High Court on Hydra : చార్మినార్‌ను కూల్చాలని అక్కడి ఎమ్మార్వో చెబితే కూల్చేస్తారా?: హైకోర్టు

2 months ago 77
ARTICLE AD

తెలంగాణ హైకోర్టులో హైడ్రాపై సోమవారం విచారణ జరిగింది. ఈ విచారణకు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్ వర్చువల్‌గా హాజరైరయ్యారు. తాము అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పాలని.. హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు స్పష్టం చేసింది. చార్మినార్‌ను కూల్చాలని అక్కడి ఎమ్మార్వో చెబితే కూల్చేస్తారా అంటూ హైడ్రా కమిషనర్‌ను ప్రశ్నించింది. అటు అమీన్‌ పూర్‌ తహశీల్దార్‌ పైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవనాన్ని 48 గంటల్లో ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి 40 గంటల్లోపే ఎలా కూల్చుతారంటూ ధర్మాసనం సీరియస్‌ అయ్యింది.

'మీ ఇష్టం వచ్చినట్లు కూల్చివేస్తారా ? అదివారం కూల్చకూడదన్న నిబంధన కూడా తెలియదా? కనీసం ప్రభుత్వ న్యాయవాదులను అడగాలన్న ఉద్దేశం కూడా లేదా? ప్రజలను భయబ్రాంతులకు గురి చేయాలి చూస్తున్నారా? అలా అయితే.. కోర్టులు చేతులు కట్టుకొని కూర్చోవు. స్టే ఇచ్చిన తర్వాత కూడా కూల్చివేత చేపడతారా?' అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

'నోటీసులు జారీ చేసినప్పుడు వారి వాదన కూడా వినరా ? శనివారం సాయంత్రం ఇచ్చి.. ఆదివారం కూల్చివేతా? సెలవు దినం రోజున విధులకు హాజరై దూకుడుగా ఎందుకు కూల్చారు? రాజకీయ నాయకులు చెప్పింది వింటే మీరు ఇబ్బందులు పడతారు. చట్టం తెలుసుకోండి.. ఆ మేరకు ముందు వెళ్లండి' అని అధికారులకు హైకోర్టు సూచించింది.

'హైడ్రా అంటే కోర్టుకు వ్యతిరేకత లేదు.. ఏర్పాటు అభినందనీయం. కానీ, ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తాం అంటే మాత్రం కుదరదు. ఎమ్మార్వో అడిగితే సిబ్బంది, యంత్రాలు ఇచ్చేస్తారా ? హైడ్రా కమిషనర్‌ గా మీకు చట్టం తెలియదా? రేపు చార్మినార్‌, హైకోర్టును ఎమ్మార్వో కూల్చమంటే ఇలాగే వ్యవహరిస్తారా?. అక్రమ నిర్మాణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మేం సమర్థించడం లేదు' అని ధర్మాసనం స్పష్టం చేసింది.

'చర్యలు చేపట్టాల్సిందే.. కానీ, నిబంధనలు పాటించాల్సిందే. రాత్రికి రాత్రి సిటీని మార్చేద్దాం అనుకుంటే సాధ్యం కాదని గుర్తుంచుకోండి. డిజాస్టర్‌.. అంటే ఒక్క కూల్చివేతలే కాదు. ఇంకా చాలా ఉన్నయ్‌. అవన్నీ ఎందుకు హైడ్రా చేయడం లేదు. మూసీపై మీ ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ ఏంటీ ? ఏదీ లేకుండా కూల్చివేతే పరమావధిగా వ్యవహరిస్తారా ?' అని హైకోర్టు ప్రశ్నించింది.

'హైడ్రా పరిధి ఓఆర్‌ఆర్‌ లోపలే కదా.. ఎన్ని చెరువులు, కుంటలు ఉన్నయో తెలుసా ? ఎన్నింటికి ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్‌పై తుది నోటిఫికేషన్‌ ఇచ్చారు? హైడ్రా తీరు తీవ్ర అందోళనకరం.. అమీన్‌పూర్‌ ఆస్తిపై స్టేటస్‌ కో ఆదేశాలు ఇస్తున్నాం. తదుపరి విచారణలోగా హైడ్రా, ఎమ్మార్వో కౌంటర్‌ దాఖలు చేయాలి. విచారణ అక్టోబర్‌ 15కు వాయిదా వేస్తున్నాం' అని హైకోర్టు స్పష్టం చేసింది.

హైకోర్టు విచారణకు ఎమ్మార్వో ఫిజికల్‌గా హాజరవ్వగా.. ఆన్‌లైన్‌ ద్వారా హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ హాజరయ్యారు. విచారణలో భాగంగా.. ఎమ్మార్వో, హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు. అమీన్‌పూర్‌లో ఈ నెల 22న ఆదివారం భవనం కూల్చివేతపై జస్టిస్‌ కె. లక్ష్మణ్‌ విచారణ చేపట్టారు.

Read Entire Article