ARTICLE AD
Jagityala Suicides: అభం శుభం తెలియని మూడేళ్ళ పాపను పట్టుకొని ఓ తల్లి బావిలోకి ఆత్మహత్య చేసుకుంది. క్షణికావేశం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. భర్త చేసే పని సరికాదని అడ్డుకున్నందుకు జరిగిన గొడవతో భార్య మనస్థాపం చెంది బలవన్మరణానికి పాల్పడింది. ఈ దారుణ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది.
సారంగాపూర్ మండలం అర్పపల్లి గ్రామంలో బొండ్ల మౌనిక (25) మూడేళ్ళ కూతురు సాహితి తో కలిసి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. భర్త సురేష్ తో జరిగిన గొడవతో మనస్థాపం చెందిన మౌనిక కూతురు తో సహా ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య గల కారణాలు తెలిస్తే అందరి హృదయాలను ద్రవింపజేస్తుంది. తల్లి కూతురు ఆత్మహత్యకు భర్త సురేష్ కారణమని అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని మౌనిక పుట్టింటి వారు ఆందోళనకు దిగారు.
వన్యప్రాణుల వేటే ఆత్మహత్యకు కారణమా?
ఆత్మహత్యకు పాల్పడిన మౌనిక భర్త సురేష్ వన్య ప్రాణులను వేటాడుతాడు. ఏ పని చేయకుండా వన్యప్రాణులు వేటాడడమే తన పనిగా పెట్టుకున్న సురేష్ ను భార్య మౌనిక మూగజీవాలను వేటాడడం సరైన పద్ధతి కాదని... చట్టవిరుద్దమని, పట్టుబడితే చర్యలు సీరియస్ గా ఉంటాయని భర్తకు హితవు చెప్పింది.
భార్య మాటలను పెడచెవిన పెట్టడమే కాకుండా సురేష్ నిత్యం వన్యప్రాణులను వేటాడడమే కాకుండా భార్యతో గొడవపడేవాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో పట్టుబడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భావించిన భార్య భర్తతో గొడవ పడింది. భర్త మందలించడంతో మనస్థాపం చెందిన మౌనిక కూతురుతో కలిసి బావిలోకి ఆత్మహత్య చేసుకుందని మౌనిక సోదరి తెలిపారు.
ఆత్మహత్యతో పాటు వన్య ప్రాణుల సంరక్షణ చట్టం కింద భర్త పై కేసు నమోదు
తల్లి కూతురు ఆత్మహత్యతో భర్త పై సూసైడ్ తోపాటు వన్య ప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. సురేష్ తో పాటు అతని తల్లిదండ్రులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పసి పాపతో సహా తల్లి ఆత్మహత్యకు కారణమైన భర్త పై కఠిన చర్యలు తీసుకోవాలని మౌనిక పుట్టింటివారు ఆందోళనకు దిగారు.
సురేష్ ఇంటిని ధ్వంసం చేసేందుకు యత్నించగా పోలీసుల జోక్యంతో మౌనిక కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గారు. అనూహ్యంగా అనుశ్చితంగా భర్త ప్రవర్తించడంతోనే రెండు నిండు ప్రాణాలను బలిగొందని స్థానికులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు.
(రిపోర్టింగ్ కేవీ.రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా)