ARTICLE AD
Karimnagar Mayor: మొన్నటి వరకు కరీంనగర్ పట్టణానికి ఎంపీగా బండి సంజయ్ ఏం చేశారని విమర్శించిన కరీంనగర్ మేయర్ బిఆర్ఎస్ నేత వై.సునీల్ రావు నేడు కరీంనగర్ అభివృద్ధికి స్మార్ట్ సిటీ నిధులు తీసుకువచ్చిన ఘనత బండి సంజయ్ కుమార్ దేనని చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా తొలిసారి కరీంనగర్ లో అడుగు పెట్టిన బండి సంజయ్ ని మేయర్ మర్యాదపూర్వకంగా కలిసిన శాలువతో సత్కరించింది కరీంనగర్ అభివృద్ధికి చేస్తున్న కృషిని అభినందించారు. బండి సంజయ్ కృషి ఫలితంగానే కరీంనగర్ కు స్మార్ట్ సిటీ నిధులు వచ్చాయని తెలిపారు. కరీంనగర్ కు బండి సంజయ్ సహకారం మరువలేనిదని స్పష్టం చేశారు. విమర్శించిన వ్యక్తి నేడు ప్రశంసించడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.
మేయర్ టార్గెట్ కాంగ్రెస్...
మేయర్ టార్గెట్ గా కాంగ్రెస్ పావులు కదపడంతోనే బిజెపికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ కాంగ్రెస్ మేయర్ పై అవిశ్వాసం పెడితే బిజెపి సహకారంతో పూర్తిస్థాయి మేయర్ గా కొనసాగాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం నగరపాలక సంస్థలో మొత్తం 60 డివిజన్ లు ఉండగా కాంగ్రెస్ 14, బిజేపి 12, బిఆర్ఎస్ కు 24, ఎంఐఎంకు పది మంది కార్పోరేటర్ లు ఉన్నారు. మరో డజన్ మంది బిఆర్ఎస్ చెందిన కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి కొందరు బిజెపిలోకి మరికొందరు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో మేయర్ ను టార్గెట్ గా చేసుకొని మంత్రి పొన్నం ప్రభాకర్ నగరపాలక సంస్థ పై నజర్ వేయడంతో ముందు జాగ్రత్తగా మేయర్ బిజెపికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లు తాజాగా పరిణామాలను బట్టీ తెలుస్తోంది.
రెండో రోజు కరీంనగర్ లో బండి సంజయ్ బిజీ…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి కరీంనగర్ గడ్డపై అడుగుపెట్టిన బండి సంజయ్ రెండో రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొని బిజిబిజీగా గడిపారు. నగరంలోని మహాశక్తి ఆలయంతో పాటు పాతబజార్ లోని శివాలయం, ప్రకాష్ గంజ్ లోని విఘ్నేశ్వర ఆలయం సందర్శించి పూజలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన నాయకులను కార్యకర్తలను కలిసి వినతులను స్వీకరించారు.
బండిని కలిసిన గ్రూప్-1 అభ్యర్ధులు…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని గ్రూప్-1 అభ్యర్ధులు కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కోసం ప్రిలిమ్స్ నుండి 1:100 చొప్పున ఎంపిక చేసేలా చూడాలని నిరుద్యోగులు కోరారు. గత నాలుగేళ్లలో మూడు సార్లు గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయడంవల్ల నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరిగిందని మంత్రి ఎదుట ఆవేధన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 1:100 చొప్పున మెయిన్స్ కు ఎంపిక చేస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 6 నెలలైనా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రూప్ 1 పోస్టులు అత్యధికంగా ఉండటంవల్ల 1: 50 చొప్పున మెయిన్స్ కు ఎంపిక చేస్తే నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. కేరళ రాష్ట్రంలో గ్రూప్ 1 మెయిన్స్ కు 1:75 చొప్పున ఎంపిక చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
గతంలో వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 1:100 చొప్పున మెయిన్స్ కు ఎంపిక చేశారని తెలిపారు. ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే భారీ ఎత్తున ధర్నా చేయనున్నట్లు చెప్పారు. నిరుద్యోగుల డిమాండ్ న్యాయమైనదేనని బండి సంజయ్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 1:100 చొప్పున మెయిన్స్ కు ఎంపిక చేయాలని బండి సంజయ్ కోరారు. నిరుద్యోగుల డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని బండి సంజయ్ హామీ ఇచ్చారు.
(రిపోర్టింగ్ కేవీరెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా)