Karimnagar : మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులు.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన

1 month ago 73
ARTICLE AD

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు రోడ్డెక్కాయి. రాష్ట్రంలోనే తొలిసారిగా కరీంనగర్ నుంచి హైదరాబాద్ రూట్ లో 35 బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించారు. హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులనే నడపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు.

రాబోయే రోజుల్లో మహిళా సమాఖ్య ఆద్వర్యంలో ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయిస్తామని.. అందుకు సమాలోచనలు జరుగుతున్నాయని మంత్రి పొన్నం తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ స్కీమ్ ప్రారంభించి 300 రోజులు అవుతుందని చెప్పారు. రూ.3200 కోట్ల వ్యయం కాగా.. 92 కోట్ల మంది మహిళలు ఫ్రీగా ప్రయాణం చేశారని వివరించారు.

గతంలో 15 వేల ఆర్టీసీ బస్సులు ఉంటే.. గత పాలకుల నిర్లక్ష్యంతో 9500 తగ్గాయని మంత్రి పొన్నం ఆరోపించారు. ఫ్రీ బస్ సౌకర్యంతో బస్సులు కావాలనే డిమాండ్ ప్రస్తుతం ఉందన్నారు. నూతనంగా ఆర్టీసీ-ప్రభుత్వ భాగస్వామ్యంతో బస్సులు కొనుగోలు చేస్తుందన్నారు. మహిళా సమాఖ్యలు, మెప్నా ద్వారా బస్సులు కొనుగోలు చేసేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీలో ఉద్యోగుల భర్తీ, కార్మికులకు పీఆర్సీ, కారుణ్య నియామకాల సమస్యలన్ని దసరా లోపు పరిష్కరిస్తామన్నారు.

జేబీఎంతో ఆర్టీసీ ఒప్పందం..

ఆర్టీసీలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లో ఎలక్ట్రిక్ బస్‌లను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల ఒక్క డిజిల్ బస్ కూడా ఉండకుండా ప్రణాళికలు తయారు చేస్తున్నామని వివరించారు.

పర్యివరణ పరిరక్షణ, సౌండ్ పొల్యూషన్ లేకుండా హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. జేబీఎం సంస్థతో ఆర్టీసీ ఒప్పందం చేసుకొని.. తొలివిడతగా కరీంనగర్ రీజియన్‌కు 70 ఎలక్ట్రికల్ సూపర్ లగ్జరీ బస్సులను మంజూరు చేయగా.. అందులో 35 హైదరాబాద్ రూట్లో ప్రారంభించామని చెప్పారు.

ఈ బస్సులు అద్దె ప్రాతిపాదికన నడుస్తాయని, ఆపరేషన్ అండ్ పర్యవేక్షణ ఆర్టీసీ చూసుకుంటుందని మంత్రి తెలిపారు. 12 మీటర్ల పొడవు గల ఎలక్ట్రికల్ సూపర్ లగ్జరీ బస్సులు.. పూర్తిగా ఎలక్ట్రిక్ బ్యాటరీలతో ఆపరేట్ అవుతాయని, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టంతో ముందు, వెనుక పూర్తి ఎయిర్ బ్రేక్ సిస్టం ఉంటుందని వివరించారు. ప్రయాణికుల భద్రత కోసం నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు. 41 సీట్ల సామర్థ్యం ఉన్న బస్సులో.. కరీంనగర్ నుంచి హైదరాబాదుకు పెద్దలకు రూ.330, పిల్లలకు రూ.200 ఛార్జి వసూలు చేస్తారని వివరించారు.

ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ప్రసక్తే లేదు..

ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ప్రసక్తే లేదని సంస్థ ఎండి సజ్జనార్ స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ సంస్థ ఆపరేటింగ్ చేస్తునప్పటికీ.. ఆర్టీసీ కంట్రోల్ లోనే నడుస్తాయని తెలిపారు. బస్సుల ఛార్జింగ్ కోసం కరీంనగర్ 2 డిపో తో పాటు వరంగల్, నిజామాబాద్, నల్గొండ, హైదరాబాద్ 2, సూర్యాపేట డిపోలలో పాయింట్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. త్వరలో 500 ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని సజ్జనార్ తెలిపారు.

(రిపోర్టింగ్- కెవి రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Read Entire Article