HYDRA : మూసీ వద్ద హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టడంలేదు, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

2 weeks ago 138
ARTICLE AD

HYDRA : మూసీ న‌దికి ఇరువైపులా స‌ర్వేల‌తో హైడ్రాకు సంబంధం లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. మూసీ నివాసితుల‌ను హైడ్రా త‌ర‌లించ‌డంలేదని పేర్కొన్నారు. అక్కడ ఎలాంటి కూల్చివేత‌లు హైడ్రా చేప‌ట్టడంలేదని తెలిపారు. మూసీ ప‌రీవాహ‌క ప్రాంతంలోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయ‌డంలేదన్నారు. మూసీ సుంద‌రీక‌ర‌ణ ప్రత్యేక ప్రాజెక్టు అని, దీనిని మూసీ రివ‌ర్‌ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చేప‌డుతోందన్నారు.

"హైడ్రా అంటే కూల్చివేత‌లే కాదు. హైడ్రా ప‌రిధి ఔట‌ర్ రింగు రోడ్డు వ‌ర‌కే. న‌గ‌రంలోనే కాదు.. రాష్ట్రంలో.. ఆఖ‌రుకు ఇత‌ర రాష్ట్రాల్లో కూల్చివేత‌లు కూడా హైడ్రాకు ఆపాదించి సామాజిక మాధ్యమాల్లో ప్రజ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నాయి. హైడ్రా పేద‌ల నివాసాల జోలికి వెళ్లదు. అలాగే నివాశం ఉంటే ఆ ఇళ్లను కూల్చదు. కూల్చివేత‌ల‌న్నీ హైడ్రావి కావు. ప్రజ‌లు, సామాజిక మాధ్యమాలు గుర్తించాలి. ప్రకృతి వ‌న‌రుల ప‌రిర‌క్షణ‌, చెరువులు, కుంట‌లు, నాలాలను కాపాడ‌డం, వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల స‌మ‌యంలో ర‌హ‌దారులు, నివాస ప్రాంతాలు మునిగిపోకుండా చ‌ర్యలు తీసుకోవడం హైడ్రా పని" - ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్

కూల్చివేతలు కాదు,చెరువుల పునరుద్దరణ హైడ్రా లక్ష్యమని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. పేదలు, మధ్య తరగతి ప్రజల ఇళ్లను హైడ్రా కూల్చివేయదన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, అసత్య ప్రచారాలు నమ్మొద్దని సూచించారు.

ప్రకృతి వ‌న‌రులు కాపాడ‌డమే హైడ్రా విధి అన్నారు. న‌గ‌రం ఒక‌ప్పడు లేక్ సిటీగా పేరుండేదని, గొలుసుక‌ట్టు చెరువులు సాగు, తాగు నీరందించేవన్నారు. హైదరాబాద్ లోని చెరువుల‌ను పున‌రుద్ధరించ‌డం, వ‌ర‌ద నీరు ఆయా చెరువుల్లోకి ఎక్కడిక‌క్కడ చేరేలా చూడడమే హైడ్రా లక్ష్యం అన్నారు. వ‌ర‌ద‌నీటి కాలువ‌లు, నాలాలు ఆక్రమ‌ణ‌లు లేకుండా నీరు సాఫీగా సాగేలా చ‌ర్యలు తీసుకుంటామన్నారు. రెవెన్యూ, ఇరిగేష‌న్‌, నేష‌న‌ల్ రిమోటింగ్ సెన్సింగ్‌, స్టేట్ రిమోట్ సెన్సింగ్ విభాగాల‌తో అధ్యయ‌నం చేయించి.. చెరువుల ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ జోన్ల నిర్ధార‌ణ‌ చేస్తామన్నారు.

కూల్చివేతపై హైకోర్టు ఆగ్రహం

మూసీ కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. శని, ఆదివారాలు కూల్చివేతలేంటని ప్రశ్నించింది. తెలంగాణ హైకోర్టులో హైడ్రాపై సోమవారం విచారణ జరిగింది. ఈ విచారణకు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్ వర్చువల్‌గా హాజరైరయ్యారు. తాము అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పాలని.. హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు స్పష్టం చేసింది. చార్మినార్‌ను కూల్చాలని అక్కడి ఎమ్మార్వో చెబితే కూల్చేస్తారా అంటూ హైడ్రా కమిషనర్‌ను ప్రశ్నించింది. అటు అమీన్‌ పూర్‌ తహశీల్దార్‌ పైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవనాన్ని 48 గంటల్లో ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి 40 గంటల్లోపే ఎలా కూల్చుతారంటూ ధర్మాసనం సీరియస్‌ అయ్యింది.

'మీ ఇష్టం వచ్చినట్లు కూల్చివేస్తారా ? అదివారం కూల్చకూడదన్న నిబంధన కూడా తెలియదా? కనీసం ప్రభుత్వ న్యాయవాదులను అడగాలన్న ఉద్దేశం కూడా లేదా? ప్రజలను భయబ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారా? అలా అయితే.. కోర్టులు చేతులు కట్టుకొని కూర్చోవు. స్టే ఇచ్చిన తర్వాత కూడా కూల్చివేత చేపడతారా?' అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు జారీ చేసినప్పుడు వారి వాదన కూడా వినరా ? శనివారం సాయంత్రం ఇచ్చి.. ఆదివారం కూల్చివేతా? సెలవు దినం రోజున విధులకు హాజరై దూకుడుగా ఎందుకు కూల్చారు? రాజకీయ నాయకులు చెప్పింది వింటే మీరు ఇబ్బందులు పడతారు. చట్టం తెలుసుకోండి.. ఆ మేరకు ముందుకు వెళ్లండి' అని అధికారులకు హైకోర్టు సూచించింది.

Read Entire Article