ARTICLE AD
Bandi Sanjay: తెలంగానలో ఉద్యోగుల జీతాలకే పైసల్లేవు... మూసీ ప్రక్షాళన పేరుతో అప్పు తెచ్చి దోచుకునేందుకు సిద్ధమయ్యారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. హైడ్రా తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని, హైడ్రా దాడులపై బీజేపీ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు.
కరీంనగర్‌లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. మేయర్ వై.సునీల్ రావు, కలెక్టర్ పమేల సత్పతి, మున్సిపల్ కమీషన్ చహత్ బాజ్ పాయ్ తో కలిసి రోడ్డు ఊడ్చి, చెత్తాచెదారంను తొలగించారు. రోడ్లను క్లీన్ చేసే రెండు వాహనాలను ప్రారంభించారు.
స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చే నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. గ్రామాలను పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు పర్యావరణం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. మనుసు మంచిగుంటే మంచి ఆలోచనలు వస్తాయి... సమాజానికి మంచి జరుగుతుంది... అందుకే ముందు మనసులో పేరుకుపోయిన మురికి కంపును తొలగించుకోవాలని బండి సంజయ్ కోరారు.
మానవ సేవ మాధవ సేవ అనే గాంధీ మాటలను ఆచరించి, స్వచ్ఛత జీవన విధానంగా మార్చుకోవాలని సూచించారు. స్వచ్ఛత విషయంలో కరీంనగర్ శానిటేషన్ సిబ్బంది చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. సఫాయి కార్మికుల కృషి వల్లే శానిటేషన్ విషయంలో కరీంనగర్ కు జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చిందని అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందన్నారు. అందులో భాగంగానే స్మార్ట్ సిటీ నిధులను మంజూరు చేసిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మ్యాచింగ్ గ్రాంట్ ను విడుదల చేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఎన్నికల తరువాత రాజకీయాలకు పరిమితమైతే ప్రజలు నష్టపోతారని అన్నారు.
అవినీతి కంపు కాంగ్రెస్, బిఆర్ఎస్..
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ తీరు, కాంగ్రెస్ వైఖరి పై మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు అవినీతితో కంపు కొడుతున్నాయని విమర్శించారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ లక్ష కోట్ల అవినీతి పాల్పడితే... మూసీ పేరుతో కాంగ్రెస్ లక్షన్నర కోట్ల దోపిడీకి తెరదీసిందని ఆరోపించారు. జీతాలకే పైసల్లేవు... మూసీ ప్రక్షాళన పేరుతో అప్పు తెచ్చి దోచుకునేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు.
ఢిల్లీకి డబ్బులు పంపేందుకు కాంగ్రెస్ హైడ్రా పేరుతో వసూళ్ళకు తెరదీస్తుందని ఆరోపించారు. హైడ్రా తీరుతో ప్రజలు ఆందోళన చెందుతు, ప్రభుత్వ తీరును అసహ్యించుకుంటున్నారని తెలిపారు. పెద్దల జోలికి వెళ్ళకుండా పేదల ఇళ్ళు కూల్చడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
ఇందిరమ్మ పాలన అంటే పేదలకు నిలువ నీడ లేకుండా చేయడమేనా అని ప్రశ్నించారు. అయ్యప్ప సొసైటీ కూల్చివేత పేరుతో బీఆర్ఎస్ వసూళ్లకు పాల్పడిందని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో పేదప్రజలకు బీజేపీ ఆయుధం కాబోతుందని స్పష్టం చేశారు. పేదలకు మా ప్రాణాలను అడ్డుపెడతాం.. మా ప్రాణాలు తీశాకే... పేదల ఇండ్లపై దాడులకు వెళ్ళాలని సూచించారు. హైడ్రా దాడులపై బీజేపీ ఉద్యమించేందుకు సిద్ధమయ్యిందని సింగిల్ గానే పోరాడుతుందన్నారు.
కుటుంబ వారసత్వ పార్టీలను బొంద పెట్టాలని పిలుపునిచ్చారు..
కుటుంబ వారసత్వ పార్టీలంటేనే అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. తమిళనాడులో తండ్రి సీఎం...కొడుకు డిప్యూటీ సీఎం చూస్తే కుటుంబ పాలనకు అద్దం పడుతుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే సహా కుటుంబ పార్టీల్లో కార్యకర్తలకు ముఖ్య పదవులు ఇవ్వరా?.. అని ప్రశ్నించారు. కుటుంబ, వారసత్వ పార్టీలను బొంద పెట్టాలని బండి సంజయ్ కోరారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)