కోసం కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు తీసుకెళ్లిండు. అలాంటిది మన గడ్డ అభివృద్ధికి లక్ష కోట్లు తెచుకోలేమా. నా ప్రాంత అభివృద్ధి కోసం, ఇక్కడి యువత కోసం కొడంగల్ లో పారిశ్రామిక వాడ నిర్మించాలనుకుంటే. లగచర్ల చిచ్చు పెట్టి అమాయక లంబాడాలను జైల్లో పెట్టించిండ్రు. వాళ్ల మాయమాటలు నమ్మి అమాయక లంబాడాలు జైలుకు పోయిండ్రు... నేను ఆనాడే చెప్పిన వాళ్ల మాయ మాటలు నమ్మొద్దని. ఒక్క కేసీఆర్ కే గజ్వేల్ లో వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉంది... మా పారిశ్రామిక వాడ కోసం 1300 ఎకరాలు ఉండొద్దా"- సీఎం రేవంత్ రెడ్డి
పారిశ్రామికవాడతో 25 వేల మందికి ఉద్యోగాలు
ఆనాడు అధికారులపై దాడులు చేసి ఉంటే నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు పూర్తయ్యేవా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అభివృద్ధి జరగాలంటే కొందరు నష్టపోక తప్పదు.. వారికి కావాల్సిన నష్టపరిహారం ప్రభుత్వం అందిస్తుందన్నారు. వాళ్లకు ఫామ్ హౌస్ లు ఉన్నాయి... ఇప్పుడు వాళ్లు వస్తారు.. పోతారు.. కానీ మన ప్రాంతానికి పరిశ్రమలు మళ్లీ వస్తాయా? అని ప్రశ్నించారు. ఇంట్లో ఒకరికి ఉద్యోగం వస్తే ఒక తరం పరిస్థితే మారుతుంది. అలాంటి అవకాశం మీరు కోల్పోవద్దని సూచించారు. పాలమూరుపై కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. పారిశ్రామికవాడ తెచ్చి 25 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే జిమ్మేదారి తనదన్నారు.
తోడేళ్ళు, పులులు ఎన్నో చూశా... మానవ మృగాలు మీరెంత.. అన్నారు. మాకు ఏ బ్రాండ్ అంబాసిడర్లు అవసరం లేదు..మీరే మా బ్రాండ్ అంబాసిడర్స్..ఒక్కొక్క యువకుడు ఒక రేవంత్ రెడ్డిగా మారి అభివృద్ధిని ప్రజలకు చేర్చాలని కోరారు. పాలమూరులో 20 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చే బాధ్యత తనదన్నారు.