KCR Comments : దొంగల్లో కలిసేటోళ్ల గురించి బాధలేదు - కేసీఆర్

4 months ago 124
ARTICLE AD

BRS Chief KCR : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన… పలు అంశాలపై మాట్లాడారు. ఒకరు పోతే పదిమంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుకుంటుందని వ్యాఖ్యానించారు. పార్టీని వీడి దొంగలతో కలిసెటోళ్ల గురించి బాధలేదన్నారు. తెలంగాణ సాధించిన మనకు గిదో లెక్కనా? అంటూ కామెంట్స్ చేశారు.

వారి గురించి ఆలోచన అవసరం లేదు - కేసీఆర్

సమైక్యవాదులతో కలబడి నిలబడి అత్యంత కష్టతరమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని కేసీఆర్ గుర్తు చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఒక లెక్కనే కాదని… పార్టీ నుంచి పోయి దొంగల్ల కలుస్తున్న నాయకుల గురించి ఏమాత్రం ఆలోచించవలసిన అవసరం లేదన్నారు. ఒకరు పోతే పదిమంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుకుంటుందని చెప్పుకొచ్చారు.

చేరుకోవాల్సిన మైలురాళ్లు ఇంకా చాలా మిగిలి ఉన్నాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను,కలలను నెరవేర్చగలిగే అవగాహన మనకు మాత్రమే ఉందని నేతలు, కార్యకర్తను ఉద్దేశించి అన్నారు. తెలంగాణ ఆత్మను అర్థం చేసుకుంటూ సమస్యల లోతును పట్టుకోగలిగి పరిష్కరించగలిగే సత్తా బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు.

కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల నుంచి వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ…..”మనం రెట్టించిన ఉత్సాహంతో భవిష్యత్తులో ఇంకా బాగా ప్రజలకోసం పనిచేయాల్సి ఉంది. ప్రజలు అవకాశమిస్తే..గత పదేండ్లు చిత్తశుద్ధితో రాజీపడకుండా ఉద్యమ ఆకాంక్షల సాధనదిశగా లక్ష్యం ప్రకారం పనిచేసి ప్రగతిని సాధించాం. ప్రజల మన్ననలను పొందాం. వ్యవసాయం,సాగునీరు,విద్యుత్తు వంటి అనేక మౌలిక వ్యవస్థలను మెరుగుపరుస్తూ అనేక ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాం" అని అన్నారు.

"ఆనాడు మనం ఉద్యమంలోకి దిగినప్పుడు మనతో ఎవరున్నారు.?నాడైనా నెడైనా నాయకులను తయారు చేసుకునేది పార్టీనే. మొన్న జగిత్యాల నుంచి ఒకాయన(ఎమ్మెల్యే సంజయ్ కుమార్) పోయి దొంగలల్ల కలిసిండు. బాధ పడేదేమీలేదు. ఆయనను తయారుచేసింది పార్టీనే. అంతకన్నా మెరుగైన నాయకత్వాన్ని పార్టీ తయారుచేసుకుంటది” అని కేసీఆర్ కామెంట్స్ చేశారు.

మూడు రోజులు విరామం….

ఎర్రవెల్లిలో గత పదిహేను రోజులుగా నిరంతరాయంగా కార్యకర్తలు, నేతలను కేసీఆర్ కలుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రకటన విడుదల చేసింది. ప్రజల ఆత్మీయ సమావేశాలకు శనివారం నుంచి సోమవారం దాకా మూడురోజుల పాటు విరామం ఇవ్వాలని నిర్ణయించిందని తెలిపింది.

ఈ మేరకు అధినేత కేసీఆర్ తో పార్టీ ముఖ్యనేతలు చర్చించి నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది. పార్టీ నేతలతో కీలక సమావేశాలు, కార్యాచరణల రూపకల్పన తదితర సమావేశాల నేపథ్యంలో తదుపరి ప్రకటన తర్వాతే సమావేశాలు పున: ప్రారంభమవుతాయని పేర్కొంది. తదుపరి ప్రకటన వచ్చేంత వరకు ముందస్తు సమాచారం లేకుండా ఫామ్ హౌస్ కు రావొద్దని కోరింది.

Read Entire Article