ARTICLE AD
Dharani Pending Applications : పెండింగ్ ఉన్న ధరణి దరఖాస్తులను మరో వారం రోజుల్లో క్లియర్ చేయాలని సంబంధిత అధికారులను కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. దరఖాస్తులను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టిని సారించాలని సూచించారు.
రెవెన్యూ అధికారుల పరిదిలో ఎటువంటి పెండింగ్ దరఖాస్తులు ఉండకుండా కలెక్టర్ లు పర్యవేక్షించాలని సిసిఎల్ఏ కమీషనర్ నవీన్ మిట్టల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచించడంతో జిల్లాలో జూన్ 15 నుంచి 28 వరకు పరిష్కరించిన దరఖాస్తులతో పాటు పరిష్కరించాల్సిన దరఖాస్తుల వివరాలను గురించి కలెక్టర్ వాకబు చేశారు.
ఎన్ఆర్ఐ పట్టా పాస్ పుస్తకం, కోర్టు కేసు, కోర్టు వివాదంలో ఉన్న పట్టా పాస్ పుస్తకం, డేటా కరెక్షన్, జిపిఏ, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ, నూతన పట్టా పాస్ పుస్తకాల జారీ/ నాలా, ఖాతా మెర్జింగ్, భూ సంబంధిత ఫిర్యాదులు, నాలా పిపిబి, పెండింగ్ మ్యూటేషన్, సక్సెషన్, అర్భన్ ల్యాండ్ అంశాలపై వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
మండలాల వారిగా పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి వాటిని క్లీయర్ చేయాలని సూచించారు. ఆర్ఎస్ఆర్ లిమిట్, మిస్సింగ్ సర్వే నెంబర్లు, సక్సెషన్, మ్యూటేషన్, మొదలగు వివిధ సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన పద్ధతుల పై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఆధార్ బయోమెట్రిక్ వేలిముద్ర స్వీకరణ సంబంధించి ఎల్ పరికరాల వినియోగ గడువు ముగుస్తున్న నేపథ్యంలో జిల్లాలకు ఎల్ 1 బయోమెట్రిక్ పరికరాలు పంపడం జరిగిందని, వీటిని సరిగ్గా రీప్లేస్ చేయాలని అన్నారు.
దరఖాస్తులపై చర్యలు తీసుకోవడంలొ ఎదురయ్యే సందేహలను పైఅధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం సమీకృత గురుకుల విద్యా సంస్థల ఏర్పాటుకు అనుకూలంగా స్థలాన్ని గుర్తించాలని అన్నారు.
సీసీఎల్ఏ కమిషనల్ కీలక ఆదేశాలు….
శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి సీసీఎల్‌ఏ జిల్లాల కలెక్టర్లతో రెండు దశల్లో వీడియో కాన్ఫ్‌రెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ధరణి పోర్టల్లో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులపై పూర్తిస్థాయిలోల ఆరా తీశారు. పరిష్కారం విషయంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) నవీన్‌మిత్తల్ జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు.
జూన్ 15వ తేదీ నుంచి 28వ తేదీల మధ్య పలు జిల్లాల్లో చాలా తక్కువ సంఖ్యలో ధరణి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించిన తీరుపై నవీన్ మిట్టల్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. చిన్న చిన్న సమస్యలను కూడా పెండింగ్ లో ఉంచటం సరికాదని… ఆర్డీవోలు వెనువెంటనే పరిష్కరించాల్సిన వాటిని క్లియర్ చేయాలని పునరుద్ఘటించారు.
ఉచిత కోచింగ్ కు దరఖాస్తుల ఆహ్వానం…
తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ, కరీంనగర్ సివిల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ 2025 (ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్) పరీక్ష కొరకు ఉచిత శిక్షణకు జులై 03 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ తెలిపారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో డిగ్రీ పాసైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల వారు ఆన్ లైన్ లో "www.tgbcstudycircle.cgg.gov.in" లో ధరఖాస్తు చేసుకోవలని సూచించారు.
కోచింగ్ తరగతులు 18-07-2024 నుండి 18-4-2025 వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. శిక్షణలో మొత్తం 150 మంది అభ్యర్ధులకు కోచింగ్ ఇవ్వనుండగా, అందులో 100 మందికి గాను 07.07.2024న నిర్వహించే ఆన్ లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేస్తారు.
మరో 50 మంది అభ్యర్ధులను ఇంతకు ముందు UPSC ద్వారా నిర్వహించిన సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారిని నేరుగా తీసుకొబడుతారని తెలిపారు. ఆసక్తి గలవారు సంబంధిత పత్రాలతో తేది 03-07-2024 లోగా టి.జీ.బీ.సీ. స్టడీ సర్కిల్ లక్ష్మీనగర్ కాలనీ, సైదాబాద్, హైదరాబాద్ 500059 దరఖాస్తును సమర్పించాలని సూచించారు.
ప్రవేశం పొందిన అభ్యర్ధులకు లాడ్జింగ్, భోజన, రవాణా ప్రయోజనం కోసం నెలకు రూ.5000/, మరో రూ.5000/- లను బుక్ ఫండ్ నిమిత్తము ఒక్కసారి ఇవ్వబడునని ప్రకటించారు. గ్రంథాలయ సదుపాయం కూడా కల్పించినట్లు తెలిపారు. ఈ ఉచిత శిక్షణ హైదరాబాదులో ఉంటుందని వివరించారు.