ARTICLE AD
Bangla Woman: బంగ్లాదేశ్ అమ్మాయి... తెలంగాణ అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఓ బాబు పుట్టాక ప్రియురాలు స్వదేశానికి పారిపోయింది. కొద్ది రోజులకు కొడుకును కూడా బలవంతంగా తనతో తీసుకెళ్లింది. ఇప్పుడు ఆ బాబును ఇబ్బందులకు గురిచేస్తూ డబ్బుల కోసం భర్తను బెదిరిస్తున్నారు. బాబు కోసం తండ్రి ఆందోళనతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని కలిసి బాబును విడిపించాలని వేడుకున్నాడు. ఏడేళ్ళ బాలుడిని స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఏమి జరిగిందంటే…
వికారాబాద్ జిల్లా చౌదాపూర్ మండలం లింగాపూర్ కు చెందిన తిరుపతయ్య 2016 లో ముంబైకి వలస వెళ్లారు. అక్కడ బంగ్లాదేశ్ కు చెందిన రియా అనే మహిళతో పరిచయం ఏర్పడటంతో 2016లో పెళ్లి చేసుకున్నారు. వారికి 2017లో ఓ బాబు విశాల్ జన్మించాడు. కరోనా సమయంలో మనస్పర్థలు వచ్చి విడిపోవడంతో రియా భర్త తిరుపతయ్య కొడుకు విశాల్ ను వదిలి బంగ్లాదేశ్ కు వెళ్లిపోయింది.
అక్కడ మరొకరిని పెళ్ళి చేసుకుని సంసారం చేస్తుంది. తిరుపతయ్య కొడుకు విశాల్ తో కలిసి హైదరాబాద్ సమీపంలోనే పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని నెలల కిందట రియా తిరుపతయ్యకు ఫోన్ చేసి తన కొడుకును చూస్తానని ముంబైకి తీసుకురమ్మనగా, అతడు విశాల్ ను తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తరువాత రియాతోపాటు వచ్చిన వాళ్లు బెదిరించి బాలుడిని బలంవతంగా తీసుకెళ్లిపోయారని తిరుపతయ్య తెలిపారు.
ముంబయిలో ఫిర్యాదు చేసినా అక్కడి పోలీసులు పట్టించుకోకపోవడంతో స్వగ్రామానికి తిరిగిరాగ, కొన్ని రోజులుగా గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి కొడుకు విశాల్ ను బంగ్లాదేశ్ లో చిత్రహింసలు పెడుతున్నారంటూ వీడియోకాల్ లో అక్కడి దృశ్యాల్ని చూపించాని తెలిపారు. దీంతో తల్లడిల్లిన తండ్రి తన కొడుకును విడిపించాలని కోరడంతో అతను డబ్బులు డిమాండ్ చేశారని, అడిగిన ప్రతిసారీ డబ్బులు పంపినా.. కొడుకు తిరిగి రాకపోవడంతో బాధితుడు ఆవేదనతో ఆందోళన చెందుతున్నాడు.
బండి సంజయ్‌ను ఆశ్రయించిన బాధితుడు…
బాధితుడు తిరుపతయ్య కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని కలిసి భార్య చేసిన మోసం...తన గోడును వెల్లబోసుకున్నారు. జరిగిన మోసాన్ని వివరించడంతో పాటు కొన్ని ఆధారాలను కేంద్ర మంత్రి సంజయ్ కి అందజేశారు.
దీంతో మంత్రి ఆదేశాలతో హోం మంత్రిత్వ శాఖ అధికారులు బంగ్లాదేశ్ అమ్మాయి మోసం పై దృష్టి సారించారు. బాబును క్షేమంగా తండ్రి చెంతకు చేర్చేందుకు చర్యలు చేపట్టారు.
(రిపోర్టింగ్ కెవి.రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా హెచ్‌టి తెలుగు ప్రతినిధి)