Hyderabad Rains: హైదరాబాద్ వాసులారా జాగ్రత్త.. మళ్లీ 2016, 2020 సీన్ రిపీట్ అయ్యే అవకాశం!

2 months ago 71
ARTICLE AD

రాబోయే 24 నుంచి 36 గంటలలో హైదరాబాద్ నగరంలో అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. దాదాపు 200 నుంచి 300 మి.మీ వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇది అతిశయోక్తిగా అనిపించవచ్చు కానీ.. తోసిపుచ్చలేమని.. హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 2016, 2020 సంవత్సరాల్లో కురిసినట్టు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మధ్యాహ్నం తర్వాత భారీ వర్షాలు..

హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో గత 3 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మధ్యాహ్నం నుంచి చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరోవైపు దక్షణి తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. వరంగల్, హనుమకొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి.

నిండు కుండల్లా చెరువులు..

వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలకు చెరువులు నిండు కుండల్లా మారాయి. అనేక చెరువులు మత్తడి పోస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. చెరువుల్లో మత్తడి పోసే పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ.. ఉన్నతాధికారులకు సమాచారం చేరవేస్తున్నారు. మరో రెండ్రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది.

ఖమ్మం జిల్లాలో అతి భారీ వర్షం..

జనగామ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో అతి భారీ వర్షం కురిసింది. సత్తుపల్లి, అశ్వరావుపేట, కొత్తగూడెం ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు రహదారులు పలుచోట్ల ధ్వంసం అయ్యాయి. ఇల్లందు నుంచి కొత్తగూడెం వెళ్లే దారిలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. మహబూబాబాద్ నుంచి ఇల్లందు వెళ్లే దారిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఏపీలోనూ..

అటు ఏపీలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ, గుంటూరు నగరాలను వర్షాలు వణికిస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. అవసరం ఉంటే ప్రజలు బయటకు రావాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. పలు చోట్ల విద్యా సంస్థలకు సెలవు కూడా ప్రకటించింది. అటు వర్షాల కారణంగా చంద్రబాబు కర్నూలు పర్యటన కూడా రద్దు అయ్యింది. వర్షాల పరిస్థితిపై చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు.

Read Entire Article