ARTICLE AD
మామూలుగా అయితే దీపావళి పండుగ రోజున అందరూ తమ ఇళ్లల్లో దేవుళ్లను పూజిస్తారు. ఇంకా కొందరు దగ్గర్లోని దేవాలయాలకు వెళ్లి పూజలు చేస్తారు. కానీ చోట మాత్రం సమాధుల వద్ద పూజలు నిర్వహిస్తారు. చనిపోయిన తమ పూర్వికులను గుర్తుచేసుకుంటారు. స్మశానంలోని సమాధుల ముందు దీపాలు వెలిగిస్తారు. టపాసులు కాల్చి దీపావళి వేడుకలు జరుపుకుంటారు. ఈ ఆచారాన్ని ఆరు దశాబ్దాలకు పైగా కోనసాగిస్తున్నారు.
కరీంనగర్‌లోని కార్ఖనగడ్డలో హిందూ స్మశాన వాటిక ఉంది. అక్కడ 60 ఏళ్లుగా దీపావళి వేడుకలు జరుగుతున్నాయి. ఓ సామాజికవర్గానికి చెందిన కుటుంబాలు స్మశానంలోని తమ కుటుంబీకుల సమాధుల వద్దనే దీపావళి పండుగను జరుపుకుంటున్నాయి. దీపావళికి వారం రోజుల ముందే స్మశానవాటికను శుభ్రం చేసి.. సమాధులకు రంగులు వేస్తారు. సమాధులను పూలతో అలంకరిస్తారు.
అలా ముస్తాబు చేసిన సమాధుల వద్దకు దీపావళి పండగ రోజును కుటుంబ సభ్యులంతా వస్తారు. చుట్టూ దీపాలు వెలిగించి.. తమవారిని గుర్తు చేసుకుంటారు. సమాధుల వద్ద పండుగ జరుపుకుంటే తమ వారితో కలిసి ఉన్న భావన వస్తుందని వారు చెబుతున్నారు. తమ పూర్వీకులకు ఇష్టమైన వంటలు వండి సమాధుల వద్ద నైవేధ్యంగా పెడతారు. నైవేద్యాలు సమర్పించిన తర్వాత.. వారిని స్మరించుకుంటూ సమాధుల వద్ద పూజలు చేస్తారు.
ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు కూడా తప్పకుండా దీపావళికి అక్కడికి వెళ్తారు. తమ పూర్వీకులు లేనిదే తాము లేమని.. అందుకే పూర్వికులను స్మరించుకోవడమే నిజమైన దీపావళి అని చెబుతున్నారు. వీరి నమ్మకాన్ని స్థానిక ప్రజలు కూడా వ్యతిరేకించరు. వారికి సహకరించి.. ఆనందంగా గడిపేలా సాయం చేస్తారు.
టపాసులతో జాగ్రత్త..
దీపావళి రోజున చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు టపాకాయలు కాలుస్తారు. కానీ పండగ రోజు అజాగ్రత్తగా ఉంటే అది గాయాలకి దారితీసే ప్రమాదం ఉంది. బాణాసంచా పొరపాటున మన చర్మంపై పడితే తీవ్ర గాయమవడంతో పాటు చెవులు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలి.