Bhatti Vikramarka : రాబోయే 5 ఏళ్లలో డ్వాక్రా మహిళలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

3 months ago 97
ARTICLE AD

Dy CM Bhatti Vikramarka : 2031 నాటికి గరిష్టంగా తెలంగాణ ప్రాంతానికి 27059 మెగా వాట్లు, 2034-35 నాటికి 31,809 మెగావాట్ల పైగా విద్యుత్ డిమాండ్ ఉంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.‌ థర్మల్, సోలార్, హైడల్, పంప్ స్టోరేజ్, ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.‌ విద్యుత్ సర్ ప్లస్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని రామగుండంలో హామీ ఇచ్చారు. ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వం పట్ల కొందరు సామాజిక మాధ్యమాలలో అసత్యాలు ప్రచారం చేయాలని చూస్తున్నారని వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. గతంలో కంటే విద్యుత్ డిమాండ్ పెరిగినప్పటికీ నిరంతరాయ విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు.

రాష్ట్రమంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండంలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రామగుండంలోని 800 మెగావాట్ల టీజీ విద్యుత్ ప్లాంట్ స్థలాన్ని పరిశీలించి, రూ.3 కోట్లతో నిర్మించిన నైపుణ్య కేంద్రాన్ని ప్రారంభించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అమృత్ 2.0, టి.యూ.ఎఫ్.డి. ఐ.సి కింద చేపట్టే పలు అభివృద్ధి పనులకు, సింగరేణి ఆధ్వర్యంలో రూ.5 కోట్ల నిధులతో 23 కిలోమీటర్ల అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 211 మహిళా సంఘాలకు 23 కోట్ల 35 లక్షల 50 వేల రూపాయల బ్యాంకు లింకేజీ చెక్కులను డిప్యూటీ సీఎం పంపిణీ చేశారు. మేడిపల్లిలోని ఆర్జీ 1 మినీ ఓసీపీని సందర్శించి ఓసీపీలో నిల్వ ఉన్న ఒక టీఎంసీ నీటితో జల విద్యుత్ ఉత్పత్తి చేసే అంశాన్ని పరిశీలించారు.

మహిళలతో 4 వేల మెగావాట్ల సొలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు

రామగుండం చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. పీఎం కుసుమ్ కింద తెలంగాణలో మరో నాలుగు వేల మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో ప్రత్యేకంగా రాష్ట్రంలోని మహిళా సంఘాలకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. డ్వాక్రా మహిళా సంఘాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రాబోయే 5 సంవత్సరాల కాలంలో లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి, తెలంగాణ జెన్ కో సంయుక్తంగా 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మిస్తామని తెలిపారు. పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు అవసరమైన భూమి ఇతర సౌకర్యాల కల్పనకు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు సహకరించి ఎంత తొందరగా ప్రతిపాదనలు పంపితే అంత తొందరగా పవర్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

రూ.36 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బృందం అమెరికా, దక్షిణ కొరియా దేశాలలో పర్యటించి రాష్ట్రానికి దాదాపు రూ.36 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పెట్టుబడుల ద్వారా స్థానికంగా తెలంగాణ యువతకు ఉపాధి కల్పించేందుకు అవసరమైన నైపుణ్యాలు అందించాలని లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు.

2500 కోట్లు ఖర్చు చేసి మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం విస్తరింపజేసామని, పేదలందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరించి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లను మొత్తం 4.5 లక్షల ఇండ్లను మంజూరు చేశామన్నారు.

నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు

నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. నెలరోజుల్లో 100 మందికి ఉపాధి కల్పించే రూరల్ టెక్నాలజీ సెంటర్ అనే సాఫ్ట్ వేర్ సంస్థను రామగుండంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా పెద్దపల్లిలో సుల్తానాబాద్ వద్ద కూడా రూరల్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు 10 ఎకరాల స్థలం గుర్తించామని తెలిపారు.

రిపోర్టింగ్ : కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

Read Entire Article