Jagtial Congress : సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి...! జగిత్యాల కాంగ్రెస్ లో ఫ్లెక్సీవార్‌

5 months ago 123
ARTICLE AD

Flexi War in Jagtial Congress :  జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గుట్టు చప్పుడు కాకుండా కారు దిగి కాంగ్రెస్ లో చేరడంతో కాంగ్రెస్ లో అలజడి సృష్టించింది. కనీస సమాచారం లేకుండా ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరడంతో స్థానిక కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. 

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధం కాగా పార్టీ పెద్దలు రంగంలోకి దిగి డిల్లీకి జీవన్ రెడ్డి తీసుకెళ్ళి సముదాయించారు. సమస్య సద్దుమణిచేలా చర్యలు చేపట్టారు. కానీ అనుచరుల్లో మాత్రం అసంతృప్తి జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి.‌ అధిష్టానం ఆదేశంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సైలెంట్ గా ఉండగా అనుచరులు మాత్రం హంగామా సృష్టిస్తున్నారు. 

జగిత్యాల అభివృద్ధిని కాంక్షిస్తూ కాంగ్రెస్ లో చేరానని ఎమ్మెల్యే సంజయ్ ప్రకటించడంతో ఎమ్మెల్యేను స్వాగతిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన అనుచరులు జగిత్యాలలో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రతిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరులు తామేమి తక్కువ కాదన్నట్లు జగిత్యాల అంటే జీవన్ రెడ్డి... జీవన్ రెడ్డి అంటేనే జగిత్యాల అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

పోటాపోటీగా పట్టణంలో పలుచోట్ల ప్లెక్సీలు ఏర్పాటు చేసిన అనుచరులు తమ ఆధిపత్యాన్ని చాటుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎమ్మెల్యే అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జీవన్ రెడ్డి ఫోటో, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరులు ఏర్పాటు చేసిన ప్లెక్సీలో ఎమ్మెల్యే సంజయ్ ఫోటోలు పెట్టలేదు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు జగిత్యాలలో హాట్ టాపిక్ గా మారాయి.

జగిత్యాలలో జీవన్ రెడ్డి…

పార్టీ పెద్దలు అధిష్టానం జీవన్ రెడ్డిని సముదాయించి చల్లబరచడంతో అలక వీడిన జీవన్ రెడ్డి జగిత్యాలకు చేరుకొని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. తనతో పాటు అసంతృప్తితో రగిలిపోతున్న కార్యకర్తలను సమదాయించి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు.‌ జరిగిన పరిణామాలతో కాస్త మనస్థాపంతో ఉన్నా పార్టీ కోసం పనిచేస్తానని చెప్పి నియోజకవర్గంలో అన్ని తానై వ్యవహరిస్తున్నారు. పార్టీలో కొందరు వ్యవహరించిన తీరుతో కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నప్పటికీ అధిష్టానం తగిన గుర్తింపుతో పాటు గౌరవం ఇస్తామని ప్రకటించడంతో జీవన్ రెడ్డి యధావిధిగా పార్టీ కార్యక్రమాల్లో బిజీగా మారారు.

హైదరాబాద్ కే పరిమితం అయిన ఎమ్మెల్యే సంజయ్…

అనుహ్యంగా రాత్రికి రాత్రే కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పార్టీలో చేరినప్పటి నుంచి ఇంకా హైదరాబాద్ కే పరిమితమయ్యాయి. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే సంజయ్ కి అటు బిఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ రెండు పార్టీల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిరసనల నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి ఎమ్మెల్యే సంజయ్ జగిత్యాలలో అడుగుపెట్టక హైదరాబాదులోనే ఉంటూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారు.

గుట్టు చప్పుడు కాకుండా ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి జిల్లాలోని ఏ ఒక్క కాంగ్రెస్ నాయకునికి తెలియకుండా సంజయ్ హైదరాబాద్ లెవల్లో చక్రం తిప్పి కారు దిగి హస్తం గూటికి చేరినట్లు తెలుస్తుంది. అందుకే జీవన్ రెడ్డికి ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులు బాసటగా నిలిచారు. 

మరి సంజయ్ కి అంత భరోసా ఇచ్చి కాంగ్రెస్ లో చేరేలా ప్రోత్సహించింది ఎవరనేది ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న. గతంలో బిఆర్ఎస్ లో ఉండి కేసీఆర్ తీరును వ్యతిరేకిస్తూ గులాబీ గూటికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరి ప్రస్తుతం రాష్ట్రం మంత్రివర్గంలో కొనసాగుతున్న ఇద్దరు‌ ఉమ్మడి జిల్లా నేతలకు కనీస సమాచారం లేకుండా చక్రం తిప్పినట్లు తెలుస్తుంది. 

ఎమ్మెల్యే సంజయ్ సైతం వ్యక్తిగత అవసరాలు, తన కుటుంబసభ్యుల ప్రయోజనాల కోసమే కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఉమ్మడి జిల్లా నేతలకు తెలియకుండా కాంగ్రెస్ లో చేరిన సంజయ్ ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్నప్పటికీ జిల్లాలో ఒంటరి అయినట్లేనా అని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఏదేమైనా పార్టీ పెద్దలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మధ్య సయోధ్య కుదుర్చితేనే జగిత్యాలలో పార్టీ గాడిన పడే పరిస్థితి ఉందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతున్నారు.

రిపోర్టింగ్: కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు

Read Entire Article