Hyderabad : సివిల్స్ అభ్యర్థిని పరీక్ష కేంద్రానికి చేర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు

5 months ago 109
ARTICLE AD

Hyderabad : యూపీఎస్సీ ప్రిలిమ్స్ కోసమని పరీక్ష కేంద్రానికి ఓ యువతి ఆర్టీసీ బస్సులో వెళుతుంది. ట్రాఫిక్ సమస్య వల్ల ఆలస్యం అవుతుండడంతో సదరు యువతి తీవ్రంగా ఆందోళన చెందింది. అది గమనించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ ఆమెను తన ద్విచక్ర వాహనంపై మహావీర్ కాలేజీ లోని పరీక్ష కేంద్రానికి సకాలంలో తీసుకెళ్లారు. ఇదంతా కొందరు వాహనదారులు వీడియో తియ్యడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారి సీఎం రేవంత్ దృష్టికి వెళ్లింది. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ ను రేవంత్ రెడ్డి అభినందించారు.

"వాహనాల నియంత్రణ మాత్రమే… తన డ్యూటీ అనుకోకుండా.....సాటి మనిషికి సాయం చేయడం తన బాధ్యత అని భావించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ కు నా అభినందనలు....సురేష్ సహకారంతో సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకున్న సోదరి యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ " అంటూ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు.

ఒకేసారి 12 మంది సీఐలు, 4గురు ఎస్సైలు బదిలీ

ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్ రెడ్డి సర్కార్.....ఒక్కో శాఖను ప్రక్షాళన చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో విద్యుత్ శాఖలో ప్రక్షాళన మొదలుపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఆ తరువాత అన్నీ శాఖల్లో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. శనివారం రోజున ఒకేసారి రాష్ట్రంలో 20 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నిన్న ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో ఒకేసారి 16 మంది సీసీఎస్ సిబ్బందిపై బదిలీ వేటుపడింది. 12 మంది సీఐలు, 4గురు ఎస్సై లను బదిలీ చేస్తూ హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని తక్షణమే మల్టీజోన్ -2 లో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఇదే శాఖకు చెందిన ఏసీపీ ఉమామహేశ్వర రావు, సీఐ సుధాకర్ లను అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరి బదిలీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తం బదిలీ

గతంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సిబ్బందిని మొత్తం ఒకేసారి బదిలీ చేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్కడ పని చేసే హోంగార్డు స్థాయి నుంచి సీఐ వరకు మొత్తం 86 మందిని ఏకకాలంలో బదిలీ చేశారు. అయితే రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహుల్ యాక్సిడెంట్ కేసుతో పాటు పలు కీలమైన కేసులకు సంబంధించిన వివరాలను గత ప్రభుత్వ పెద్దలకు చెరవేస్తునట్టు గుర్తించడంతో హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి......ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు పంజాగుట్ట, ఇప్పుడు సీసీఎస్. అయితే హైదరాబాద్ కమిషనరేట్ చరిత్రలో ఇలా పోలీస్ స్టేషన్ మొత్తాన్ని బదిలీ చేయడం ఇదే తొలిసారి.

హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్

షాయినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న జి.వెంకటరమణ రెడ్డిని సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వెంకటరమణ రెడ్డిపై పలు అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నగర కమిషనర్ విచారణ జరిపి ఆయనను సస్పెండ్ చేశారు. షాయినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. దీంతోనే ఆయన్ను సస్పెండ్ చేశారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

Read Entire Article