Congress: నా నాలుక మీద పుట్టుమచ్చ ఉంది.. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సీఎం అవుతారు: కోమటిరెడ్డి

2 months ago 62
ARTICLE AD

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిని 'ముఖ్యమంత్రి గారూ' అని సంబోధించారు. భవిష్యత్‌లో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సీఎం అవుతారని జోస్యం చెప్పారు. ఇప్పటికే ఉత్తమ్‌కు సీఎం పదవి మిస్‌ అయిందన్నారు. 'నా నాలుక మీద పుట్టుమచ్చ ఉంది.. నా వ్యాఖ్యలు నిజమవుతాయి' అని రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారాయి.

గతంలో రేవంత్‌కు వ్యతిరేకంగా..

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. గతంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. 2018లో మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డికి టీపీసీసీ ఇవ్వడాన్ని రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. రేవంత్‌పై ఫైర్ అయ్యారు. ఆ క్రమంలోనే ఆయన బీజేపీలోకి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదనికి రాజీనామా చేశారు.

రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో..

రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక జరిగింది. అప్పుడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాజగోపాల్ రెడ్డి మళ్లీ హస్తం గూటికి చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ మునుగోడు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన మంత్రి అవుతారని అంతా అనుకున్నారు. కానీ.. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు.

చాలా రోజుల తర్వాత..

ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చాలా రోజులు రాజగోపాల్ రెడ్డి ఎక్కడా పెద్దగా మాట్లాడలేదు. కానీ.. తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన మాటల వెనక ఆంతర్యం ఏంటనే చర్చ జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి ఈ కామెంట్స్ చేసినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అదే వేదికపై ఉన్నారు. ఆయనే కాకుండా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఇతర నేతలు ఉన్నారు. ఎవ్వరూ కూడా ఆయన మాటలకు అడ్డు రాలేదు.

ఏదో జరగబోతోందనే టాక్..

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో ఏదో జరగబోతోందనే టాక్ వినిపిస్తుంది. రాజగోపాల్ రెడ్డి లాంటి నాయకుడు అంత ఈజీగా ఏం మాట్లాడరు కదా అని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. అయితే.. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారని అన్నారు కానీ.. ఎప్పుడు అనేది మాత్రం చెప్పలేదు. దీంతో ఆయన ఫ్లోలో అలా అన్నారని మరికొందరు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

Read Entire Article