ARTICLE AD
వికారాబాద్ జిల్లా పరిధిలోని లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం భూసేకరణ చేయాలని సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే స్థానికంగా ఉన్న గిరిజనలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇటీవలే గ్రామానికి వెళ్లిన జిల్లా కలెక్టర్ తో పాటు పలువురు అధికారులను కూడా అడ్డుకొని… దాడికి యత్నించారు. తమ ప్రాంతంలో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయవద్దని… భూములను తీసుకోవద్దని గిరిజనులు ఆందోళనలు చేస్తున్నారు.
గిరిజనుల ఆందోళనల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. లగచర్లలో భూసేకరణను రద్దు చేసింది. దుద్యాల మండలం లగచర్ల, హకీంపేట్ పోలేపల్లి గ్రామాల్లో భూసేకరణను నిలిపివేస్తున్నట్లు ప్రకటన ఇచ్చింది. భూసేకరణ చట్టం - 2013 సెక్షన్ 93 ప్రకారం ఉపసంహరణ నోటిఫికేషన్ ఇస్తున్నట్లు పేర్కొంది.
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల, పోలేపల్లి, హకీంపెట్ గ్రామాల్లో ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. భూ సేకరణ చేస్తున్నట్లు 19 జూలై 2024 రోజున గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ దిశగానే అడుగులు వేస్తూ వచ్చింది. అయితే స్థానికంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో… రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గింది. అయితే ఇండస్ట్రీయల్ పార్క్ పేరుతో కొత్త గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సర్కార్ సిద్ధమైనట్లు తెలిసింది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
ఇటీవలే సీఎం రేవంత్ కీలక ప్రకటన..
లగచర్లలో గిరిజనుల ఆందోళనలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటీవలే స్పందించారు. లగచర్లలో ఏర్పాటు చేసేది ఫార్మా కంపెనీ కాదని… ఇండస్ట్రియల్ కారిడార్ అని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఇండస్ట్రియల్ కారిడార్‌ను ప్రతిపాదించినట్టు చెప్పారు.
కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధికి చేపడుతున్న ప్రణాళికలను సమగ్రంగా వివరించారు. కొడంగల్‌లో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ కాదన్న విషయాన్ని గుర్తుచేశారు. కొడంగల్ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యత అని, సొంత నియోజకవర్గ ప్రజలకు మేలు చేయాలన్నదే తన సంకల్పమని చెప్పారు. సొంత నియోజకవర్గ ప్రజలకు ప్రయోజనం చేయడమే తప్ప ఎవరికీ నష్టం కలిగించడం లేదని చెప్పారు. ఉపాధికి అవకాశాలు పెంచే దిశగా ఇండస్ట్రియల్ కారిడార్‌లో కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు.
"2009 నుండి కొడంగల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. అత్యంత వెనకబడిన నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న తపన ఉంది. నా ప్రజలకు మేలు చేయాలన్న తపన, తలంపే తప్ప వారిని ఇబ్బంది పెట్టాలని నేనెందుకు అనుకుంటాను. అటువంటి ఆలోచన కలలో కూడా చేయనని వామపక్ష నేతలతో నా ఆలోచన పంచుకున్నాను" అని కూడా సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
భూసేకరణ ప్రక్రియలో కూడా పరిహారం పెంచే విషయంపై కూడా ఆలోచిస్తామని సీఎం రేవంత్ చెప్పారు. అయితే ఆ దిశగా సర్కార్ నుంచి కీలక ప్రకటన వస్తుందని అంతా భావించారు. కానీ గిరిజనుల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. భూసేకరణ ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో లగచర్ల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.