ARTICLE AD
CM Revanth Reddy : హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలన్నారు. భూసేకరణకు అవసరమయ్యే నిధులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు. నేషనల్ హైవే నుంచి నేషనల్ హైవేకు కనెక్ట్ అయ్యేలా ఔటర్ రింగ్ రోడ్డు ఉండాలని సూచించారు. వరంగల్ లో సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి టెక్స్టైల్ పార్కుకు కనెక్టివిటీ ఉండేలా రోడ్డుమార్గం ఉండేలా చూడాలన్నారు. స్మార్ట్ సిటీ మిషన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.
వరంగల్ ఆసుపత్రి అంచనా పెంపుపై సీఎం సీరియస్
వరంగల్ నగర అభివృద్ధిపై ఇక నుంచి ప్రతీ 20 రోజులకోసారి మంత్రి సమీక్ష నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నగర అభివృద్ధికి సంబంధించి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వరంగల్ లో డంపింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం విషయంలో ఇష్టారీతిన అంచనా వ్యయం పెంచడంపై అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అప్రూవ్ లేకుండా రూ.1100 కోట్లున్న అంచనా వ్యయాన్ని రూ.1726 కోట్లకు ఎలా పెంచారని ప్రశ్నించారు.
కేవలం మౌఖిక ఆదేశాలతో రూ.626 కోట్ల వ్యయం ఎలా పెంచుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అంచనా వ్యయం పెంచడమెంటని సీరియస్ అయ్యారు. నిర్మాణ వ్యయంపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని సీఎం ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా యుద్ధప్రాతిపదికన హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాల్సిందేనని నిర్మాణ సంస్థకు తేల్చి చెప్పారు.
మళ్లీ 45 రోజుల్లో వరంగల్ అభివృద్ధిపై సమీక్ష
"వరంగల్ అభివృద్ధి కోసం అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేయాలి. సమర్ధత ఆధారంగానే అధికారులకు ఉన్నత అవకాశాలు ఉంటాయి. ఈ ప్రభుత్వంలో రాజకీయ ప్రేరేపిత బదిలీలు, రాజకీయ అవసరాల కోసం బదిలీలు ఉండవు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడం మన కర్తవ్యం. వరంగల్ అభివృద్ధిపై ఇది ప్రాథమిక సమీక్ష మాత్రమే. మళ్లీ 45రోజుల్లో వరంగల్ అభివృద్ధిపై మరో సమీక్ష నిర్వహిస్తా. వైద్య రంగాన్ని విస్తరించాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ హాస్పిటల్ ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. విద్య, వైద్యం, విద్యుత్ అందుబాటులో ఉంటే విశ్వనగరంగా అభివృద్ధి సాధ్యమవుతుంది. హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందింది. ఫార్మారంగం ఎప్పుడు చర్చకు వచ్చినా అందులో హైదరాబాద్ కు స్థానం ఉంటుంది. ఇందుకు కారణం ఇందిరాగాంధీ దూర దృష్టి.
రాజీవ్ గాంధీ చొరవతో తెలంగాణలో ఐటీ రంగం రాణించింది. తెలంగాణను మెడికల్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతాం. రాష్ట్రంలో ఫార్మా అభివృద్ధికి ఫార్మా విలేజెస్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శంషాబాద్ లో వెయ్యి ఎకరాల్లో మెడికల్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది."- సీఎం రేవంత్ రెడ్డి
ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డు
"అన్ని రకాల వైద్య సేవలు అందించేలా మెడికల్ టూరిజం హబ్ ఉండాలి. రాష్ట్రంలో ప్రతీ పౌరుడికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రాష్ట్రంలో ప్రతీ పౌరుడికి ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. మా ఆలోచనను ముందుకు తీసుకెళ్లేందుకు సాంకేతికంగా మీ సహాయం కోరుతున్నాం. ఆసుపత్రికి ఎంతమంది వచ్చారని కాదు.. ఎంతమంది నవ్వుతూ ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లారనేది ముఖ్యం. వైద్యం అందించడం ఒక సామాజిక బాధ్యత. డబ్బుల కోణంలో కాదు సేవ చేయాలనే దృక్పథంతో పనిచేయాలి. వరంగల్ నగరానికి త్వరలో ఎయిర్ పోర్ట్ రాబోతోంది, టెక్స్టైల్ పార్కు త్వరలోనే అందుబాటులోకి రానుంది. వరంగల్ లో హెల్త్ టూరిజం, ఎకో టూరిజం అభివృద్ధి చేస్తాం."- సీఎం రేవంత్ రెడ్డి