ACB Raids : ఏడాదిలో ఏడుగురు, ఏసీబీ దాడులంటే ఉద్యోగులకు మామూలే!

1 month ago 65
ARTICLE AD

ఉమ్మడి ఆదిలాబాద్ లో ఏసీబీ దాడులు ఉద్యోగులకు సర్వ సాధారణంగా మారిపోయాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోనే ఎన్నో దాడులు జరిగినప్పటికీ ఏ ఒక్క ఉద్యోగిలో చలనం లేనట్టుగా ఉన్నారు. మూడు పార్టీల నాయకుల పాలనతో ఉద్యోగులలో భయం లేకుండా పోయింది. నిర్మల్ జిల్లాలో సరిగ్గా ఏడాది వ్యవధిలో ఏడు ఏసీబీ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో నగదు తీసుకుంటూ పట్టుబడిన కేసులే ఉన్నాయి. కొందరు అధికారులపై ప్రాపర్టీ కేసులు వేరుగా నమోదయ్యాయి. గతేడాది అక్టోబర్ 29వ తేదీన స్టేషన్ బెయిల్ కోసం మామడ ఎస్సై రాజు రూ.10 వేలు నగదు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. నవంబర్ 4వ తేదీన నిర్మల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో గిఫ్ట్ డీడ్ చేసే విషయంలో జూనియర్ అసిస్టెంట్ అరుణ్, తాత్కాలిక ఉద్యోగి రాజు రూ.8 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. గత ఏడాది డి సెంబర్ 18న కడెం మండలానికి చెందిన ఒక కార్మికుడు జిల్లా కార్మిక అధికారి సాయిబాబాకు రూ.25 వేలు లంచం ఇస్తూ ఏసీబీ అధికారులకు పట్టించారు.

ఈ ఏడాది జనవరి 10వ తేదీన కడెం మండలం మద్దిపడగ గ్రామానికి చెందిన ఒకరు గిఫ్ట్ డీడ్ విషయంలో తహసీల్దార్ రాజేశ్వరి డిప్యూటీ తహసీల్దార్ చిన్నయ్యలు రూ.9 వేలు లంచం తీసు కుంటూ ఏసీబీకి చిక్కారు. అదే నెల 25వ తేదీన నిర్మల్ పురపాలక సంఘంలో ఒక ఇంటి అసెస్మెంట్ విషయంలో రూ.3500 లంచం తీసుకుంటూ మున్సిపల్ రెవెన్యూ అధికారి గంగాధర్ బిల్ కలెక్టర్ నవంత్ లు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కాగా ఈనెల 13న సొంత శాఖలో పనిచేస్తున్న సహచర ఉద్యోగి సర్వీసు పుస్తకంలో కొన్ని ఎంట్రీలు చేసే విషయంలో లంచం తీసుకుంటూ నిర్మల్ పురపాలక శాఖ ఉద్యోగి షాకీర్ ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన జరిగి పక్షం రోజులు గడవకముందే తాజాగా జిల్లా కేంద్రంలోని కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ జగదీష్ సేత్వార్ జారీ చేసేందుకు రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడడం కలకలం రేపింది.

వరుస ఏసీబీ దాడులు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగుల ఒంట్లో భయం లేకుండా పోతుండడం చర్చకు దారి తీస్తుంది. ఏసీబీ అంటే అసలు భయమే లేకుండా పోతుంది. అవినీతి నిరోధక శాఖ అంటేనే గతంలో హడలిపోయేవారు. ఏసీబీ దాడులు అంటూ ఎప్పుడో ఒకసారి వినిపించేది. కానీ లంచం తీసుకోవడం.. అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కడం సాధారణంగా మారిపోయింది. లంచం తీసుకుంటూ పట్టుబడితే కొంతకాలానికి ఉద్యోగం రాకుండా పోతుందా? మళ్లీ ఉద్యోగం కచ్చితంగా వస్తుందన్న అతి నమ్మకం ఉద్యోగులు అధికారులను లంచావతారులుగా మారుస్తుంది. నిర్మల్ జిల్లాలోని సరిగ్గా ఏడాది తిరగక ముందే ఏడుగురు ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖకు చిక్కడం పెరుగుతున్న లంచాల ఉద్ధృతికి అద్దం పడుతుంది. సత్వరమే పనులు చేయించుకునేవారు దొడ్డి దారిన లంచాలు ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు. అలాంటి కేసులు అసలు బయటకు రావడం లేదు. ప్రధానంగా రెవెన్యూ, పురపాలక, రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి భారీగా జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. తాజా పరిస్థితులను బట్టి చూస్తే అధికారులు ఉద్యోగులకు ఏ స్థాయిలో లంచాలకు మరిగారో అర్థం అవుతున్నది.

రిపోర్టింగ్ : వేణుగోపాల్ కామోజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

Read Entire Article