ARTICLE AD
ACB Trap in Jagtial District: జగిత్యాల జిల్లాలో ఓ ఎస్ఐ అక్రమ దందాకు చెక్ పెట్టేలా ఏసీబీ యత్నించగా చాకచక్యంగా ఎస్సై తప్పించుకున్నాడు. మధ్యవర్తిత్వం వహించే వ్యక్తి ఏసీబీకి చిక్కగా తప్పించుకున్న ఎస్సై కోసం అవినీతి నిరోధక శాఖ అధికారులు గాలిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్ళితే రాయికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టుబడగా కేసు లేకుండా వదిలిపెట్టడానికి ఎస్ఐ టి.అజయ్ 50 వేల రూపాయలు డిమాండ్ చేశారు. చివరకు 25 వేల రూపాయలకు డీల్ కుదిరింది. మధ్యవర్తి రాజు ఇసుక ట్రాక్టర్ ఓనర్ వద్ద డబ్బులు తీసుకొని రాత్రి 11 గంటలకు ఎస్ఐకి ఇవ్వడానికి నిర్దేశించిన ప్రదేశానికి రావడంతో ముందుగానే పసిగట్టిన ఎస్సై వారిని తోసేసి పారిపోయాడు. మధ్యవర్తి రాజును అదుపులోకి తీసుకుని ఎస్ఐ కోసం ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.
పథకం ప్రకారం ఒప్పందం….
ఎస్ఐ మామూళ్లతో వేగలేక ఇసుక దందా నిర్వహించేవారు పథకం ప్రకారం ఎస్ఐని పట్టించే వ్యూహం పన్నారు. ఎస్ఐని ఏసిబి కి రెడ్ హ్యాండెడ్ గా పట్టివ్వాలని బాధితులు నిర్ణయించారు. ఎస్ఐ పట్టుకున్న ట్రాక్టర్ ను కేసు లేకుండా విడిపించేందుకు ఎస్ఐ తో బేరసారాలకు దిగారు. ఎస్ఐ అడిగినంత కాకుండా 25 వేలు ఇస్తామని ఒప్పుకుని రాత్రి ఎస్ఐ కి ఇచ్చేందుకు నిర్ణయించగా ఎస్ఐ మద్యవర్తి రాజును పంపించాడు.
అప్పటికే కాచుకుని ఉన్న ఏసిబి అధికారులు మద్యవర్తి రాజు డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఎందుకు డబ్బులు తీసుకున్నావని ప్రశ్నించడంతో ఎస్ఐ తెమ్మన్నాడని చెప్పడంతో ఎస్ఐని పట్టివ్వాలని స్టేషన్ కు చేరుకున్నారు. అయితే ఎస్ఐ అప్పటికే బయటకు వెళ్ళడంతో పోలీస్ స్టేషన్ కు పిలిపించగా ఆయన స్టేషన్ కు చేరుకున్న తరువాత ఏసీబీ అధికారులను గమనించిన ఎస్సై వెంటనే వెనక్కి వెల్లిపోయారు. దీంతో అతన్ని పట్టుకోలేకపోయిన ఏసీబీ అధికారులు మిడియేటర్ ను కస్టడీలోకి తీసుకున్నారు. ఎస్ఐ కోసం అటు ఏసీబీ అధికారులతోపాటు సివిల్ పోలీసులు ఆరా తీస్తున్నారు.