Bandi Sanjay : బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ఎమ్మెల్యేలపై వివక్ష - బండి సంజయ్

4 months ago 121
ARTICLE AD

Bandi Sanjay : పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులు, నిధుల కేటాయింపు, సింగరేణి ప్రైవేటీకరణ దుష్ప్రచారం సహా అన్ని అంశాల్లోనూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బాటలోనే నడుస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. నిధులు కేటాయింపు, అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో బీజేపీ ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపడం దుర్మార్గమన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు సైతం ప్రజలు ఓట్లేస్తేనే గెలిచారనే సంగతిని గుర్తుంచుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విధంగా వ్యవహరిస్తే పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచించాలని సూచించారు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామని, అందులో భాగంగా రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు తమ వద్దకు వస్తే పూర్తిగా సహకరిస్తున్నామని తెలిపారు.

కరీంనగర్ లో బండి సంజయ్ కుమార్ తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ కు తేడా లేదని రెండు పార్టీలు ఫిరాయింపులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ చేస్తే... ఇప్పుడు కాంగ్రెస్ చేయడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు నిధులకు కేటాయింపులో తీవ్ర వివక్ష చూపుతూ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే అభివృద్ధి నిధులిస్తోందని, బీజేపీ ఎమ్మెల్యేలకు నిధులివ్వడం లేదని ఆరోపించారు. బీజేపీ గెలిచిన చోట్ల ఆయా నియోజకవర్గాల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులకు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లుగా పెట్టి నిధులివ్వడం సరికాదన్నారు.

ప్రజలిచ్చిన తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందన్నారు. నిధులివ్వకుంటే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారనే భావనతో వ్యవహరిస్తోందని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ఉంది... మేం కూడా అట్లనే చేస్తే మీ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచించండని సూచించారు. మేం పార్టీలకు అతీతంగా గెలిచిన ఎంపీలకు నిధులిస్తున్నామని అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తున్నామని తెలిపారు. మేం కూడా మీలాగే వ్యవహరిస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందన్నారు. ప్రజలు నష్టపోతారని అందుకే మాకు ఆ ఆలోచన లేదన్నారు. రాష్ట్ర మంత్రులు కేంద్రాన్ని కలిస్తే పూర్తిగా సహకరిస్తు నిధులిస్తున్నామని మా మంచి తనాన్ని పిరికితనంగా భావిస్తే మీకే నష్టమన్నారు. అందుకే కాంగ్రెస్ తోపాటు అన్ని పార్టీల ఎమ్మెల్యేలను సమానంగా చూడాలి. నిధులివ్వాలి. ఒకవేళ ఇంకా వివక్ష చూపితే మీకే నష్టమనే సంగతి మర్చిపోవద్దని సూచించారు. ఇకనైనా ఇట్లాంటి వ్యవహార శైలిని మానుకోవాలని కోరారు. అందరినీ సమాన దృష్టితో చూడాలన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లనే చేస్తే ప్రజలు తగిన బుద్ది చెప్పారని, చివరకు సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆ పార్టీపై తిరగబడే పరిస్థితి ఏర్పడిందన్నారు. బీజేపీ సహా గెలిచిన ఎమ్మెల్యేలంతా ప్రజలు ఓట్లేస్తేనే గెలిచారనే సంగతి గుర్తు చేసుకోవాలన్నారు. గెలిచిన వాళ్లను వదిలి ఓడిపోయిన వాళ్లకు నిధులివ్వడం ఏ రకమైన ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు.

సింగరేణి ప్రైవేటీకరణపై

సింగరేణి ప్రైవేటీకరణపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ఇట్లనే దుష్ప్రచారం చేస్తే ప్రజలు బుద్ది చెప్పారని తెలిపారు. నాడు బీఆర్ఎస్ చేసిన తప్పునే కాంగ్రెస్ చేస్తోందని ప్రజలన్నీ గమనిస్తున్నారని తెలిపారు.

జనసేనతో పొత్తుపై

పవన్ కల్యాణ్ తన ప్రతిపాదనను బీజేపీ ముందుంచారు... దీనిపై జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు సహా పార్టీ నాయకత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందే తప్ప బండి సంజయ్ చెబితేనో ఇంకొకరు చెబితేనో పొత్తుపై నిర్ణయం తీసుకునే పార్టీ బీజేపీ కాదన్నారు బండి సంజయ్.

టీ 20 వరల్డ్ కప్ భారత్ గెలుపుపై హర్షం

టీ 20 ప్రపంచ కప్ లో భారత్ విజయం సాధించడం సంతో‌మన్నారు బండి సంజయ్. 140 కోట్ల మంది ఆనందంతో ఉన్నారని, భారత్ గెలవాలని ప్రతి ఒక్కరూ మనస్పూర్తిగా కోరుకున్నారని తెలిపారు. ఈ దేశమ్మీద భక్తిభావం ఉన్న వారంతా టీవీల్లో వీక్షించారని ప్రతి భారతీయుడు తానే గెలిచినట్లుగా సంతోషపడుతున్నాడని తెలిపారు. ఇంత గొప్ప విజయాన్ని అందించిన భారత టీంకు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో రెండుసార్లు ప్రపంచ కప్ గెలిచిన స్మృతులను గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు.

రిపోర్టింగ్: కె.వి.రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు

Read Entire Article