Karimnagar Politics: కరీంనగర్‌ల ఫ్లెక్సీల కలకలం, పార్టీ ఫిరాయింపు దారులకు వార్నింగ్‌లతో కూడిన ఫ్లెక్సీలు

6 months ago 133
ARTICLE AD

Karimnagar Politics: ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ లో దూకే నాయకుల్లారా ఖబడ్దార్ అంటు నగరంలో పలుచోట్ల ప్లెక్సీలు వెలిసాయి. చెప్పు తెగుద్ది అనే విధంగా ఉన్న ప్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారనేది ఆసక్తికరమైన చర్చ సాగుతుంది.

కరీంనగర్ లో అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికలతో అధికారంలోకి రావడంతో బిఆర్ఎస్ నుంచి పలువురు కార్పోరేటర్ లతోపాటు నాయకులు కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 14 మంది బిఆర్ఎస్ కార్పోరేటర్ లలో 12 మంది కాంగ్రెస్ లో, ఇద్దరు బిజేపి లో చేరారు. మరికొందరు అదేబాటలో ఉన్నారని ప్రస్తుతం ప్రచారం జరుగుతున్నది.

ఈ క్రమంలో నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ఎదుట వెలసిన ఫ్లెక్సీ ఆలోచింప చేయడంతో పాటు తీవ్ర కలకలం రేపింది. పార్టీ మారిన కార్పొరేటర్లకు వ్యతిరేకంగా తీవ్ర పదజాలంతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం వెనుక ఎవరున్నారనే ఆసక్తికరమైన చర్చా సాగుతోంది. ఎవరి పనై ఉంటుందని ఆరా తీసే పనిలో నాయకులు నిమగ్నమయ్యారు.

ఆ పని ఎవరిది....

పార్టీ పిరాయింపుదారులకు హెచ్చరికలా వెలసిన ప్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారనేది స్పష్టత లేక ఒకరిపై మరొకరు నిందలు వేసుకునే పనిలో నాయకులు ఉన్నారు. ఆయా పార్టీల్లో చేరగా మిగిలిన వారినైనా కాపాడుకునేందుకు బీఆర్ఎస్ నేతలే ఫ్లెక్సీ పెట్టించి ఉంటారని కొందరు చెబుతుండగా, పార్టీకి ఇంత కాలం సేవ చేసిన తమకు చివరి నిమిషంలో మొండి చేయి చూపుతారా? అన్న ఆవేదనతో కాంగ్రెస్ నేతలే ఏర్పాటు చేసి ఉంటారని మరి కొందరు భావిస్తున్నారు.

ఆ సంస్కృతి కాంగ్రెస్ దే అని బిఆర్ఎస్ ఆరోపిస్తుండగా బిఆర్ఎస్ లో కొందరు పార్టీని కాపాడుకునేందుకు ప్లెక్సీ జిమ్మిక్కులు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. ఏదిఏమైనా ఈ ఫ్లెక్స్ పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లకు మాత్రం మింగుడు పడటం లేదు. మరో ఆరు నెలల్లో మున్సిపల్ ఎన్నికల జరగనున్న దృష్ట్యా ముందు జాగ్రత్తగా పలువురు కార్పొరేటర్లు పార్టీ మారి సీట్ కన్ఫర్మ్ చేసుకుందామనుకుంటుండగా, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతతో మున్ముందు పరిస్థితులు ఎట్లుంటయోనని దిగులు పడుతునట్లు తెలుస్తోంది.

45 మ్యాజిక్ ఫిగర్ పైనే నజర్….

పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో కరీంనగర్ నగర పాలక సంస్థలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారనున్నాయి. ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం మరో ఆరు నెలలు ఉండగా, మ్యాజిక్ ఫిగర్ 45 పైనే ప్రస్తుతం అందరి దృష్టిపడింది. నగరంలో 60 డివిజన్లు ఉండగా, మూడొంతుల మెజార్టీకి 45 సీట్లు అవసరం.

నగరపాలకసంస్థకు 2020లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అధికారం చేపట్టింది. 33 స్థానాల్లో టీఆర్ఎస్, 13 స్థానాల్లో బీజేపీ, ఎంఐఎం ఆరు, స్వతంత్రులు ఐదుగురు, టీఆర్ఎస్ రెబెల్స్ ముగ్గురు గెలుపొందారు. అనంతరం మారిన పరిణామాలతో బీజేపీ నుంచి ఐదుగురు, స్వతంత్రులు నలుగురు, రెబెల్స్ ముగ్గురు బీఆర్ఎస్ లో చేరారు.

ఒక స్వతంత్రుడు ఎంఐఎం లో, బీఆర్ఎస్ కార్పొరేటర్ ఒకరు బీజేపీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ కు 44, బీజేపీకి 9, ఎంఐఎంకు 7గురు కార్పొరేటర్లయ్యారు. కాగా మారిన తాజా పరిస్థితుల్లో 14మంది పార్టీ మారడంతో, బీఆర్ఎస్ కు 30, కాంగ్రెస్ కు 12, బీజేపీకి 11, ఎంఐఎంకు 7 స్థానాలున్నాయి. ఇలాంటి పరిస్థితిలో పార్టీ పిరాయింపులు లేకుండా చేసేందుకే వ్యూహాత్మకంగా కొందరు ప్లెక్సీ ఏర్పాటు చేసినట్లు భావిస్తున్నారు.

(రిపోర్టింగ్ కేవీ. రెడ్డి, కరీంనగర్)

Read Entire Article