Kadem Project : పూర్తి కావొచ్చిన 'కడెం' ప్రాజెక్ట్ మరమ్మతు పనులు....!

4 months ago 84
ARTICLE AD

Kadem Project Repair Works : కడెం ప్రాజెక్ట్…. ఉమ్మడి ఆదిలాబాద్ లోని మూడు నియోజకవర్గాలలో సుమారు 70వేల ఎకరాలకు నిరందించిన ప్రాజెక్ట్. గడిచిన రెండేళ్లుగా వానాకాలం వరదలతో అతలాకుతలమైంది. 2022లో వరదలు వచ్చి ప్రాజెక్ట్ డేంజర్ జోన్ లోకి వెళ్లింది.

90 శాతం పనులు పూర్తి….

అప్పటి ప్రభుత్వం మరమ్మతులు చేయించలేదు. 2023 వానాకాలంలో మళ్లీ భారీ వరదలు వచ్చి ప్రాజెక్ట్ ను అతలాకుతలం చేశాయి. వరదలకు దెబ్బతిన్న ప్రాజెక్ట్ మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతో నాలుగు నెలలుగా మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. వరద గేట్ల మరమ్మతు పనులు తుది దశకు చేరినట్లు ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు. సీఈ శ్రీనివాస్ వారంలో రెండు రోజులుగా కడెంలోనే ఉంటూ మరమ్మతు పనులను పర్యవేక్షిస్తున్నారు.

కడెం ప్రాజెక్ట్ వరద గేట్ల మరమ్మతు పనులకు రాష్ట్ర ప్రభుత్వం జనవరి 29న రూ.5.46 కోట్లు మంజూరు చేసింది. నాలుగు నెలల నుంచి చేపట్టిన మరమ్మతు పనులు 90 శాతం పూర్తయినట్లు అధికారులు చెప్పారు. వరద గేట్లకు కొత్త రూలర్స్, రబ్బర్లు, సీల్స్, గేర్ బాక్స్లు, బ్రేక్ లైనర్స్ అమర్చారు.

కొన్ని వరద గేట్లకు కొత్త మోటార్లు బిగించారు. సివిల్ వర్క్ లో భాగంగా స్పిల్ వే పనులు, ఆఫ్రాన్, వాల్స్ పనులు పూర్తయ్యాయి. కొన్ని మైనర్ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. కౌంటర్ వెయిట్ బిగించాలి.

వరద గేట్ల పనులు చివరి దశకు చేరినా ప్రాజెక్ట్ 2వ నంబర్ వరద గేటుకు కౌంటర్ వెయిట్ బిగించాల్సి ఉంది. ఇందుకోసం నట్ బోల్ట్ లు అందుబాటులో లేకపోవడంతో జాప్యం జరుగుతోంది. బెంగుళూరుకు చెందిన హిల్జీ అనే సంస్థ నట్, బోల్ట్స్ తయారు చేస్తోందని… అవి రాగానే కౌంటర్ వెయిట్ను బిగిస్తామని అధికారులు తెలిపారు.

ప్రాజెక్ట్ ఎలక్ట్రికల్ వ్యవస్థ పునరుద్ధరణ నిమిత్తం మార్చి 15న రాష్ట్ర ప్రభుత్వం రూ.3.81 కోట్లు మం జూరు చేసింది. ఇన్నేళ్లుగా కడెం మండల కేంద్రం ఫీడర్ నుంచి ప్రాజెక్టుకు విద్యుత్ సరాఫరా అయ్యేది. ఈ ఫీడర్ లో తరచూ సమస్యలు తలెత్తేవి. దీంతో ప్రాజెక్టుకు మిషన్ భగీరథకు సంబంధించి ఫీడర్ ద్వారా సరాఫరా ఇచ్చేందుకు 500 కేవీ నూతన ట్రాన్స్ ఫార్మర్ ప్రాజెక్టు గేజ్ రూం వరకు ప్రత్యేక లైన్ వేశారు.

రైతులకు అండగా ఉంటాం : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

రైతులను ఆదుకొనేందుకు తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ అన్నారు. ఆగస్టు 15 నాటికి రైతులకు పూర్తిగా బ్యాంకు రుణాలు మాఫీ చేస్తామన్నారు. కడెం ఆయకట్టు కింద చివరి పంట పొలం వరకు నీరు అందించేందుకు మరమ్మతులు చేపట్టామని తెలిపారు. ఈ ఏడాది కడెం ప్రాజెక్ట్ లో నీరు నిలిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారని అన్నారు.

రిపోర్టింగ్ : వేణుగోపాల్ కామాజి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా

Read Entire Article