ARTICLE AD
Warangal Kakatiya University : కాకతీయ యూనివర్సిటీలోని క్యాంపస్ హాస్టల్ లో పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని తీవ్ర గాయాల పాలైంది. హాస్టల్ లోని సీలింగ్ ఊడి పడటంతో విద్యార్థి తలకు గాయాలై తీవ్ర రక్త స్రావం జరిగింది. దీంతో గమనించిన తోటి స్టూడెంట్స్ ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
హాస్టల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందంటూ రిజిస్ట్రార్ మల్లారెడ్డిని నిలదీశారు. దీంతో యూనివర్సిటీలో గందరగోళం ఏర్పడింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలం మంగోలిగూడెంకు చెందిన లూనావత్ సంధ్య కేయూలో పొలిటికల్ సైన్స్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. వర్సిటీ అధికారులు క్యాంపస్ లోని పోతన హాస్టల్ ను అమ్మాయిలకు కేటాయించగా, అందులో ఉంటూ సంధ్య చదువులు సాగిస్తోంది.
ఇంతవరకు బాగానే ఉండగా, శుక్రవారం రాత్రి క్యాంపస్ మెస్ లో భోజనం చేసి వచ్చిన ఆమె.. హాస్టల్ గదిలో బట్టలు సర్దుకుంటుండగా సీలింగ్ ఫ్యాన్ ఒక్కసారిగా ఊడిపడింది. దీంతో సంధ్య తల నుదుటి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. రక్త స్రావం జరగడంతో ఆమె అక్కడే పడిపోగా.. గమనించిన తోటి విద్యార్థినులు హాస్టల్ సూపర్ వైజర్ శోభ సహాయంతో సంధ్యను వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
నుదుటికి గాయం కావడంతో అక్కడి డాక్టర్లు దాదాపు 18 కుట్లు వేశారు. దీంతో విషయం తెలుసుకున్న కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి, హాస్టల్ డైరెక్టర్ రాజ్ కుమార్ హాస్పిటల్ కు వెళ్లి విద్యార్థిని పరామర్శించారు. ఘటన గురించి ఆరా తీశారు.
రిజిస్ట్రార్ ను నిలదీసిన స్టూడెంట్స్
విద్యార్థిని గాయపడానికి హాస్టల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ క్యాంపస్ స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. హాస్టల్ లో శిథిలావస్థకు చేరిందని, అయినా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ లో బాత్ రూమ్ లు కూడా సరిగా లేవని, కలుషితమైన తాగు నీటికే సరఫరా చేస్తున్నారని రిజిస్ట్రార్ మల్లారెడ్డిని నిలదీశారు.
దీంతో యూనివర్సిటీలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం హాస్టల్ లో సమస్యలు పరిష్కరిస్తామని రిజిస్ట్రార్, హాస్టల్ డైరెక్టర్ హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విమరించారు.
క్యాంపస్ లోని ఇదివరకు బాయ్స్ ఉండే పోతన హాస్టల్ ను గత ఏడాది అప్పటి వీసీ తాటికొండ రమేశ్ అమ్మాయిలకు కేటాయించారు. న్యాక్ ఏ గ్రేడ్ పనుల్లో భాగంగా లక్షల రూపాయలతో హాస్టల్ కు రిపేర్లు చేయించి అమ్మాయిలకు అప్పగించారు. కాగా కొన్నేళ్లుగా బాయ్స్ కే పరిమితమైన హాస్టల్ ను అప్పటికప్పుడు ఖాళీ చేయించి, అమ్మాయిలకు కేటాయించడం పట్ల అప్పట్లోనే విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
అప్పటి వీసీ, రిజిస్ట్రార్ ను కలిసి హాస్టల్ దుస్థితిని కూడా వివరించారు. అయినా నామమాత్రపు పనులతో రంగులు వేయించి, అమ్మాయిలకు ఇచ్చేశారు. కానీ శిథిలావస్థకు చేరిన హాస్టల్కు సరైన మరమ్మతులు చేపట్టకపోవడం వల్లే ఇప్పుడీ దుస్థితి ఏర్పడిందని కేయూ విద్యార్థి సంఘాల నేతలు, ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
సరైన రిపేర్లు చేయకపోతే హాస్టల్ కూలిపోయినా ఆశ్చర్య పోనవసరం లేదని అభిప్రాయాలు వ్యక్థం చేస్తున్నారు. ఇకనైనా క్యాంపస్ లో శిథిలావస్థకు చేరిన హాస్టళ్లకు సరైన మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.