Ashada Bonalu 2024: బోన‌మెత్త‌నున్న భాగ్య‌న‌గ‌రం - జూలై 7 నుంచి ఆషాఢ బోనాలు

5 months ago 85
ARTICLE AD

Ashada Bonalu 2024 in Hyderabad: హైదరాబాద్ నగరంలో బోనాల పండగ సందడి మొదలుకాబోతుంది. ఇందుకు సంబంధించిన తేదీలను ఇప్పటికే ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. జూలై 7వ తేదీ నుంచి ఆషాడ బోనాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి పండగ ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 కోట్లు మంజూరు చేసింది.

ఆషాఢమాస బోనాల ఏర్పాట్లపై దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ సమీక్షించారు. హైదరాబాద్ బేగంపేటలోని హరిత ప్లాజాలో జరిగిన సమావేశంలో హైదరాబాద్ మేయర్ తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. జులై 7 నుంచి 29తేదీ వ‌ర‌కు అత్యంత వైభ‌వంగా బోనాల పండుగ‌ను నిర్వ‌హించ‌నున్నట్లు తెలిపారు. ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. భక్తుల రాక దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది లేజర్ షోలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

ఆషాఢంలో వచ్చే మొదటి ఆదివారం(జూలై 7)వ తేదీన హైదరాబాద్ నగరంలో బోనాల పండగ ప్రారంభమవుతుంది. మొదటగా గోల్కొండ శ్రీ ఎల్లమ్మ ఆలయంలో తొలిపూజ నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, లాల్ దర్వాజ మహంకాళి ఆలయంలో నెలరోజుల పాటూ ప్రతి గురువారం, ఆదివారం ప్రత్యేక పూజలు జరుగుతాయి. తిరిగి గోల్కొండ కోటలోనే చివరి రోజు పూజ నిర్వహిస్తారు. ఈ క్రతువుతో భాగ్యనగర బోనాల‌ ఉత్సవాలు ముగుస్తాయి.

బోనాల పండగ చరిత్ర…..

బోనం…. సంప్రదాయానికి చిహ్నం. స్త్రీమూర్తులే త‌యారు చేస్తారు. గ్రామ దేవ‌త‌ల‌కు ప‌సుపు కుంకుమ‌లు, చీర‌సారెలు, భోజ‌న నైవేద్యాల‌తో మొక్కులు చెల్లిస్తారు. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాల‌మ్మ, పెద్దమ్మ.. గ్రామ దేవతలను తమను చల్లంగా చూడలమ్మా అంటూ.. వేడుకుంటారు.

గ్రామానికి, కుటుంబానికి ఎలాంటి.. ఆపద రాకూడదని మెుక్కుకుంటారు. అయితే ఈ బోనాలు.. తెలంగాణతోపాటుగా.. ఏపీలోని రాయలసీమ, కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లోనూ చేసుకుంటారు. అన్నం, పాలు, పెరుగుతో కూడిన బోనాన్ని అమ్మవారి కోసం మ‌ట్టి లేదా రాగికుండలో వండుతారు. ఆ త‌ర్వాత‌ బోనాల కుండ‌ల‌ను వేప రెమ్మలతో, ప‌సుపు, కుంకుమ‌తో అలంక‌రిస్తారు. కుండపైన ఒక దీపం కనిపిస్తూ ఉంటుంది. వాటిని నెత్తిన పెట్టుకుని.. డ‌ప్పు చ‌ప్పుళ్ల మధ్య మ‌హిళ‌లు ఆల‌యానికి తీసుకెళ్తారు.

బోనాల కుండ‌ల‌ను నైవేద్యంగా స‌మ‌ర్పిస్తారు. గ్రామాల్లో దీన్నే పెద్ద పండుగ, ఊర పండుగ అని కూడా పిలుస్తుంటారు. రంగం పేరిట భ‌విష్యవాణి చెప్పే ఆచార‌ం ఈ బోనాల పండుగ‌లో కనిపిస్తుంది. జాన‌ప‌ద క‌ళ‌లు, డ‌ప్పుల చ‌ప్పుళ్లు, శివ‌స‌త్తుల విన్యాసాల‌తో పండగ వాతావరణం ఉంటుంది.

భాగ్యనగరం బోనాలకు మరో ప్రత్యేకత ఉంది. 1869లో జంట‌న‌గ‌రాల్లో ప్లేగు వ్యాధి మ‌హ‌మ్మారి వ్యాపించింది. వేలాది మంది పిట్టల్లా రాలిపోయారు. దైవాగ్రహాంతో ఇలా జరుగుతుందని.. ప్రజలు భావించారు. గ్రామ దేవ‌త‌ల‌ను శాంత‌ప‌రచ‌డానికి ప్లేగు వ్యాధి నుంచి త‌మ‌ను తాము కాపాడుకోవ‌డానికి చేప‌ట్టిన పండగే బోనాలు అని చెబుతుంటారు.

1675లో గోల్కొండ‌ను పాలించిన ల‌బుల్ హాస‌న్ కుతుబ్ షా ( తానీషా ) కాలంలో బోనం పండుగ హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైన‌ట్టు కూడా చరిత్ర చెబుతోంది. రుతుప‌వ‌నాలు ప్రవేశించి.. వ‌ర్షా కాలం మెుదలుకాగాననే.. మ‌లేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు వస్తాయి. వాటితోపాటుగా సీజ‌న‌ల్ అంటువ్యాధులు బాధిస్తాయి.

ఈ వ్యాధుల నివార‌ణ‌కు బోనాల పండుగ‌కు కూడా సంబంధం ఉంది. వేప ఆకు క్రిమినాశినిగా ప‌నిచేస్తుందన్న విషయం తెలిసిందే. అందుకే రోగ నిరోధ‌క‌త కోస‌మే ఇంటికి వేప తోర‌ణాలు క‌డ‌తారు. బోనం కుండ‌కు వేప ఆకులు కడతారు. బోనం ఎత్తుకున్న మ‌హిళలు వేప ఆకులు ప‌ట్టుకుంటారు. ప‌సుపు నీళ్లు చల్లుతారు. ఇలా బోనాలకు వందల ఏళ్ల చరిత్ర ఉంది.

Read Entire Article