Cyber Crime : వరంగల్ కలెక్టర్ పేరిట ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్, డబ్బులు కావాలంటూ మెసేజ్ లు

5 months ago 126
ARTICLE AD

Cyber Crime : సోషల్ మీడియా వేదికగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో పద్ధతిలో జనాల ఖాతాలు కొల్లగొడుతున్నారు. కాగా ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు ఓరుగల్లు ఆఫీసర్లను టార్గెట్ చేశారు. జిల్లాలోని ఆఫీసర్ల ఫేస్ బుక్ ఐడీలను హ్యాక్ చేయడం, ఆ తరువాత ఫేక్ ఐడీలు సృష్టించి, వాటి ద్వారా ఇతరులకు మెసేజ్ లు పంపించి డబ్బులు అడుగడం మొదలుపెడుతున్నారు. గతంలో కూడా ఇలాగే జరగగా, మూడు రోజులు వ్యవధిలోనే వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి పేరున ఫేస్ బుక్ నుంచి డబ్బులు కావాలంటూ మెసేజ్ లు పంపించడం కలవరానికి గురి చేస్తోంది. రోజు రోజుకు ఇలాంటి సైబర్ నేరాలు పెరిగిపోతుండగా, ఏకంగా జిల్లా అధికారుల పేరుతోనే దుండగులు డబ్బులకు ఎర వేస్తుండటం కలకలం రేపుతోంది.

మొన్న వరంగల్ సీపీ పేరుతో

గత సోమవారం వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా పేరున గుర్తు తెలియని వ్యక్తులు ఫేక్ ఫేస్ బుక్ ఐడీ క్రియేట్ చేశారు. అనంతరం ఆ ఐడీ నుంచి కొంతమందికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించడం స్టార్ట్ చేశారు. ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన వెంటనే అర్జంటుగా డబ్బులు అవసరం ఉన్నాయని, ఫోన్ పే చేయాల్సిందిగా మెసేజ్ లు పంపించడం మొదలుపెట్టారు. ఆ విషయాన్ని కొంతమంది వెంటనే సీపీ అంబర్ కిషోర్ ఝా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తన పేరున ఫ్రెండ్ రిక్వెస్టులు పంపిస్తే ఎవరూ యాక్సెప్ట్ చేయొద్దని సీపీ అఫీషియల్ గా ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది.

నేడు వరంగల్ కలెక్టర్

గతంలో వరంగల్ జిల్లా కలెక్టర్ గా పని చేసిన డా.బి.గోపి ఫేస్ బుక్ ఐడీతో గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు డిమాండ్ చేయగా, అప్పట్లో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఆ విషయం చర్చనీయాంశంగా మారగా, తాజాగా వరంగల్ జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్న సత్య శారదా పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేక్ ఐడీ సృష్టించారు. అనంతరం ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి తాను మీటింగ్ లో ఉన్నానని, అర్జంట్ గా డబ్బులు కావాలంటూ మెసేజ్ లు పంపించారు. +94784977145 నెంబర్ కు డబ్బులు పంపించాలని కోరారు. డబ్బులు ఫోన్ పే ద్వారా పంపించి, స్క్రీన్ షాట్ షేర్ చేయాలని మెసేజ్ లో పేర్కొన్నారు. దీంతో విషయం తెలుసుకున్న కలెక్టర్ సత్య శారదా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసపూరితమైన మెసేజ్ లను నమ్మొద్దని, తన పేరుతో వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులకు ఎవరూ రెస్పాండ్ కావద్దని కలెక్టర్ సత్యశారదా కోరారు. ఎవరైనా తన పేరుతో డబ్బులు అడిగితే వెంటనే బ్లాక్ చేయాలని సూచించారు.

శ్రీలంక గ్యాంగ్ పనేనా..?

మూడు రోజుల వ్యవధిలో ఓరుగల్లుకు చెందిన ఇద్దరు పెద్ద ఆఫీసర్ల పేరున ఫేక్ ఐడీలు సృష్టించి డబ్బులు అడుగుతుండటంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించారు. వరంగల్ కలెక్టర్ పేరున డబ్బులు అడిగిన నెంబర్ ను ట్రేస్ చేసే పనిలో పడ్డారు. కాగా ఆ నెంబర్ శ్రీలంక దేశానికి చెందినదిగా గుర్తించారు. కానీ ఆ నెంబర్ నిజంగా శ్రీలంకకు చెందినదేనా లేదా ఫేక్ లొకేషన్ తో మోసాలకు పాల్పడుతున్నారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.ఈ మేరకు సైబర్ నేరస్థులను గుర్తించేందుకు వరంగల్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. సైబర్ క్రైమ్స్ విభాగానికి చెందిన అధికారులు తమ వద్ద ఉన్న టెక్నాలజీ దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా గుర్తు తెలియని వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు పంపి మోసపోవద్దని, సైబర్ నేరాల పట్ల జనాలు అవగాహనతో మెలగాలని అధికారులు సూచిస్తున్నారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

WhatsApp channel

Read Entire Article