HMWSSB OTS Scheme 2024 : హైదరాబాద్ వాసులకు ఇదే చివరి ఛాన్స్..! పెండింగ్ బిల్లులపై డిస్కౌంట్, ఇలా క్లియర్ చేసుకోండి

1 month ago 84
ARTICLE AD

హైదరాబాద్ మహానగరంలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న నీటి బిల్లుల బకాయింపుల చెల్లింపునకు ప్రభుత్వం వన్ టైమ్ సెటిల్ మెంట్-2024 (ఓటీఎస్) ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ గడువు ఇవాళ్టితో (నవంబర్ 30) పూర్తి కానుంది. దీంతో రాయితీతో కూడిన బిల్లుల చెల్లింపు గడువు పూర్తి అవుతుందని జలమండలి అధికారులు తాజాగా ప్రకటన విడుదల చేశారు.

గడువులోపు ఓటీఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జలమండలి అధికారులు విజ్ఞప్తి చేశారు. గడువు లోపు పెండింగ్ లో ఉన్న అసలు మొత్తం కడితే.. ఎలాంటి వడ్డీ, ఆలస్య రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గడువు పూర్తయిన తర్వాత చెల్లిస్తే, పెండింగ్ బిల్లుల మీద వడ్డీతో పాటు పెనాల్టీ కట్టాల్సి వస్తుందని తెలిపారు.

ఇదే చివరి ఛాన్స్….

అక్టోబర్ లో ప్రారంభమైన ఈ పథకం ఆ నెల చివరి వరకు కొనసాగింది. అయితే పండగలు రావడం, ప్రజలు సొంతూళ్లకు వెళ్లడం, ఆర్థిక భారం పడటంతో పథకాన్ని సరిగా వినియోగించులేకపోయారు. మరోసారి పథకం గడువును పెంచాలని వారి నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో జల మండలి.. పథకం గడువును పెంచాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. మరో నెల అంటే నవంబర్ ఆఖరి వరకు పొడిగించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ గడువు కూడా నేటితో పూర్తి అవుతుంది.

ప్రజల నుంచి వినతులు రావడంతో ఇప్పటికే ఒకసారి గడువు పెంచిన ప్రభుత్వం.. ఈ పథకాన్ని మరోసారి పెంచే అవకాశం లేదు. పథకం గడువు ముగిసిన అనంతరం.. బిల్లులు పెండింగులో ఉన్న వినియోగదారులపై డిసంబ‌ర్ 1 నుంచి చ‌ర్య‌లు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అవసరమైతే వారి నల్లా కనెక్షన్ సైతం తొలగించనున్నారు.

ఎలా చెల్లించాలంటే…?

బిల్లుల చెల్లించుకునే వారు జలమండలి కార్యాలయాలను సంప్రదించవచ్చు. లేదా ఆన్ లైన్ విధానంలో మీ-సేవ, ఏపీ ఆన్ లైన్ కేంద్రాలు, ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, NEFT, RTGS, BPPS, జలమండలి అధికారిక వెబ్ సైట్, లైన్ మెన్ల ద్వారా చెల్లించవచ్చని అధికారులు సూచించారు.

ఓటీఎస్ 2024 నిబంధనలివే:

నల్లా కనెక్షన్ యాక్టివ్ లో ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.ఓటీఎస్ స్కీమ్ నవంబర్ 30, 2024 వరకు మాత్రమే అమల్లో ఉంటుంది.గతంలో ఓటీఎస్ పథకాన్ని వినియోగించుకోని వారు.. ఒకేసారి బిల్లు చెల్లిస్తే.. ఆలస్య రుసుం, వడ్డీ మాఫీ అవుతాయి.గతంలో ఓటీఎస్ పథకం ద్వారా ప్రయోజనం పొందిన వినియోగదారులకు 50 శాతం వరకు బిల్లు మాఫీ అవుతుంది.ఈ పథకం కింద ప్రయోజనం పొందాలనుకునే వినియోగదారులు.. భవిష్యత్తులో 24 నెలల పాటు తప్పనిసరిగా క్రమంగా బిల్లులు చెల్లిస్తామని అఫిడవిట్ రాసి ఇవ్వాలి. అంతేకాకుండా.. బిల్లు చెల్లింపుల విషయంలో వారు విఫలమైతే, ఈ పథకం కింద వారు పొందిన ప్రయోజనాన్ని రద్దు చేస్తారు.తమ నల్లా కనెక్షన్.. డిస్ కనెక్షన్ స్థితిలో ఉన్న వినియోగదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటే.. ఇప్పటి దాకా పెండింగ్ లో ఉన్న బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.నల్లా బిల్లుల బకాయిలపై వడ్డీమాఫీ కోసం అధికారులకు స్థాయిని బట్టి అమౌంట్ పరిధిని నిర్ణయించారు.దీని ప్రకారం.. మేనేజర్ స్థాయిలో రూ.2000 వరకు, డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.2001 నుంచి రూ.10,000 వరకు, జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.10,001 నుంచి రూ.1,00,000 వరకు, చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయిలో రూ.1,00,001 నుంచి అంతకంటే ఎక్కువ మాఫీ చేసే అధికారం ఉంది.

Whats_app_banner

Read Entire Article