ARTICLE AD
Dharani Portal : గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూముల లావాదేవీల కోసం ధరణి పోర్టల్ అందుబాటులోకి తెచ్చింది. అయితే ధరణి అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో కాంగ్రెస్ ప్రభుత్వం...ధరణిపై ఓ కమిటీ వేసింది. ఈ కమిటీ ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. ధరణి పోర్టల్ సాంకేత సమస్యలతో రెవెన్యూ అధికారులు చుట్టూ తిరుగుతున్న రైతులు, భూయజమానులకు ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ధరణిలోని భూసమస్యలకు పరిష్కారానికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో పలు జిల్లాల్లో రెవెన్యూ యంత్రాంగం రంగంలోగి దిగింది. భూసమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలతో పాటు పాత దస్త్రాలను పరిశీలించాలని రెవెన్యూశాఖ అధికారులు నిర్ణయించుకున్నారు.
తహసీల్దార్, ఆర్డీవోలకు ధరణి లాగిన్
ధరణి సమస్యలపై కలెక్టర్లపై ఇటీవల సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి... జిల్లాల వారీగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి జూన్ చివరి నాటికి సమస్యల పరిష్కారాన్ని ఓ కొలిక్కి తీసుకోవాలని ఆదేశించారు. అయితే గతంలో ధరణి సమస్యలు పరిష్కరించేందుకు కలెక్టర్లకు మాత్రమే అధికారం ఉండేది. ధరణి దరఖాస్తులు పెద్ద సంఖ్యలో ఉండడంతో జాప్యం జరగకుండా ఉండేందుకు ఆర్డీఓలు, తహసీల్దార్లకు ధరణి పోర్టల్ లాగిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీఎల్‌ఎం, టీఎం-33, మిస్సింగ్ సర్వే నంబర్లు, భూమి హెచ్చుతగ్గులు, నిషేధిత జాబితాలోని భూములు, వారసత్వ భూములు, నాలా కన్వర్షన్, ఎన్నారైల భూములు, కోర్టు కేసుల్లోని భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఆర్డీఓలు, తహసీల్దార్లు బాధ్యతలు అప్పగించింది. రెవెన్యూ ఆఫీసుల్లో ధరణి సమస్యలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
రెవెన్యూ కార్యాలయాల్లో డ్యాష్ బోర్డులు
డ్యాష్ బోర్డులు ఏర్పాటు చేసి ఏ తరహా భూ సమస్యలు ఎక్కువగా పెండింగ్ లో ఉన్నాయని స్పష్టం చేస్తూ రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కలెక్టరేట్‌తోపాటు ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో డ్యాష్ బోర్డులు ఏర్పాటుచేయాలని ఆదేశించింది. దరఖాస్తుల పెండింగ్‌కు కారణాలను డ్యాష్ బోర్డుల్లో ప్రజలకు తెలియజేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ నెలాఖరు నాటికి పెండింగ్ దరఖాస్తులకు ఓ పరిష్కార మార్గం చూపాలని రెవెన్యూ యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత దరఖాస్తుల పరిష్కారం అయితే మరోసారి దరఖాస్తుల ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.
ధరణి పోర్టల్ ప్రక్షాళన
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో లక్షలాది కుటుంబాలు భూసమస్యలు ఎదుర్కొంటున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం అంటోంది. ఆ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్‌ను పునర్వ్యవస్థీకరించి, భూవ్యవహారాలను అందుకు సంబంధించిన చట్టాల్లో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ మేరకు ధరణి పోర్టల్ ప్రక్షాళనకు సత్వర చర్యలు చేపట్టింది. ధరణి పోర్టల్ అమలులో వచ్చిన సమస్యలను అధ్యయనం చేయడానికి ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ భూసంబంధిత నిపుణులు, అధికారులతో చర్చించి 18 రాష్ట్రాల్లోని ఆర్వోఆర్ చట్టాలని పరిశీలించింది. భూ వివాదాల పరిష్కార కోసం రెవెన్యూ ట్రిబ్యునల్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. భూమికి సంబంధించిన ముఖ్యమైన చట్టాలన్నింటిని కలిపి ఒకే చట్టంగా రూపొందించాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. ధరణి పోర్టల్ బలోపేతం చేయాడానికి, సామాన్య ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది.